శ్రీకాకుళం: కులగణన వలన రాష్ట్రంలో 145 బీసీ, 58 ఎస్సీ, ఎస్టీ కులాల వారికి సముచితమైన న్యాయం చేకూరుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆధ్వర్యంలో బృందావనం ఫంక్షన్ హాల్లో కులగణన సర్వేకు సంబంధించి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, నరసన్న పేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మకమైన నిర్ణయంతో కులగణనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. స్వాతంత్ర్యం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగణన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు. బీసీ కులాల మనోవభావాలను పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస మౌలిక వసతులు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ స్వపరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కేలా, ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేస్తూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు. కుల గణనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.