బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారు.. అంతా సక్రమమే 

తనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు   

గుంటూరు: మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారును గుంటూరు రవాణాశాఖ అధికారులు (ఆర్‌టీవో) శుక్రవా­రం పరిశీలించారు. ఈ నెల 18న వైయ‌స్‌ జగన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో వెంగళాయపాలెం వాసి సింగయ్య మృతి చెందిన విషయం విదితమే. తొలుత వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌కి ముందు వెళ్లిన వాహనం కింద పడి సింగయ్య మరణించాడని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత జగన్‌ వాహనం కింద పడినట్లు తప్పుడు కేసు పెట్టారు.  

ఈ నెల 24న తాడేపల్లిలోని మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇంటి నుంచి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారు ఏపీ40డిహెచ్‌2349ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల అనంతరం వాహనాన్ని గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఓ షెడ్‌లో ఉంచారు. 

ఎంవీఐ గంగాధర్‌ప్రసాద్‌ నేతృత్వంలో శుక్రవారం కారును విస్తృతంగా తనిఖీ చేశారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని తనిఖీల్లో వెల్లడైంది. స్వయంగా ఎంవీఐ అధికారి బుల్లెట్‌ఫ్రూఫ్‌ కారును 20 నిమిషాలు (టెస్ట్‌ డ్రైవ్‌) నడిపి, ఎటువంటి లోపాల్లేవని గుర్తించారని తెలిసింది. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారు వల్ల ఎటువంటి ఇబ్బందుల్లేవని ఆర్టీవో అధికారులు తేల్చి చెప్పారు.  

Back to Top