‘ఎల్లో బేతాళుల’ కధలు ఎవరైనా నమ్ముతారా?

 వైయ‌స్ఆర్ సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి 

విద్యుత్‌ ఛార్జీలపై చంద్రబాబు పూర్తిగా అసత్య ప్రచారం

ఈ మూడేళ్లలో రూ.42 వేల కోట్ల భారం వేశామంటున్నారు

ఈ ప్రభుత్వం ఎక్కడ అంత భారం మోపింది?

దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 

నిజానికి ఇప్పటిదాకా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు

ఇవాళే తొలిసారిగా కొంత ఛార్జీలు పెంచడం జరిగింది

ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

గత ప్రభుత్వం వదిలిపెట్టిన అప్పుల భారం

ఈ మూడేళ్లలో గణనీయంగా పెరిగిన వ్యయం

అందువల్లే అనివార్యంగా కొంత ఛార్జీల పెంపు

అదీ విద్యుత్‌ ఎక్కువ వినియోగించేవారిపైనే

ఈ క్లిష్ట పరిస్థితుల్లో పెద్దగా భారం వేయడం లేదు

భవిష్యత్తులో మళ్లీ భారం పడకుండా చూస్తున్నాం

వీలైతే తగ్గించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

గుర్తు చేసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి 

చంద్రబాబు పాలనలో ఇష్టారాజ్యంగా ఛార్జీలు 

అయినా ఇప్పుడు ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు

మరోవైపు వామపక్షాలూ, బీజేపీ కూడా అదే బాటలో

బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి

రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించమనాలి

తాడేపల్లి: ‘ఎల్లో బేతాళుల’ కధలు ఎవరైనా నమ్ముతారా? అని  వైయ‌స్ఆర్ సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. విద్యుత్‌ ఛార్జీలు కొన్ని తరగతులకు స్వల్పంగా పెంచుతూ, దాదాపు రూ.1400 కోట్ల భారం. నిన్న ఈఆర్‌సీ అనుమతి ఇచ్చిన మేరకు పెంచడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలు చెల్లిస్తున్నాం. కానీ ఇప్పుడు పెరిగిన వ్యయం వల్ల అనివార్యంగా స్వల్పంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. అది కూడా ఎక్కువ విద్యుత్‌ వినియోగించే వారిపైనే భారం వేసే విధంగా టారిఫ్‌ నిర్ణయించడం జరిగింది.

అయినా విష ప్రచారం:
    అయితే సహజంగానే టీడీపీ నిన్నటి నుంచి విష ప్రచారం చేస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై భారం వేసి, ఆ ఆదాయంతో ఏదో చేయాలని అనుకోదు. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచిస్తుంది.
ముఖ్యంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తారు. వారి మేలు కోసమే పని చేస్తారు.
    నిజం చెప్పాలంటే ఆనాడు టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా పీపీఏలు చేసుకున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలూ పెంచి, అడ్డగోలుగా విద్యుత్‌ సంస్థలను నడిపారు. అలాగే ఛార్జీలు కూడా పెంచారు. కానీ ఇప్పుడు టీడీపీ ఆందోళన చేస్తూ, ఉద్యమానికి సిద్ధమవుతోంది. మరోవైపు వామపక్షాలు, బీజేపీ కూడా దానికి మద్దతు పలుకుతున్నాయి.

అడ్డగోలు అసత్యాలు:
    ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, తమ హయాంలో 2014–19 మధ్య విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదని ప్రకటించామని, నిరంతర విద్యుత్‌ సరఫరా చేశామని తనంతట తాను చెప్పుకుంటున్నారు. తనది సుపరిపాలన అంటూ, విద్యుత్‌ కూడా అదనంగా ఉత్పత్తి చేశామని చెప్పారు.
    మరోవైపు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ, ఈ మూడేళ్లలో ప్రజలపై రూ.42,172 కోట్ల విద్యుత్‌ భారం మోపామని అన్నారు. దానికి ఏదైనా ఆధారం ఉందా? ఈ ప్రభుత్వం ఎక్కడ అంత భారం మోపింది. నిజానికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు. ఇవాళే తొలిసారిగా ఛార్జీలు పెంచడం జరిగింది.
    అది కూడా గత సంవత్సరం వాడిన విద్యుత్‌ ఆధారంగా కాకుండా,  ఎప్పటికప్పుడు వాస్తవ వినియోగాన్ని బట్టి మాత్రమే ఛార్జీలు వసూలు చేయడం జరుగుతోంది. దీని వల్ల వినియోగదారులకు చాలా మేలు జరుగుతోంది.

చంద్రబాబు నిర్వాకం:
    మరోవైపు చంద్రబాబు హయాంలోని దాదాపు రూ.19 వేల కోట్లు.. ట్రూఅప్‌ ఛార్జీల భారం కూడా ఈ ప్రభుత్వంపై పడింది. వాస్తవానికి ఆయన ప్రభుత్వం దాన్ని మోయాల్సి ఉన్నప్పటికీ, అది జరగలేదు. దానికి సంబంధించి గత ఏడాది రూ.7 వేల కోట్లకు డిస్కమ్‌లు ప్రతిపాదిస్తే, ఈఆర్సీ నిర్ణయం మేరకు అమలు చేస్తే దాదాపు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే వచ్చాయి. అంతే తప్ప, 2018–19 నుంచి ఇవాళ్టి వరకు 500 యూనిట్ల వినియోగం వరకు ఒక్క పైసా పెంచలేదు. ఆ విధంగా నిర్వహిస్తూ వచ్చాం.
    ఇంకా చంద్రబాబు నిర్వాకం చూస్తే.. 2014–15లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్‌ సంస్థలకు రూ.20,790 కోట్ల అప్పు ఉంటే, ఆయన అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.69 వేల కోట్లకు పెంచారు. అదే విధంగా 2014–15లో చెల్లించాల్సిన బకాయిలు రూ.2,845 కోట్లు ఉంటే, ఆయన దిగి పోయే నాటికి అవి రూ.21,540 కోట్లకు పెంచాడు. ఆ విధంగా ఒక వైపు రూ.49 వేల కోట్ల అప్పులు, మరోవైపు బకాయిలు రూ.19 వేల కోట్లు పెంచాడు.

అనివార్యంగా..:
    డిస్కమ్‌లకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, దీర్ఘకాల ప్రయోజనాలు కాపాడడం కోసం జగన్‌గారి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే అనివార్యంగా ఎక్కువ విద్యుత్‌ వినియోగించే వారిపై కొంత భారం మోపాల్సి వస్తోంది.

బాబు పాలనలో ఛార్జీల మోత:
    మరి ఆరోజు చంద్రబాబు ఏం చేశారో చూద్దాం.. మార్చి 1, 2016. విద్యుత్‌ ఛార్జీలకు రెక్కలు అంటూ ఈనాడులోనే కథనం వచ్చింది. బొగ్గుపై సుంకం పెరగడంతో పెంచక తప్పలేదంటూ ఆ స్టోరీ రాశారు. అప్పుడు భారం దాదాపు రూ.1400 కోట్లు. ఇంకా వాడే కొద్దీ వాత. రూ.215 కోట్ల ఛార్జీల వడ్డన. అంటూ.. వివిధ పత్రికల్లో వచ్చిన కధనాలు ప్రస్తావించారు.
ఆ విధంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచక తప్పడం లేదని అప్పట్లోనే చంద్రబాబు చెప్పారు. దాని వల్ల కేవలం 14 శాతం వినియోగదారులపైనే భారం పడుతోందని కూడా అప్పుడు ఆయన చెప్పారు.
    మరోవైపు చంద్రబాబు గతంలో కూడా ఇష్టారాజ్యంగా పీపీఏలు చేసుకున్నారు. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనే విధంగా ఒప్పందాలు చేసుకున్నాడు. విద్యుత్‌ ఛార్జీలు పెంచాడు. మరోవైపు అప్పులూ పెరిగాయి. మరి చంద్రబాబు ఏం చేసినట్లు?. 

విక్రమార్కుడు–బేతాళుడు:
    అయినా ఎల్లో మీడియాలో అంతులేని దుష్ప్రచారం కొనసాగుతోంది. చంద్రబాబు ఏది అనుకుంటే దాన్ని వారు ఎత్తుకుంటున్నారు. అయితే బేతాళుడి కధలో శవం మళ్లీ విక్రమార్కుడి భుజం మీదకు లేదా చెట్టు మీదకు వెళ్లిందంటే ఎవరైనా నమ్ముతారు కానీ, ఆ శవం వల్ల విక్రమార్కుడు ఇంద్ర లోకానికి వెళ్లాడనో, ఆ శవాన్ని పట్టుకుని విక్రమార్కుడు ఇంద్రలోకానికి వెళ్లాడనో చెబితే ఎవరైనా నమ్ముతారా? అలాగే ఎల్లో మీడియా కధనాలు కూడా కట్టుకధల్లో అత్యంత నీచమైన కట్టుకధలుగా కనిపిస్తున్నాయి. వాటిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.

ఇక ఈ ప్రభుత్వ హయాంలో..:
    జగన్‌గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేట్లు పెంచడంపై కాకుండా పీపీఏలను సమీక్షించారు. అయితే ఇప్పుడు విద్యుత్‌కు చాలా డిమాండ్‌ ఉంది. సాయంత్రం ఎక్కువగా వినియోగిస్తారు. కానీ ఆ సమయంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఉండదు. అందుకే అనివార్యంగా కాస్త ఎక్కువైనా విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయినా వినియోగదారులపై వీలైనంత వరకు భారం పడకుండా చూస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌కు ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల భారం పడుతోంది కాబట్టి, దాన్ని తగ్గించడంపైనా దృష్టి పెట్టారు. అంతేతప్ప, ఏకపక్షంగా ఛార్జీలు పెంచాలని యోచించలేదు. వ్యవసాయానికి దీర్ఘకాలం విద్యుత్‌ తక్కువ ఖర్చుకే సరఫరా చేసేలా సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 
    ఇవాళ్టికి కూడా 30 యూనిట్లు, 50 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగదారులపై వేస్తున్న ఛార్జీ దేశంలోనే చాలా తక్కువ. ఇది వాస్తవం.

వాటినెందుకు ప్రశ్నించడం లేదు?:
    విద్యుత్‌ ఛార్జీలను విమర్శిస్తున్న బీజేపీ నేతలు, రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలను ఎందుకు ప్రస్తావించడం లేదు. మరోవైపు గ్యాస్‌ ధర కూడా పెరిగింది. అయినా దాని గురించి మాట్లాడడం లేదు. కేంద్రం ఇష్టారాజ్యంగా వాటి ధరలు పెంచుతున్నా, వారు ఎందుకు మాట్లాడడం లేదు?. నిజం చెప్పాలంటే అదే స్థాయిలో ఇక్కడ ఛార్జీలు పెంచడం లేదు. ఈ విషయాన్ని గమనించాలి.
    ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెద్దగా భారం వేయకుండా, భవిష్యత్తులో మళ్లీ భారం పడకుండా, వీలైతే తగ్గించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మీకు చెప్పుకోవడానికి ఏముంది?:
    చంద్రబాబు తన హయాంలో రూ.90 వేల కోట్లు ఉన్న అప్పులను దాదాపు రూ.4 లక్షల కోట్లకు పెంచాడు. అయినా ఒక్క సంక్షేమ పథకం చెప్పుకోవడానికి లేదు. మహా అయితే చంద్రన్నకానుక అంటారు. కానీ అందులో ఇచ్చిన ప్రతి వస్తువు సేకరణలో కమిషన్ల వ్యవహారం. అది అందరికీ తెలిసిందే.
    ఇవాళ ఈనాడులో మరో స్టోరీ రాశారు. జగన్‌గారి ఫోటో కోసం కోట్లు ఖర్చు చేశారని. కానీ పిల్లల ఆరోగ్యం కోసం, ఆ ఆహారం పరిశుభ్రంగా ఉండేలా, రేపర్ల కోసం ప్రభుత్వం ఆ పని చేసింది. కానీ మీరేం చేశారు. జయము జయము చంద్రన్న అన్న భజన కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు. దీక్షల పేరుతో వందల కోట్లు ఖర్చు చేశారు. 
    ఆ 5 ఏళ్ల చంద్రబాబు పాలన బాధ్యతా రాహిత్యంగా సాగితే, అందుకు పూర్తి భిన్నంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఆకాశం మీద ఉమ్మేస్తే, మొహం మీద పడుతుంది. ఇక బీజేపీ నేతలకు చెబుతున్నాం. మీకు ధైర్యముంటే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించమని కోరండి.

అందుకే సమీక్షించాల్సి వచ్చింది:
    నిజానికి ఆనాడు అవసరం లేకపోయినా ఎక్కువ ధరకు చంద్రబాబు పీపీఏలు చేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వం వాటిని సమీక్షించాల్సి వచ్చింది. 2004కు ముందు కూడా చంద్రబాబు అదే విధంగా పీపీఏలు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 తర్వాత కూడా సరిగ్గా అలాగే చేశారు.
    కానీ ఈ ప్రభుత్వం ప్రతి చోటా విద్యుత్‌ ధర తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అదే విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఏ మాత్రం ఆటంకం లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే సౌర విద్యుత్‌ ఉత్పత్తికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
    మరోసారి చెబుతున్నాం. నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారిపై వేస్తున్న భారం ఇవాళ్టికీ మన దగ్గరే చాలా తక్కువగా ఉంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే, ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తోంది.. అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top