తెలుగుదేశం పార్టీ ఓటమి తేటతెల్లం

ఎల్లో మీడియా, టీడీపీ దౌర్జన్యాలపై ఈసీ చర్యలు తీసుకోవాలి

వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్‌: విషప్రచారాలు చేస్తున్న ఎల్లో మీడియా, దౌర్జన్యాలు చేస్తున్న టీడీపీ నేతలపై ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ వార్డు కన్వీనర్‌పై దాడి చేసిన ఏలూరు టీడీపీ అభ్యర్థి పడేటి బుజ్జిని వెంటనే అరెస్టు చేయడమే కాకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు.  అదే విధంగా వైయస్‌ఆర్‌ జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో టీడీపీ నేత సీఎం రమేష్‌ వైయస్‌ఆర్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. సీఎం రమేష్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. 

పోలింగ్‌ బూతల్‌ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేస్తుంటే దాన్ని వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై చూపిస్తూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. గుంతకల్లు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్త ఈవీఎంలు ధ్వంసం చేస్తే వైయస్‌ఆర్‌ సీపీ చేసిందని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని, ఇలాంటి చానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఓటమి తేటతెల్లమైందని, ఓటమి భయంతోనే చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడన్నారు. 

Back to Top