చదువును ప్రోత్సహించే లక్ష్యంగా ‘కల్యాణమస్తు, షాదీ తోఫా’

వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

ప్రోత్సాహకం గతం కంటే రెట్టింపు చేశాం.. చదువుల కోసం గొప్ప మార్పులు తెచ్చాం

వివాహం జరిగిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు

గ్రామ, వార్డు సచివాలయాల్లో డాక్యుమెంట్స్‌ సమర్పించాలి

వెరిఫికేషన్‌ పూర్తిచేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులకు సాయం

రేపటి నుంచి ఈ రెండు పథకాలు అమల్లోకి వస్తాయి

గత ప్రభుత్వం పెళ్లికానుక పథకానికి 2018లో ఎగనామం పెట్టింది

17,709 మందికి పెళ్లికానుక ఇవ్వకుండా రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది

తాడేపల్లి: ‘‘పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో గొప్ప విప్లవాత్మక అడుగుపడుతోంది. వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తెచ్చాం. ఇది ఈ జనరేషన్‌ను ప్రోత్సహించడం ఒక్కటే కాదు.. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకొని ఉంటే.. వారికి పుట్టే పిల్లలను కూడా చదివించే గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ (రేపటి) నుంచి ఈ పథకాలు అమ‌లులోకి రానున్నాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో పెళ్లికానుక పేరుతో అందించే సాయం 2018లో అర్థాంతరంగా నిలిపేశారని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. మనందరి ప్రభుత్వం మన పిల్లలకు మంచి జరగాలని, వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా ప‌థ‌కాల‌ను తెచ్చింద‌ని, సాయాన్ని గతం కంటే రెట్టింపు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. వివాహమైన 60 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం అందించ‌డం జరుగుతుందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా వెబ్‌సైట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘ఈరోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో గొప్ప విప్లవాత్మక అడుగు పడుతుంది. మన ప్రభుత్వంలో పిల్లలు బాగా చదవాలని అనేక చర్యలు చేపట్టాం. గత మూడు సంవత్సరాలుగా విద్యాశాఖ మీద మనం చేసిన సమీక్షలు.. బ‌హుశా ఏ రంగం మీద చేసి ఉండకపోవచ్చు. ఎడ్యుకేషన్‌లో గొప్ప మార్పు తీసుకొనిరావాలని, పిల్లలందరికీ చదువు అనేది ఆస్తిగా అందాలని, పేదరికం నుంచి బయటపడే ఏకైక అస్త్రం చదువే అని, పిల్లలు దాన్ని పొందాలని మనసా, వాచా, కర్మనా అడుగులు వేస్తూ వచ్చాం. 

చదువులను ప్రోత్సహించేందుకు పిల్లలను బడికి పంపించేందుకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. సంపూర్ణ పోష‌ణ‌ కార్యక్రమం, గోరుముద్ద, విద్యా కానుక, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ తీసుకొచ్చాం, బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్, స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌తో కూడా స్కూళ్లను అదే రీతిలో బాగుపడి ఉండేలా అడుగులు వేస్తూ వచ్చాం. 

పెద్ద పిల్లల చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్‌ ఓరియంటెడ్‌గా కరికుళం ఉండేలా చర్యలు, ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ఇలా రకరకాల అడుగులు వేస్తూ వచ్చాం. అలాంటి గొప్ప అడుగే ఈరోజు మనం వేస్తున్న వైయస్‌ఆర్‌ కల్యాణ మస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా. ఈ రెండూ గొప్ప అడుగులు. చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లిదండ్రులు పిల్లలను చదువుకునేలా అడుగులు ముందుకువేయించాలనే తపన, తాపత్రయంతో వైయస్‌ఆర్‌ కల్యాణ మస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాలకు కచ్చితంగా పదో తరగతి పాస్‌ అయి ఉండాలనే నిబంధన తీసుకువస్తూ ఈ పథకం అమలు చేస్తున్నాం. దీని వల్ల తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలను పదో తరగతి చదివించే కార్యక్రమం జరుగుతుంది. 

పెళ్లి నాటికి పాప వయస్సు 18 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలని, బాబు వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలని రెండో నిబంధన తీసుకువచ్చాం. దీని వల్ల పిల్లలందరూ కచ్చితంగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఎలాగో పదో తరగతి పాసైపోతే.. 18 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేరు కాబట్టి.. చేసుకుంటే ఈ పథకం రాదు కాబట్టి.. ఇంటర్మీడియట్‌ వైపు కూడా అడుగులు వేస్తారు. ఈ రకంగా మార్పులు తీసుకురావడంతో.. పిల్లలు చదివే పరిస్థితి వస్తుంది. ఆ చదువులతో గొప్ప మార్పు ఏర్పడుతుంది. 

ఈ జనరేషన్‌ను ప్రోత్సహించడం ఒక్కటే కాదు.. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకొని ఉంటే.. వారికి పుట్టే పిల్లలను కూడా చదివించే గొప్ప పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని వల్ల ప్రతీ ఎస్సీ, ప్రతీ ఎస్టీ, ప్రతీ బీసీ, ప్రతీ మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు వీరందరికీ మంచి జరిగే పరిస్థితి, అవకాశం ఉంటుంది. వైయస్‌ఆర్‌ కల్యాణ మస్తు ద్వారా, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా ద్వారా మంచి జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. 

గత ప్రభుత్వంవారు కూడా పెళ్లి కానుక అని ప్రకటించిన ఒక పథకం కూడా 2018లో ఆపేసిన పరిస్థితులు మనం చూశాం. అప్పట్లో పిల్లలు చదవాలని ఎవరూ తాపత్రయపడి పెట్టిన పథకాలు కాదు.. ఎన్నికలకు ఎలా ఉపయోగపెట్టుకోవాలని ఆరాటంతో చేసిన పథకాలు అవి. ఆ పథకాల్లో కూడా చిత్తశుద్ధి లేక 2018లో ఏకంగా 17,709 మందికి పెళ్లి కానుక ఇవ్వకుండా ఆ పథకానికి ఎగనామం పెట్టారు. రూ.68.68 కోట్లు ఎగ్గొట్టారు. అందుకు భిన్నంగా మనందరి ప్రభుత్వం అర్హులైన వారందరికీ వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా వర్తించేలా అడుగులు వేయడమే కాకుండా.. పారదర్శకంగా, వివక్షకు, లంచాలకు తావులేకుండా గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సేవలను ఉపయోగపడే విధంగా రూపొందించాం. 

గత ప్రభుత్వం ప్రకటించిన సొమ్ముకంటే దాదాపు రెట్టింపు డబ్బును ప్రోత్సాహకంగా మన ప్రభుత్వం ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక కింద ఎవరెవరికి ఎంత అనేది ప్రకటించారు. ఇప్పుడు మనందరి ప్రభుత్వం వారికి ఎంత ఎంత ఇవ్వబోతుందనేది చూస్తే..
- గత ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. మన ప్రభుత్వంలో వారికి రూ. 1 లక్షా ఇవ్వనున్నాం. 
- ఎస్సీ, ఎస్టీలలో కులాంతర వివాహాలకు రూ.75 వేలు ఇస్తామని గతంలో ప్రకటిస్తే.. మనందరి ప్రభుత్వంలో వారికి రూ.1.20 లక్షలు ఇవ్వనున్నాం. 
- బీసీలకు రూ.35 వేలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే.. మన ప్రభుత్వ హయాంలో వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నాం. 
- బీసీల కులాంతర వివాహాలకు రూ.50 వేలు ఇస్తామని గతప్రభుత్వం ప్రకటిస్తే.. మన ప్రభుత్వంలో రూ.75 వేలు ఇవ్వనున్నాం. 
- మైనార్టీలకు గత ప్రభుత్వం రూ.50 వేలు ప్రకటిస్తే.. మనందరి ప్రభుత్వంలో రూ.1 లక్ష ఇవ్వనుంది. 
- వికలాంగులకు గత ప్రభుత్వం రూ.1లక్షా ఇస్తామని ప్రకటిస్తే.. మనందరి ప్రభుత్వంలో ఏకంగా రూ.1.50 లక్షలు ఇవ్వనున్నాం.
- భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక కింద రూ.20 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. మనందరి ప్రభుత్వం వారికి రూ.40 వేలు ఇవ్వనుంది. 

గొప్ప ప్రోత్సాహకం, గొప్ప మార్పు. ఇవన్నీ చదువులతో కనెక్ట్‌ అయి ఉన్న గొప్ప మార్పును మనం తీసుకువస్తున్నాం. ఈరకమైన ప్రోత్సాహకం ఇస్తున్నామంటే దానికి కారణం.. అమ్మ ఒడి ద్వారా చదువుల బాటపట్టే పిల్లలు ఎక్కడా డ్రాపవుట్స్‌గా మిగిలిపోకూడదు.. ఆ పిల్లలను పదో తరగతి పాసయ్యే విధంగా అడుగులు వేయించగలగాలనే తపన, తాపత్రయంతో ప్రోత్సాహకాలు ఈ స్థాయిలో ఇచ్చి.. మన పిల్లలు బాగుండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. 

ఈ పథకం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెళ్లి అయిన 60 రోజుల్లోపు గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వలంటీర్‌ సహాయ, సహకారాలు తీసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్‌ సమర్పించాలి. స‌చివాల‌య‌ సిబ్బంది, వలంటీర్లు వెరిఫై చేస్తారు. అర్హులైన వారందరికీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు ఉన్న లబ్ధిదారులకు ఈ సాయం అందుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి జనవరిలో ఇవ్వబడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి లబ్ధిదారులకు వెరిఫికేషన్‌ పూర్తిచేసి ఏప్రిల్‌లో సాయం ఇవ్వబడుతుంది. ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలలకు సంబంధించిన లబ్ధిదారులకు జూలైలో ఇవ్వనున్నాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌కు సంబంధించిన లబ్ధిదారులకు అక్టోబర్‌లో ఇవ్వనున్నాం. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లో ప్రతీ మూడు నెలలకు ఒకసారి వెరిఫికేషన్‌ పూర్తిచేసి సాయం చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

దీని వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి  దయ, ప్రజలందరి దీవెనలతో ప్రతీ ఒక్కరికీ మంచి చేసే అవ‌కాశం రావాలని ఈ పథకాన్ని స్టార్ట్‌ చేస్తున్నాం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top