అమరావతి: చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ పేరుపై ఒక్క పథకం లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు.
సభలో టీడీపీ సభ్యుల తీరు చాలా బాధాకరం. స్పీకర్ చైర్ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతేనే టీడీపీకి ఎన్టీఆర్‌కు గుర్తుకు వస్తుంది. అధికారం లేనప్పుడే అనేక సందర్భాల్లో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండు చేస్తారు. చంద్రబాబు ఆ నాడు ఏబీఆర్ ఇంటర్వ్యూలో రాధాకృష్ణతో మాట్లాడిన తీరును గమనించాలి. ఎన్టీఆర్ పేరును ఆరోగ్యశ్రీ పథకంలో తీసేస్తా..వాడి పేరు కనబడకుండా చేస్తా..ఇక వాడి పనిఅయిపోయినట్లే, ఇక ఏ పథకానికి వాడి పేరు పెట్టను అన్నది చంద్రబాబే. ఈ వీడియోలు అందరూ చూశారు. చంద్రబాబు ఇంకా అనేక సందర్భాలు మాట్లాడారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఆ రోజు వైశ్రాయ్ హోటల్‌లో పెద్దాయనపై రాళ్లు,చెప్పులు వేసింది వీళ్లు కాదా? ఆ రోజు అధికారం కోసం ఎన్టీఆర్‌పై కుట్రలు చేసింది చంద్రబాబు కాదా? పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. వైయస్‌ఆర్ కడప జిల్లా పేరు మార్చాలని ప్రయత్నం చేసింది చంద్రబాబు కాదా?. ఎన్టీఆర్‌ను వాడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు కాదా? ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టుకున్న వీళ్లు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటించడం విడ్డూరంగా ఉంది. ఎన్టీఆర్‌పై మాకు ప్రేమ ఉంది. ఆయన్ను ఎప్పుడు అగౌరవ పరచాలని మాకు లేదు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌పేరు పెట్టిన వ్యక్తి వైయస్ జగనే. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎన్టీఆర్‌ను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్‌ఆర్ యూనివర్సిటీగా ఎందుకు మార్చుతున్నామో తెలుసుకోకుండా ఆందోళన చేయడం బాధాకరం. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఎప్పుడూ గౌరవిస్తుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.