విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే విశాఖ నగరం అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి కోరుతూ విశాఖపట్నం నగర ప్రముఖులతో నిర్వహించిన ఆత్మీయ సదస్సు లో విశాఖ ఉమ్మడి జిల్లాల పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని చెప్పారు. విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్ చేశారని విమర్శించారు.
ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేడని, లోకేశ్ చేసినా ఉపయోగంలేదని భావించి అమరావతి పేరుతో అక్కడి వారిని రెచ్చగొట్టి పాదయాత్రకు ప్లాన్ చేశారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జనం వైయస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని పేర్కొన్నారు.