ఎవరిని ఉద్ధరించడానికి పార్టీ పెట్టావ్‌ పవన్‌..?

ప్రజల బాగు కోసమా.. చంద్రబాబు బాగోగుల కోసమా..?

పవన్‌ కల్యాణ్‌ ఓ రాజకీయ వ్యభిచారి

నాది ‘డీ’ బ్యాచ్‌ అయితే.. నీది ‘పీ’ బ్యాచ్చా..? ప్యాకేజీ బ్యాచ్చా, పచ్చిబూతల బ్యాచ్చా..?

చంద్రబాబుతో ప్యాకేజీ బేరం కుదరకే పవన్‌ రోడ్ల మీదకొచ్చాడు

రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు నన్ను విమర్శించే స్థాయి లేదు

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, పవన్‌ను తరిమేస్తే కులాల గొడవ ఉండదు

పవన్‌ ఎమ్మెల్యే కావాలన్నా, సీఎం కావాలన్నా.. అది సినిమాల్లోనే సాధ్యం

పవన్‌ నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి

నా దగ్గర రూ.15 వేల కోట్లు ఉంటే పవన్‌ కల్యాణ్‌ను కొనేసేవాడ్ని..

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం

కాకినాడ: ‘‘పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ఉద్ధరించడానికి జనసేన పార్టీని స్థాపించాడు..? రాష్ట్ర ప్రజల బాగు కోసమా లేక చంద్రబాబు బాగోగులు చూసుకోవడం కోసమా..? 2008లో పవన్‌ పార్టీ స్థాపించినప్పుడు అతని వెనుక ఉన్నవారు.. ఇప్పుడు ఏ ఒక్కరూ లేరు. నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలవుతుంది.. అప్పుడు నాతో నడిచినవారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు. అదీ నిబద్ధత అంటే.. పవన్‌కు అది లేదు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి’’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుతో బేరం కుదరకే పవన్‌ కల్యాణ్‌ రోడ్ల మీదకు వచ్చాడన్నారు. మూడుసార్లు పోటీచేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, పవన్‌ కల్యాణ్‌ పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయాడన్నారు. పవన్‌ సినిమాల్లో హీరో కావొచ్చేమో కానీ, రాజకీయాల్లో మాత్రం జీరో అన్నారు. తనను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.  

''నాడు పవన్‌ కల్యాణ్‌ను నమ్మి వెనుక నిల్చున్న మాదాసు గంగాధర్, తోట చంద్రశేఖర్, శ్రీధర్, ఎన్‌ఆర్‌ఐ అశోక్, రాఘవయ్య వంటి నేతలు నేడు ఎవరూ అతని వెంట లేరు. రాజు రవితేజ అనే వ్యక్తితో కలిసి పవన్‌ పుస్తకం రాశాడు. అతను బయటకు వచ్చి పవన్‌ను ఎంతలా విమర్శించాడో అందరికీ తెలుసు.

వంగవీటి రంగా మొదటి మీటింగ్‌ కాకినాడలో ఏర్పాటు చేశాను. ఆ రోజు నుంచి రాజకీయంగా రంగా వెంట నడుస్తూ.. జక్కంపూడి రామ్మోహన్‌రావు శిష్యుడిగా కొనసాగాను. ఆయన ప్రథమ శిష్యుడిని నేను, ఆ తరువాత చాలా మంది ఉన్నారు. 2009లో వైయస్‌ఆర్, 2019 వైయస్‌ జగన్‌ టికెట్‌ ఇస్తే కాకినాడ నుంచి గెలిచాను. నేను మూడుసార్లు పోటీచేస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. రెండు చోట్లా పోటీచేసి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు. పొలిటికల్‌గా పవన్‌ కల్యాణ్‌ జీరో.. నన్ను విమర్శించేస్థాయి నీది కాదు. 

మార్చి 14న ముఖ్యమంత్రిగా నేను సరిపోను, నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు, సింగిల్‌గా పోటీచేస్తే ఎమ్మెల్యేలు రారు.. కాబట్టి చంద్రబాబు తొత్తులుగా పనిచేద్దామని అందరినీ పిలిచి పవన్‌ మాట్లాడాడు. 
కరెక్ట్‌గా మూడు నెలల తరువాత జూన్‌ 14న కత్తిపూడిలో మీటింగ్‌లో పెట్టి నన్ను ఎమ్మెల్యేను చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని నీ మనసు, నీ మాట మర్చావ్‌. ఈ మధ్యలో చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లాడు. ఎందుకంటే ప్యాకేజీ, సీట్లు సర్దుబాటు కోసం వెళ్లాడు. సీట్లు, ప్యాకేజీ కుదరకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి మాట మార్చాడు. ముఖ్యమంత్రి కావాలంటే 88 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలని పవన్‌కు తెలుసా..? లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలా గోతికాడ నక్కలా చూస్తూ 30 సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయిపోదామనుకుంటున్నావా..? 

రాజకీయాల్లో కూడా హీరో అని నిరూపించుకో పవన్‌. చంద్రబాబుతో బేరం కుదరక రోడ్డు మీదకు వచ్చాడు. పవన్‌ కల్యాణ్‌ ఎజెండా ఏంటీ..? ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నావ్‌.. ప్రభుత్వంలో తప్పులు ఉంటే విమర్శలు చేస్తే స్పందించడానికి రెడీగా ఉన్నాం. అంతేతప్ప ప్యాకేజీ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, జూన్‌ 14న మరో మాట మర్చావ్‌. నీకు అనుకూలంగా మాటలు మార్చేసి, నాలుగు ఈలలు కొడితే అదే రాజకీయం అని పవన్‌ భ్రమ పడుతున్నాడు. పవన్‌ కంటే పెద్ద పెద్ద మీటింగ్‌లు పెట్టాం. రాజకీయంగా పవన్‌ సున్నా. 

కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం. మూడుసార్లు పోటీచేస్తే రెండు సార్లు ప్రజలు నన్ను గెలిపించారు. నేను రౌడీని, గూండాను, కబ్జాకోరు అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు. సామాజిక పరంగా ఏ బలం లేకపోయినప్పటికీ కానీ, అన్ని సామాజికవర్గాలు నన్ను గెలిపించుకున్నాయ్‌.. అది నా హీరోయిజం. 

కాకినాడలో నన్ను ఓడిస్తానని పవన్‌ ఛాలెంజ్‌లు చేస్తున్నాడు.. పవన్‌ వల్ల కానేకాదు. బేడీలు వేసి రోడ్ల మీద తిప్పుకుంటూ కొడతానంటున్నాడు.. ఇవన్నీ పవన్‌ సినిమాల్లో చేసుకుంటే మంచిది. కాకినాడలో పుట్టి పెరిగిన వ్యక్తిని నేను.. నాతో ఎవరైనా ప్రతిఘటిస్తే రాజకీయంగా వారిని ఎదుర్కొన్నాను. 

పవన్‌కు పరిటాల రవి లాంటివాళ్లు గుండు కొట్టించారు. నా అనుచరులు తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారని పవన్‌ అంటున్నాడు. నువ్వు తుపాకీ పట్టుకొని తిరుగుతున్నావని నీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరుస అమ్మాయి పవన్‌పై కంప్లయింట్‌ ఇచ్చింది. పవన్‌ ఎమ్మెల్యే అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఆ కోరిక తీరేది ఒకటే చోట.. అది సినిమాల్లోనే జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో పోటీచేసి గెలుపొంది, ప్రమాణస్వీకారం చేసినట్టు సినిమా తీసుకో.. సినిమాలో మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి అవ్వగలవు. నువ్వు పూర్తిగా ప్యాకేజీ స్టార్‌ అని ప్రజలందరికీ తెలుసు. 

మా కుటుంబం గురించి పవన్‌ అసత్య ప్రచారం చేస్తున్నాడు. పవన్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నా.. నీ వెనకాల హట్చ్‌ కుక్కలు, తాగుబోతులు చెప్పిన మాటలు నమ్మడం కాదు.. నిరూపించుకో. 

నేను తాగి జనసేన నాయకులను తిట్టానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నాడు. నాకు మందు అలవాటే లేదు, సిగరెట్‌ కాల్చను, కాఫీ, టీ తాగను. మంచి వాతావరణంలో పెరిగిన వ్యక్తిని నేను. నీకు ఎవరు ఏది చెప్పినా.. ఒకటికి రెండుసార్లు పరిశీలించుకొని విమర్శించు. నీ కంటే గట్టిగా విమర్శించగలం. 

రైస్‌ వ్యాపారం చేస్తూ రూ.15 వేల కోట్లు సంపాదించానని మాట్లాడుతున్నాడు.. నీకు అసలు ఏ అవగాహన ఉంది. కాకినాడ పోర్టులో గతానికి, ఇప్పుడికి ఎక్స్‌పోర్టు పెరగడానికి ముఖ్యకారణం.. కేవలం సీఎం వైయస్‌ జగన్‌ విధివిధానాలే. గతంలో యాంకరేజ్‌ పోర్టు నుంచే రైస్‌ ఎక్స్‌పోర్టు అయ్యేది.. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత డీప్‌ వాటర్‌ పోర్టు నుంచి ఎక్స్‌పోర్టు చేస్తున్నాం. వైజాగ్, కాండ్ల ఇతర పోర్టుల నుంచి వెళ్లే ప్రతి ధాన్యం గింజ కాకినాడ నుంచి ఎక్స్‌పోర్టు అవుతుంది. దానికి కారణం ఖర్చు కాబట్టి. 

రైల్వే సోదరుల నుంచి ఇన్ఫర్మేషన్‌ తీసుకో.. ఛత్తీస్‌గఢ్, బీహార్, మధ్యప్రదేశ్‌ నుంచి కొన్ని వందల ర్యాక్స్‌ గూడ్స్‌ బండ్ల ద్వారా వస్తున్నాయి. నీకు జ్ఞానం లేదు సరే, కనీసం మనోహర్‌ సలహా అయినా తీసుకో.. కాకినాడ పోర్టులో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్‌పోర్టు అయిన రైస్‌ విలువ తీసుకుంటే.. 15 వేల కోట్లు లేదు. అలాంటిది రూ.15 వేల కోట్లు సంపాదించానని ఎలా అంటావ్‌.. నిజంగా నా దగ్గర రూ.15 వేల కోట్లు ఉంటే పవన్‌ కల్యాణ్‌ను కొనేస్తాను. నీకు కావాల్సింది ప్యాకేజీ, రెండు సీట్లు.. అంతేకదా.. నా దగ్గర అంత డబ్బు ఉంటే నేను పవన్‌ను కొనేవాడిని. వాగేముందు సమాచారం తెచ్చుకొని మాట్లాడాలి. హాలిడే ట్రిప్‌లా సాయంత్రం ఒక గంట మీటింగ్‌ పెట్టి మిగిలిన సమయమంతా రూముల్లో కూర్చుంటున్నాడు. రూముల్లో కూర్చొని జనవాహిని అనే కార్యక్రమం పెట్టి ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే వాటినే నిజం అని భావించి దానిపై వాగుతున్నాడు. 

28వ వార్డులో ఎవరో ఒక అమ్మాయి పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీ వేస్తే నంబర్‌ ప్లేట్లు లేని బండ్ల మీద వచ్చి బెదిరించారంట.. నేను ఒకటే చెబుతున్నా.. నేను తలుచుకుంటే, కాకినాడలో నీ బ్యానర్‌ కట్టనివ్వకూడదనుకుంటే.. కట్టనివ్వను. ఈరోజు మెయిన్‌రోడ్లు బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకున్నారా లేదా..? ఎవరో చెప్పిన మాట విని నిజం తెలుసుకోకుండా వారాహి బండి మీద వచ్చి వాగుతున్నాడు. 

కులాల గురించి మాట్లాడను అంటూనే అన్ని కులాల గురించి మాట్లాడుతూ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 1988లో రంగాతో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్లం.. కుల రహితంగా కాలేజీ ఎన్నికలు జరిగేవి. మా సర్కిల్‌లో అన్ని కులాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కులాల విభజన వచ్చింది. మళ్లీ అదే మనస్తత్వం పవన్‌ కల్యాణ్‌లో చూస్తున్నాను. 2024 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి చంద్రబాబును, పవన్‌ను తరిమేస్తే అన్ని కులాల వారు కలిసిపోతాయి. చంద్రబాబుకు ఇది లాస్ట్‌ ఎన్నికలు. వయసు అయిపోయింది. 

చంద్రబాబుకు ఒక పెద్ద న్యాయమూర్తి ఉండేవారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏది చేసినా ఆ న్యాయమూర్తి ఇన్లూ్ఫయన్స్‌తో అడ్డుకోవడం చేశారు. రామోజీరావులాంటి వాళ్లు కథనాలు రాసి బాబుకు హైప్‌ ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారో అప్పుడే పవన్‌ భవితవ్వం కూడా దెబ్బతింటుంది. పవన్‌కు ప్యాకేజీ ఇచ్చేవారు, సీట్లు ఇచ్చేవారు కాబట్టి జనసేన దుకాణం బంద్‌ అవుతుంది. 

నాది డీ బ్యాచ్‌ అయితే.. పవన్‌ది పీ బ్యాచ్చా..? పీ అంటే పవన్‌ బ్యాచ్చా, ప్యాకేజీ బ్యాచ్చా.. పచ్చిబూతుల పీ బ్యాచ్చా..? పవన్‌ కల్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరిస్తున్నా. అందరికీ పేర్లు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. నీ కంటే ముందు తెగించాం. నీ అన్నపేరు చెప్పుకొని సినిమాల్లో, రాజకీయాల్లోకి వచ్చావ్‌. మేము ఒకో ఇటుక పేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ధైర్యంగా ఉంటాం. నువ్వు మాటలు మాట్లాడితే మేము చేతల్లో చూపిస్తాం

ద్వారంపూడి నీ పతనం స్టార్ట్‌ అయ్యింది..నిన్ను కాకినాడలో ఓడించకపోతే నేనే పవన్‌ కళ్యాణే కాదు.. జనసేన పార్టీనే కాదు అని చాలెంజ్‌ విసిరాడు. నేను ఆ చాలెంజ్‌ స్వీకరిస్తున్నా.. నీకు దమ్ముంటే కాకినాడ నుంచి నువ్వే పోటీ చెయ్‌.. నీకు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించు. నీ టిక్కెట్‌ దేహీ దేహీ అంటూ చంద్రబాబు వద్ద అడుక్కుంటే నువ్వు ఇక్కడ పోటీ చేయాలి. నువ్వు అడుక్కుంటావో.. పొత్తులే పెట్టుకుంటావో.. అందరూ కలిసి వస్తారో మీ ఇష్టం. నిన్ను తుక్కుతుక్కగా ఓడించి పంపకపోతే నా పేరు చంద్రశేఖరరెడ్డే కాదు. నేను పోటీ చేయను.. ఇంకొకరు చేస్తారు అంటే నిన్ను పిరికిపందలానే చూడాల్సి వస్తుంది. 

కత్తిపూడి నుంచి నువ్వు జిల్లాలో పర్యటిస్తుంటే మీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు.. ఎంత మందికి టిక్కెట్‌ ఇస్తావు.. ఎంత మందికి హామీ ఇస్తావు..? నీ వారాహిపై వాహనంపై పక్కన ఒక్కడ్నీ నిలబెట్టుకోవేమి..? నీకు టిక్కెట్‌ ఇచ్చే స్థోమత లేదు. నీ బాస్‌ చంద్రబాబు పర్మిషన్‌ ఇస్తే తప్ప నువ్వు టిక్కెట్‌ ఇవ్వలేవు. నీ కోసం స్టూడెంట్స్, పార్టీ పిచ్చి ఉన్నవారు, ఏ పార్టీలో అవకాశం లేక నీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు అవ్వాలి అనుకునే వారు పాడైపోతారు. నువ్వు పవన్‌ కళ్యాణ్‌ అయితే, నువ్వు  జనసేన నాయకుడివైతే కాకినాడలో పోటీ చేయి.. తేల్చుకుందాం. నిన్ను ఓడించకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాల్లోంచి తప్పుకో.. కాకినాడలో నన్ను పతనం చేయడం నీవల్ల కాదు. 

అమిత్‌ షా ఇతనికి ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు.. నా చిట్టా అంతా ఇతనికి చెప్పడానికి. నా గురించి అతనికి తెలియదు కానీ.. అతని గురించి నాకు బాగా తెలుసు. కావాలంటే అన్నీ బయటపెడుతాను.. మేం డెకాయిట్, నటోరియస్‌ అంటే.. అతన్ని ఏమనాలి..? అతన్ని ప్యాకేజీ స్టార్, బ్రోకర్‌ అనే చాలా మాటలు అనొచ్చు. నువ్వెవడో దేశమంతా తెలుసు. కత్తిపూడి నుంచి రెడ్ల మీద ఎలా పడాలా అని చూస్తున్నాడు. అతనికి పడని కులమే రెడ్డి. రంగాని చంపిన కులం చంకలో దూరతాడు కానీ రెడ్లమీద పడతాడు. రంగాని చంపింది చంద్రబాబు, కోడెల శివప్రసాద్‌లే. మొన్న ముద్రగడ కాపు ఉద్యమం జరిగితే ప్రతి ఫ్లెక్సీలోనూ రంగా ఫొటో లేకుండా లేదు. అలాంటి రంగాని చంపేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక కాపు అయి ఉండి.. రంగాని చంపిన చంద్రబాబు చంకలో దూరుతున్నాడు. అతను రెడ్డి ద్వేషి.. రెడ్డిలను వ్యతిరేకించాలి కాబట్టి.. కత్తిపూడి నుంచి నా గురించే మాట్లాడతున్నాడు. అంటే రెడ్డి సామాజిక వర్గం అంటే అంత అలుసుగా ఉందా..? 

పవన్ కళ్యాణ్ గంజాయి తాగి కాకినాడలో ఊగిపోయాడు. ఒక ఆరోపణ చేసేటప్పుడు కనీసం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. గంజాయి ఇంత విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం చంద్రబాబు. ఆ రోజు చంద్రబాబు ఎమ్మెల్యేలకు సంపాదన మార్గం చూపడానికే గంజాయిని ఎరవేశాడు. మా నాయకుడు వైయ‌స్ జగన్‌ గంజాయిని అరికట్టడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

Back to Top