నంద్యాల: గ్రామీణ స్థాయిలో మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం.. ఆంధ్రా క్రీడా పోటీలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా నిర్వహిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిభను వెలికితీసేందుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఆడుదాం ..ఆంధ్రా పోటీల స్ఫూర్తితో వైయస్ఆర్‌సీపీ యువ నాయకుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు శిల్పా కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టారు .కార్తీక్‌రెడ్డి ప్రీమియర్ లీగ్ పేరుతో తలపెట్టిన టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. క్రీడా సంబరం ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించి పట్టణపురవీధుల్లో వైయస్ఆర్‌సీపీ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. జై జగన్ అంటూ నినదించారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కేపీఎల్ క్రికెట్ టోర్న మెంట్‌ను శిల్పా కార్తీక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం నియోజకవర్గంలోని క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ లాంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. తాము వ్యాపారాలు చేస్తూ వచ్చిన సంపాదనలో రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథం తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి ప్రాధాన్యత ప్రజలకు సేవ చేయడమేని ఆ తరువాతే రాజకీయాలు చేస్తామన్నారు. టోర్నమెంట్లో 205 జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. అన్ని జట్లుకు ఉచితంగా నూతన క్రికెట్ కిట్లను అందజేశామన్నారు. టోర్నీ ముగిశాక కిట్లను క్రీడాకారులే ఉపయోగించుకోవచ్చన్నారు. గెలుపొందిన టీంలకు బహుమతులు.. మొదటి బహుమతి రూ. 1,00,000 రెండవ బహుమతి రూ.50,000 మూడవ బహుమతి రూ.20,000 నాలుగవ బహుమతి రూ.10,000 నగదుతో పాటు ట్రోఫీ అందజేస్తున్నట్లు కార్తీక్ రెడ్డి తెలిపారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి కేపీఎల్ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.