హై కోర్టు స్టే ఆర్డర్‌పై ముఖ్య నేతలతో సీఎం వైయ‌స్ జగన్‌ చర్చలు

ఎన్నికల విషయంలో టీడీపీవి పిల్ల చేష్టలు

 డివిజన్‌ బెంచ్‌లో ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి

 వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి   

 అమరావతి: రెండు రోజుల్లో రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలు జరగనుండగా.. ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. తదుపరి చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల విషయంలో టీడీపీ పిల్ల చేష్టలకు పాల్పడుతోంది. పరిషత్‌ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ.. హైకోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏడాది క్రితం పూర్తి కావాల్సినవి.. కానీ ఆనాడు కూడా అన్యాయంగా, దురుద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేశారు’’ అని సజ్జల గుర్తు చేశారు.

‘‘పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ముగిసింది.. రెండు రోజుల్లో పోలింగ్‌ ఉండగా.. కోర్టుకు వెళ్లారు. ఈ అంశంలో ఎస్‌ఈసీ త్వరగా హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కోవిడ్‌ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో ఎన్నికలు త్వరగా పూర్తయితే చాలా మేలు జరిగేది. కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఎన్నికలు త్వరగా పూర్తయ్యేవి. దాంతో వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం అన్యాయం. డివిజన్‌ బెంచ్‌లో ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి’’ అని సజ్జల రామ‌కృష్ణారెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. ‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top