బాబు వెన్నుపోటును కప్పిపుచ్చడానికే నాపై దుష్ప్రచారం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం

ఎన్టీఆర్‌పై నాకున్న అభిమానం అందరికీ తెలుసు

పిచ్చిపిచ్చి కార్టూన్లతో ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచింది పచ్చమీడియా

రామోజీ, రాధాకృష్ణలకు బుద్ధీ, జ్ఞానం ఉందా.. వెన్నుపోటును అధికార మార్పు అంటారా..?

చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకే నాపై విషప్రచారం

మా పెళ్లి తరువాత ఎన్టీఆర్‌ దమ్మున్న మగాడు అని రేణుక చౌదరి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు

మా పెళ్లి గురించి తప్పుగా మాట్లాడితే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా..

టెక్కలి, గోరంట్ల నియోజకవర్గాల్లో పోటీచేయాలని కోరినా నేను వద్దని చెప్పాను

ఏనాడూ పదవుల కోసం నేను ఆశపడలేదు.. ఎన్టీఆర్‌ భార్య పదవికి మించింది నాకు అవసరం లేదని చెప్పా..

లక్ష్మీపార్వతి నా భర్య మాత్రమే కాదు.. నా తల్లిలాంటిది అని ఎన్టీఆర్‌ చెప్పారు

ఈనాడు అబద్ధపు రాతలను ఎన్టీఆర్‌ ఆనాడే తప్పుబట్టారు.. 

బాబుకు వంతపాడి కన్న తండ్రినే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంపుకున్నారు

రక్తం పంచుకున్నంత మాత్రాన, ఆయన గౌరవాన్ని కాపాడలేని మీరు బిడ్డలు ఎలా అవుతారు?

ఎన్టీఆర్‌పై సీఎం వైయ‌స్ జగన్‌కు గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు

ఆరోగ్యశ్రీ సృష్టికర్త, రూపాయి వైద్యుడిగా పేరు గడించిన వైయ‌స్ఆర్ పేరు పెట్టడమే సముచితం

తాడేపల్లి: స్వర్గీయ ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దుర్మార్గాన్ని దాటవేయడానికి, చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించడం కోసం పచ్చ మీడియా డ్రామాలు చేస్తోంది. తనపై విష ప్రచారాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేస్తూ ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీడీపీ సోషల్‌ మీడియా ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి, ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయన్ను అధికారం నుంచి లాగేసినవారే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఎన్టీఆర్‌ అసలు తనను పెళ్లిచేసుకోలేదని, ఆ ఇంటి పేరు వాడుకునే హక్కు తనకు లేదని అతిదారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు తనపై ఉండే ప్రేమ.. ఏ స్వార్థం కోసం తాను ఎన్టీఆర్‌ జీవితంలోకి రాలేదు అనేందుకు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలే సాక్ష్యమన్నారు. ఎల్లో మీడియా, టీడీపీ కలిసి తనపై చేస్తున్న విషప్రచారంపై నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీపార్వతి ఏం మాట్లాడారంటే..
‘‘గతం గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటివారు తెలియక.. మోసం చేసినవారు చెప్పే అబద్ధాలనే నమ్ముతూ వాటినే నిజం అనుకునే ప్రమాదం ఉంది. చరిత్ర  ఎప్పుడైనా చరిత్రే.. దాన్ని ఎవరు చెరిపేయాలనుకున్నా అది మళ్లీ తిరిగి లేస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్‌ను ఎంత అణగదొక్కాలని చంద్రబాబు, అతని పచ్చ మీడియా అనుకున్నారో.. అదే చరిత్ర తిరిగి పునరావృతం అయ్యి మరింత విజృంభిస్తోంది. అందుకు ప్రస్తుతం చంద్రబాబుకు జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. వారు చేసిన పాపాలు, వాళ్ల దుష్కర్మలను తిరిగి బయటపెట్టుకుంటున్నారు. రెండు మూడు రోజులుగా ఏబీఎన్‌లో నాపై వస్తున్న వార్త కథనాలపై నేను మాట్లాడతాను. 

సెప్టెంబర్‌ 10వ తేదీన తిరుపతిలో మా పెళ్లి గురించి ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఇంటికి రాగానే 11వ తేదీన ప్రెస్‌మీట్‌ పెట్టారు. రిపోర్టులందరి సమక్షంలో సాయిబాబా ముందు మా పెళ్లి జరిగింది. తరువాత ప్రెస్‌మీట్‌ పెట్టి మా పెళ్లి జరిగిందని ప్రకటించారు. దమ్మున్న మగాడు ఎన్టీఆర్‌ అని ఆరోజున రేణుక చౌదరి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలో పెళ్లి కావాలని టీడీపీ వారే దండలు కూడా మార్పించారు. చంద్రబాబుకు మొదటి నుంచి మా పెళ్లి అంటే ఇష్టంలేదు కనుక.. కావాలని పట్టుబట్టి అతని ముందే దండలు మార్పించారు. మా పెళ్లి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలా మాట్లాడితే తప్పనిసరిగా లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాను. 

లక్ష్మిపార్వతి అధికార వ్యామోహమే పార్టీని కొంపముంచిందని ఏబీఎన్‌ రాధాకృష్ణ చెత్తపలుకులో మళ్లీ పాతపాటే రాశాడు. ఎన్టీఆర్‌ ఆరోజుల్లోనే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. నా భార్య రాజకీయాల్లోకి రాదు అని చెప్పారు. ఎన్టీఆర్, నేను చివరి వరకు ఎప్పుడైనా రాజకీయాల్లోకి తీసుకొస్తానని ఎన్టీఆర్‌ గానీ, నాకు పదవి కావాలని అడగడం గానీ ఎప్పుడైనా జరిగిందా..? ఎన్టీఆర్‌ టెక్కలి, హిందూపూర్‌లో పోటీచేసి రెండు చోట్ల గెలిచారు.  ఆ తరువాత టెక్కలి సీట్‌లో లక్ష్మిపార్వతి అని రాసుకొచ్చారు. నిజంగా టెక్కలి నుంచి చాలా మంది జనాలు 10 బస్సులు వేసుకొని వదినగారికి ఇవ్వాలని, మా నియోజకవర్గం బాగుపడుతుందని చాలా మంది కోరారు. ఆ వార్తను ఈనాడులో కూడా రాశాను. ఆమె ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వస్తానంటే.. నేను కాదని అనను.. ఆమె ఏది అడిగినా నేను సిద్ధమే.. అని ఎన్టీఆర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆరోజుల్లో పత్రికల్లో వచ్చాయి. 

నాకు ఎన్టీఆర్‌ భార్య అనే పదవి కంటే మించిన పదవి మరొకటి నేను ఒప్పుకోను. చివరి క్షణం వరకు అదేమాటకు కట్టుబడి ఉన్నాను. టెక్కలి సీటు ఆఫర్‌ చేసినా నేను తీసుకోలేదు. ఇప్పటికీ టీడీపీలో నిమ్మల కృష్ణప్ప, బుచ్చయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగితే తెలిసిపోతుంది. నిమ్మల కృష్ణప్పకు సంబంధించిన గోరంట్ల నియోజకవర్గం ఎన్నిక ఆగిపోతే.. ఆ సమయంలో పుట్టపర్తి సాయిబాబా సోదరుడు జానకీరామ్‌ వచ్చి రెండ్రోజులు హోటల్‌లో ఉండి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. గోరంట్ల నుంచి మీ భార్యను నిలబెట్టండి.. మా జిల్లా బాగుపడుతుందని అడిగితే.. ఎన్టీఆర్‌ అదే సమాధానం చెప్పారు. 

ఎన్టీఆర్‌కు పెరాలసిస్‌ స్ట్రోక్‌ వచ్చిన తరువాత నిమ్స్‌ ఆస్పత్రిలో ఇప్పటికీ ఆయన రిపోర్టులు ఉన్నాయి. బ్రెయిన్‌లో క్లాట్‌ వల్ల పెరాలసిస్‌ వచ్చింది. కుడిచేయి వేళ్లు చచ్చుబడిపోయాయి. సరిగ్గా అన్నం కూడా కలుపుకోలేని పరిస్థితి. డాక్టర్‌ వెంకటేశ్వరరావు ఒక మాట అన్నాడు.. సభలో అందరి ముందు కావాలని అన్నం పెట్టానని మాట్లాడారు. నా కుడిచేతి వేళ్లు సరిగ్గా పనిచేయడం లేదు.. అందువల్ల నాకు తల్లిలా ఆమె అన్నం తినిపిస్తుంది. నేషనల్‌ ఫ్రంట్‌ లీడర్స్‌ అందరూ వీపీ సింగ్‌ లాంటివారు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ చెయ్యిని చూపించి.. అన్నం కలిపే స్థితిలో లేనని చెప్పారు. ఆమె నా భర్య మాత్రమే కాదు.. నా తల్లిలాంటిది అని కూడా ఎన్టీఆర్‌ చెప్పిన స్టేట్‌మెంట్‌ పేపర్లలో వచ్చింది. ఏబీఎన్‌ రాధాకృష్ణ దయచేసి ఆ పేపర్‌  క్లిప్పింగ్స్‌ చూడాలి. 

బ్రెయిన్‌ క్లాట్‌ వల్ల ఆయనకు శరీరం సహకరించేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ సదస్సులు జరిపాం. నేను వచ్చిన తరువాత ఎన్టీఆర్‌ పరిస్థితి ఏ విధంగా ఉందో రాధాకృష్ణ చెప్పాలి. పెరాలసిస్‌ స్ట్రోక్, అధికారం లేదు, ఆస్తులన్నీ కొడుకులకు ఇచ్చి.. 1982 ఎన్నికల్లో ఒకే ఒక్క శాంతికుటీరం ఒక్కటే ఆయన పేరు మీద ఉంది. ఎన్టీఆర్‌కు ఏమీ లేనప్పుడు ఆయన జీవితంలోకి వచ్చాను. ఆరోగ్యవంతంగా చేశాను.. తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశాను. ఎన్టీఆర్‌ ఆఖరి వీలునామాలో.. జనవరి 7 సమయం ఉదయం 7.45 గంటలకు ఇంటర్వ్యూ వై.కాశీపథి, ఎన్‌.సీతారామరాజు.. ఈ వార్త పేపర్‌లో వేసుకోవడానికి ఫస్ట్‌ ఇంటర్వ్యూ ఎన్టీఆర్‌ది తీసుకున్నారు. జనవరి 18వ తేదీ ఎన్టీఆర్‌ మరణించారు. 11 రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాల గురించి చెప్పారు.  ‘వార్త ద్వారా ప్రజలకు తెలియజెప్పండి.. ఇది ఎన్టీఆర్‌కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు.. లక్ష్మీపార్వత్రి పట్ల వారు చేసిన అపచారం మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒకపెద్ద వెన్నుపోటు, స్తీ్ర జాతికి కలిగించిన ఒక సిగ్గుచేటు చర్య.. ప్రజల పట్ల ద్రోహం దేశానికి అపకారం, మానవచరిత్రకే చంద్రబాబు  అపచారం చేశాడని ఎన్టీఆర్‌ నన్ను సమర్థించిన అంశాలు. లాస్ట్‌ ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి పట్ల ఉండే గౌరవం, అభిమానం కొంత కూడా తగ్గలేదు. 

రామోజీరావు పిచ్చిరాతలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆపత్రికలో మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నీతిమాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాల మీద బురదజల్లడానికి సమకట్టారు. ఆ రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం. అయినా ఆపలేదు. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రతిపాదించింది దుర్వినియోగం చేయడానికే అని వారు భావించినప్పుడు.. అందుకు అనుగుణంగానే వ్యవహరించడానికి నిర్ణయించుకున్నప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని వారికి చెప్పాం. మీరు రాసేది రాయండి.. నేను చేసేది చేస్తాను. నా భార్య మీద, నా మీద అవాకులు చవాకులు రాయిస్తున్నాడు. కొందరి ఆలోచన ధోరణి తప్పుబట్టించడానికి అనునిత్యం అసత్య ప్రచారాన్ని పుట్టిస్తున్నాడు. తన పత్రికను అబద్ధపు పుట్టగా, చెత్తకాగితాల బుట్టగా మార్చేస్తున్నాడు  అని ఎన్టీఆర్‌ స్వయంగా ఇచ్చి ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు.. అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. అందుకనే పార్టీని తీసుకోవాల్సి వచ్చిందని రాశారు.  లక్షలాది ఎన్టీఆర్‌ అభిమానులు దయచేసి మీ అన్నగారు ఇష్టపడి కోరి చేసుకున్న భార్య ఎలాంటిదో అర్థం చేసుకోండి. కత్తులతో వెన్నుపోటు పొడిచిన తరువాత దండలు  వేసే వెదవలను నేను కోరడం లేదు. ‘వారు అన్నంత మాత్రాన లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించినట్టా..? పార్టీ వ్యవహారాల్లో ఆమె అవాంఛిత వ్యక్తి ఎలా అవుతారు..? ఆమె నా భార్య మాత్రమే కాదు, నేను తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి నా అభిమాని, అంతకంటే ముందు నా అభిమాని. నా జీవిత చరిత్ర రాయాలని సంకల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నన్ను ఆదరించారు. పక్షవాతం వచ్చి ఒక చెయ్యిపడిపోయి నా కనీస దయనంధీన కర్తవ్యాలు నిర్వహించుకోలేని సమయంలో ఆమె నన్ను ఆదుకున్నారు. అమ్మలా నాకు అన్నం ముద్దలు తినిపించారు. అందువల్ల నా భార్య చిన్న సలహాలు ఇస్తే తప్ప.. కృష్ణుడికి నరకాసుర సంహారంలో సత్యభామ సాయం చేయలేదా అని చెప్పారు. ఎవరైనా సలహాలు చెబితే వింటాను.. కానీ, నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను.. వారి ఏడుపంతా ఆమె నా భార్య కావడమే.. వారి తప్పుడు పనుల గురించి ఆమె నాకు చెబుతారనే భయం వారిలో ఉంది. 

ఈనాడు పత్రికలో ఎన్టీఆర్‌ మీద భయంకరమైన కార్టూన్లు వేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారు. ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దుర్మార్గాన్ని దాటవేసుకోవడానికి, చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించడం కోసం పచ్చ మీడియా చేస్తున్న డ్రామాలు, నాపై విష ప్రచారాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు నాపై ఉండే ప్రేమ.. ఏ స్వార్థం కోసం నా జీవితంలోకి రాలేదు అనేందుకు ఆయన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలే సాక్ష్యం. 

పాముకు(బాబు) పాలు పోస్తున్నావంటూ నాడే ఎన్టీఆర్ హెచ్చరించారు 
చంద్రబాబుకు వంతపాడి కన్నతండ్రినే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంపుకున్నారు. ఎన్టీఆర్ ను వెనుక నుంచి కత్తితో పొడిచిన వారే.. ఇవాళ ముందుకు వచ్చి ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు.  రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన బిడ్డలైపోరు. ఆయన గౌరవాన్ని కాపాడకుండా, ఆయన్ను అవమానిస్తుంటే కనీసం అడ్డుకోని వారు, అడ్డు చెప్పని వారు బిడ్డలెలా అవుతారు..? ఎన్టీఆర్‌పై చెప్పులు వేసి, ఆయనను మానసికంగా క్షోభకు గురి చేసి ఆయన మరణానికి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కారణం అ‍య్యారు. ఆ విధంగా ఎన్టీఆర్‌ని హత్య చేశారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అసమ్మతి వచ్చేస్తుందా?  నాకే గనుగ అధికార ఆపేక్ష ఉంటే.. చంద్రబాబుకు కీలక పదవులు వచ్చేవా అని రాధాకృష్ణను, రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు మంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలతో కట్టు కథలు  రాస్తున్న విషయం ఆ వర్గం మీడియాలో  చూస్తూనే ఉన్నాం కదా?. చంద్రబాబు అనే పాముకు పాలుపోసి పెంచుతున్నావంటూ అప్పట్లోనే ఎన్టీఆర్‌ నన్ను హెచ్చరించారు. నాడు ఎన్టీఆర్‌ ఎ‍క్కడ ప్రధానమంత్రి అవుతారో అన్న భయంతో రామోజీరావుతో, ఢిల్లీలో కొంతమంది పెద్దలతో కలసి వీరంతా కుట్రలు చేయలేదా? రాధాకృష్ణ పిచ్చిరాతలకు కాలం చెల్లే రోజులు వస్తాయి. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులకు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా నోళ్లు మూసుకుంటే మంచిది.

ఎన్టీఆర్ పేరు మార్చాలని రాధాకృష్ణ ఇంటర్వ్యూలో బాబే చెప్పాడు కదా..!
హెల్త్‌ యూనివర్శిటీకి పేరు మార్పుపై ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే సవివరంగా, చాలా స్పష్టంగా చెప్పారు. పేరు మార్చారంటూ ఎన్టీఆర్‌ హంతకులు బాధను అభినయిస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రంలో ఏదైనా శాశ్వత పథకానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టాడా?.  ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన బాబు, ప్రజల దృష్టిని మరల్చడానికే నాడు రాజీవ్‌గాంధీ హెల్త్‌ యూనివర్శిటీగా ఉన్న దాని పేరు మార్చి అప్పటికప్పుడు ఎన్టీఆర్‌ పేరు పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఎంత అవమానకర రీతిలో మాట్లాడాడు. ఎన్టీఆర్‌ వర్శిటీకి ఆయన పేరు తొలగించడానికి రాధాకృష్ణతో కలిసి కుట్రలు చేసింది రాష్ట్ర ప్రజలంతా టీవీల్లో చూడలేదా..?. ఎన్టీఆర్ గురించి, మీరిద్దరూ ఎంత భయంకరమైన భాష ఉపయోగించారు. హెల్త్‌ వర్శిటీ పేరు మార్చేయాలని మీరు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు కదా... ఇక పేరు మార్పుపై అడిగే నైతిక హక్కు మీకెక్కడది? ఎన్టీఆర్‌ పేరు ఉచ్ఛరించే హక్కు కూడా చంద్రబాబుకు లేదు.

జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నదే నా కోరిక
 పెద్దదా.. యూనివర్సిటీ పెద్దదా అని ఎవర్ని అడిగినా చెబుతారు.. జిల్లానే పెద్దది అని. అటువంటిది ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడితే మీకెందుకు బాధ..?. ప్రభుత్వం కనుక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలా? లేక హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలా అని ప్రతిపాదించి ఉంటే.. జిల్లాకే ఎన్టీఆర్‌ పేరు ఉండాలని నేను కోరుకుంటాను. జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినప్పుడు అభినందించని వీళ్లు... ఇవాళ తిట్టడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎన్టీఆర్‌ పేరు జిల్లాకు పెట్టడంతోనే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ కి ఎన్టీఆర్ పై ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థం అవుతుంది.

ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది మీరు కాదా..?
ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారతరరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం.. ఆ తర్వాత దానిని చెత్తబుట్టలో వేస్తారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది మీరు కాదా..?  ఈ విషయాన్ని ఇటీవల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వొద్దని అప్పటి ప్రధాని వాజ్ పేయ్ కు చంద్రబాబే చెప్పాడు. ఎన్టీఆర్ కు రావాల్సిన అవార్డులే రాకుండా అడ్డుపడి, అవమానించి.. ఈరోజు ఆయన పేరు గురించి రచ్చ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి..?. జూనియర్ ఎన్టీఆర్ ను అవసరానికి వాడుకుని, అవసరం తీరాక అన్నివిధాలా అవమానించింది కూడా చంద్రబాబు, వారి కుటుంబ సభ్యులే. 

వైయ‌స్ఆర్ పేరే సముచితం
పేదల డాక్టర్ గా, రూపాయి వైద్యుడిగా పేరు గడించి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి, మెడికల్ కాలేజీలను తెచ్చి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైయ‌స్ఆర్ పేరును యూనివర్సిటీకి పెట్టడమే సముచితం. ఎందుకంటే, వైయ‌స్ఆర్ తనయుడు, నేటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగం అభివృద్ధి కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ,  విశేష కృషి చేస్తున్నారు. చంద్రబాబులా, పగతోనో, ద్వేషంతోనో వైయ‌స్‌ జగన్ ఆ పేరు తొలగించలేదు. ఎన్టీఆర్ పై గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే, ఎవరూ అడగకపోయినా, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన్ను గౌరవించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్. 

రామోజీ, రాధాకృష్ణల కుట్రలకు అంతే లేదు
రాజ గురువు ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రల గురించి వివరిస్తూ... బుద్ధి, జ్ఞానం లేకుండా వెన్నుపోటును అధికార మార్పు అంటూ రాతలు రాస్తున్నారు. నాడు చంద్రబాబుతో కుమ్మక్కైన రామోజీరావు.. ఏ విధంగానైతే నన్ను అడ్డు పెట్టుకుని అబద్ధపు, అసత్యాల కథనాలతో ఎన్టీఆర్ పై బురదచల్లారో, అవమానించారో, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారం, పార్టీని లాక్కున్నారో చూశాం. అలానే ఈరోజు కూడా, ప్రజలకు ఇంతగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిపై అదే విషం చిమ్ముతున్నారు. అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో చంద్ర బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారణమయ్యాడా.. లేదా.. రామోజీ, రాధాకృష్ణా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 

ఏనాడు అయినా రాజకీయాల్లో నేను జోక్యం చేసుకున్నానా? ఎన్టీఆర్‌ నా చేతిలో కీలుబొమ్మ అంటూ కార్టూన్లు ప్రచురించారే? నిజంగా నాకు అధికార వ్యామోహం ఉంటే ఏదో ఒక పదవి తీసుకోవడం నాకు అప్పుడు కష్టమా? ఇవ్వడానికి ఆయనకు ఇబ్బందా? నాకు మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నానని మోహన్‌బాబు దగ్గర కూడా ఎన్టీఆర్‌ ప్రస్తావించారు. అధికారం కోసమో,  రాజకీయ స్వార్థంతోనో ఎన్టీఆర్‌ జీవితంలోకి రాలేదు. చంద్రబాబు నాయుడు తన అధికార దాహానికి, ఎన్టీఆర్‌ కి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ పచ్చ మీడియా చేస్తున్న డ్రామాలు, విష ప్రచారాలను ప్రజలంతా మరోసారి గమనించాలని కోరుతున్నాను.

Back to Top