అమరావతి: అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే తపనతో నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పథకాలు అందించాలనే సీఎం వైయస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా వైయస్సార్ చేయూత కింద మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం ఆర్థిక సాయం అందించారు. రెండో విడత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు 2,72,005 మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.510.01 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మొదటి విడతలో 21,00,189 మంది మహిళలకు సాయం.. వైయస్ఆర్ చేయూత పథకాన్ని సీఎం వైయస్ జగన్ ఈ ఏడాది ఆగస్టు 12న ప్రారంభించారు. మొదటి విడతలో 21,00,189 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నగదు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎవరైనా మిగిలిపోయి ఉంటే పేర్లు నమోదు చేసుకునేందుకు నెల గడువు ఇస్తున్నామని, అందులో అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన 2,72,005 మంది మహిళల ఖాతాలకు ఇవాళ రూ.510.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.