సచివాలయం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ తెలిపారు. సచివాలయంలో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో పెండింగ్ కేసులు, అట్రాసిటీ కేసులు, వాటి పరిష్కారం, బాధితులకు సహాయం వంటి అంశాలపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి విశ్వరూప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసులో బాధితులకు మూడెకరాల భూమి, రెండున్నర సెంట్ల ఇంటి స్థలం, ఆర్థిక సహాయం అన్నీ సత్వరమే అందేలా చూడాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలిచ్చారన్నారు. ల్యాండ్ అవేలబులిటీ లేనిచోట అవసరమైతే భూసేకరణ చేపట్టి కేసుల్లో బాధితులకు న్యాయం చేకూర్చాలని సీఎం సూచించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అణగారిన వర్గాల్లో మనోధైర్యాన్ని నింపారని మంత్రి విశ్వరూప్ అన్నారు. స్టేట్ లెవల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చైర్మన్‌గా ఉండి సమీక్ష జరిపారన్నారు. జిల్లా స్థాయిలో కూడా తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి సమీక్ష జరపాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారన్నారు. జిల్లాస్థాయి మీటింగ్ రిపోర్టు స్టేట్ లెవల్ కమిటీకి పంపించాలని, స్టేట్ లెవల్ కమిటీ 6 నెలలకు ఒకసారి చర్చించి బాధితులకు సత్వర న్యాయం జరగాలని సీఎం సూచన చేశారన్నారు. 2013 తరువాత ఇటువంటి సమావేశం ఇప్పటి వరకు జరగలేదన్నారు. అట్రాసిటీ కేసులు, పెండింగ్ కేసుల మీద సీఎం వైయస్ జగన్ కులంకుశంగా చర్చించారని, బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా, చార్జిషీట్ వెంటనే ఫైల్ చేయాలని లా డిపార్టుమెంట్, హోం డిపార్టుమెంట్‌ను ఆదేశించారన్నారు. హోం, సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రులు, సెక్రటరీలను ప్రతి జిల్లా విజిట్ చేసి.. సమీక్షలు జరిపి అంశాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలిచ్చారని చెప్పారుు. కలెక్టర్లు, ఎస్పీలు ఎస్సీ గ్రామాల్లో పర్యటించి గంట పాటు ప్రజలతో చర్చించాలని, ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించాలని సీఎం ఆదేశించారని మంత్రి విశ్వరూప్ చెప్పారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అనేక కేసుల్లో 24 గంటల్లోనే నిందితులను జైలుకు పంపించామని, తప్పు చేసింది పోలీసులు అయినా చర్యలు తీసుకున్నామన్నారు. రాజమండ్రిలోని శిరోముండనం కేసు, ప్రకాశం జిల్లాలో మాస్క్ కేసు, విశాఖపట్నంలో నూతన నాయుడు భార్య చేసిన శిరోముండనం కేసు అయినా వెంటనే నిందితులపై చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అనేక అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు రూ.10 లక్షల వరకు సాయం అందించారన్నారు. డిసెంబర్ 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటిరింగ్ కమిటీ మీటింగ్‌లో అక్కడ పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించాం. ఆరోజే దాదాపు 34 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఉద్యోగాల కల్పనకు ఆలస్యానికి తావివ్వకుండా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఏమేమి ఉన్నాయో.. వాటిని గుర్తించి బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారన్నారు. అనంతపురంలో ఎం. స్నేహలత (21) అనే యువతి 22 డిసెంబర్ 2020న హత్యకాబడితే.. బాధిత కుటుంబానికి కలెక్టర్ గంధం చంద్రుడు.. రూ.4,12,500 ఆర్థికసాయం అందించారని, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిందితులను 60 రోజుల్లో శిక్షించేలా సీఎం వైయస్ జగన్ హోంశాఖను ఆదేశించారని చెప్పారు.