సచివాలయం: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల కమిషన్‌ను కోరారు. కౌంటింగ్ కేంద్రాలలో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారని, వైయస్ఆర్ సీపీకి చెందిన నిమ్మాడ పంచాయతీ చినవెంకటాపురానికి చెందిన తోటమల్లేష్‌పై దాడి జరిగిందన్నారు. టీడీపీ జరిపిన దాడిలో మల్లేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఈసీకి వివరించారు. ఆ ఘటన టీడీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు అతనిపై దాడి చేయించారని, కాబట్టి ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్, ఎంపీ అభ్యర్ది రామ్మోహన్ నాయుడులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా దెందులూరు టీడీపీ అభ్యర్ది చింతమనేని ప్రభాకర్ ఎన్నికల సందర్బంగా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డాడని, దళితులను దూషించాడని, ఈ నేపథ్యంలో పెదవేగి మండలం కొప్పులవారి గూడెంకు చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేస్తే, పోలీసులపై దాడి చేసి అతనిని విడిపించుకుని వెళ్లారు కాబట్టి చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు అందిన వాటిలో కవర్లపై పేర్లు లేకపోవడం, ఇతరత్రా సంతకాలు లేకపోవడం వంటివి ఉన్నాయని, వాటికి సంబంధించి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని సరైన పద్ధతిలో కౌంటింగ్ చేయాలని ఈసీని కోరారు.