దివంగత వైయ‌స్ఆర్‌ కు ఘననివాళులు 

ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ 11వ వ‌ర్ధంతి స‌భ‌

 గుంటూరు :  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి గుంటూరులో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. మంగళవారం గుంటూరు హిందూ ఫార్మశీ కళాశాల ఆడిటోరియంలో ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సభకు ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం  ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం. ప్రభుత్వాధినేతలు పని చేయాల్సింది ప్రజల కోసం. అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా కావచ్చు. కాని, అంతిమ లక్ష్యం మాత్రం ప్రజా ప్రయోజనమే అయ్యిండాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి అనేవారని అజ‌య్ క‌ల్లం అన్నారు. కార్యక్రమంలో తొలుతగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం ప్రకటించారు. అనంతరం మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన అతిథులతో జ్యోతిప్రజ్వలనగావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ఆర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సభకు మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా.. అజేయ కల్లం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైయ‌స్సార్  సంక్షేమ పాలకుడని, సుపరిపాలనా సేవకుడని కొనియాడారు. 

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, అధినేతగా అధికారాన్ని అందుకోవడానికి ముందు, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు వైయస్సార్ అని కీర్తించారు. 1997లో ఏపీలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులు పెరిగిపోవడమేనని... విద్య, వైద్యం, సాగునీటి సమస్యలేనని తాము అప్పట్లో నివేదిక అందజేసినట్లు గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్ రూపకల్పన దివంగత వైఎస్ఆర్ చేతులమీదుగా జరిగాయని వివరించారు.

 

Back to Top