బద్వేల్‌ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటాం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

 బద్వేల్‌ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ

ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయి

నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం

 ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తీరు సినీ ఇండస్ట్రీ వాళ్లకే నచ్చడం లేదు 

ఆన్‌లైన్‌  టికెట్‌ విధానాన్ని అందరూ స్వాగతిస్తున్నారు

సచివాలయం: బద్వేల్‌ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌సీపీకి అభిమానం పెరిగిందని, అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటామని చెప్పారు. ఈ రెండేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 

  

 బద్వేలు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటాం. ప్రజల అభిమానం, దీవెనలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ఉన్నప్పటికీ.. ప్రతి ఎన్నికను గీటురాయిగా తీసుకుని పని చేస్తాం.  ప్రతి ఎన్నికల్లోనూ వైయస్సార్‌సీపీకి అభిమానం పెరుగుతోంది, ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది ఆ పార్టీకే వదిలేస్తాం. పోటీ పెట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదు. 
- నిజానికి, ఎవరైనా శాసనసభ్యులు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే. వారి కుటుంబ సభ్యులు పోటీచేస్తున్నప్పుడు గౌరవించి పోటీ పెట్టకపోతే... మేం ఆహ్వానిస్తాం.  ఒకవేళ పోటీ పెడితే ఎన్నికను మేము కూడా సీరియస్‌గానే తీసుకుంటాం. ఈ స్థానంలో డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి భార్య డా. దాసరి సుధ అభ్యర్థిగా పోటీ చేస్తారని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు.
- ఈ ప్రభుత్వంమీద, ముఖ్యమంత్రి జగన్‌గారి మీద  అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకపోగా, మరింతగా అభిమానం పెరిగిందనే దానికి 2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన వరుస ఎన్నికల ఫలితాలను నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

 మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నంద్యాల ఉప ఎన్నికను గమనిస్తే కేవలం 30వేల మెజార్టీతో గెలిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలాంటి ఎన్నిక వచ్చినా మేము చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి మరోసారి గెలిపించాలని అభ్యర్థిస్తాం. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు గత రెండేళ్లలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి 95 శాతం అమలు చేశామని ప్రజలకు వివరిస్తాం. మంచి మెజార్టీతో మేము గెలుస్తాం.

 ఎటువంటి ప్రలోభాలు లేని నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రజల అసెస్‌మెంట్‌, వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకు కూడా అవసరమే కాబట్టి నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలనుకుంటున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు కచ్చితంగా ఉంటాయి. ప్రతిపక్షాలు ప్రలోభాలు పెట్టకుండా ప్రయత్నిస్తాం. మేము కూడా అలాంటివాటి జోలికి వెళ్లం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఈ ఉప ఎన్నికలో కూడా మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నాం. పూర్తిగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తాం. 

పవన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ పెద్దలే వ్యతిరేకిస్తున్నారు

 రాజకీయాల్లో రెండు గుర్రాల స్వారీ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ తన స్వార్థం కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ పెద్దలే వ్యతిరేకిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆయన పెద్ద గుదిబండగా మారారని వాళ్లు భావిస్తున్నారు. 

 ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని అందరూ హర్షిస్తున్నారు. సినిమా పరిశ్రమకు- ప్రేక్షకుడికి మధ్య బ్యాలెన్సింగ్‌ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సినిమా ఇండస్ట్రీతో పాటు అందరికీ ఉపయోగపడేవిధంగా ప్రొగ్రెసివ్‌ పాలసీ విధానాన్ని తీసుకురావాలని చేస్తున్న మా ప్రయత్నాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. ఇందులో ఏవో ఘోరాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై బురద చల్లాలని పవన్ కళ్యాణ్ చూడటం, చివరికి అది ఆయన మీదే కొట్టుకున్నట్లు అయింది. ఇండస్ట్రీవాళ్లు కూడా ఇలాంటి వ్యక్తితో వెళితే అసలుకే ఇబ్బంది అవుతుందని పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

  ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం ద్వారా డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్‌ అందరూ కూడా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. వీటిపై ఇంతకు ముందు ఎటువంటి కంట్రోల్‌ ఉండేది కాదు. బాహుబలి సినిమాకు మొదటి వారంలో 50శాతమే టికెట్లు బుక్‌ అయినట్లు వాళ్లు చెబుతున్నారు. నిజంగా అదే జరిగితే అంతకన్నా ఘోరం ఇంకేదైనా ఉందా? తొలివారంలోనే ఆ సినిమాకు థియేటర్లు ఫుల్‌ కాలేదంటూ..  మోసం చేయాలని ప్రయత్నం చేశారు, లెక్కలు కూడా చూపలేదు. దీనివల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు, ప్రభుత్వానికి రావాల్సిన పది రూపాయలో, ఇరవై రూపాయలో ఆగిపోతుంది. అవకతవకలు జరిగే విధానాన్ని మార్చి, ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఎవరికీ నష్టం లేకుండా అందరికీ లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

  ఇందులో ఒక అపోహ గురించి చాలామంది అడిగారు. ఇందుకు సంబంధించి మంత్రిగారు ఇప్పటికే క్లారిఫికేషన్‌ ఇచ్చారు. టికెట్‌ అమ్మకాలు ద్వారా వచ్చిన డబ్బులు ప్రభుత్వం తన దగ్గర కొద్దిరోజుల ఉంచుకుని ఆ తర్వాత నిర్మాతలకు అందజేస్తుందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే లేదు. ఆటోమేటిక్‌గా ఎవరిది వాళ్లకు వెళుతుంది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌ పాత్ర మాత్రమే పోషిస్తుంది. తక్కువ ఖర్చుతో మధ్య తరగతి ప్రజలకు కూడా వినోదాన్ని అందించలన్నదే మా విధానం. ఈ విధానం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందంటే.. అది ఏరియాలు వారీగా డిస్ట్రిబ్యూటింగ్ తీసుకుని,  మొదటి వారంలోనే టికెట్‌ ధరలు అధికంగా పెంచేసి  సినిమా ప్రదర్శించేవారికి మాత్రమే. వంద రూపాయిల టికెట్‌ను వెయ్యి రూపాయిలు వరకూ పెంచి అమ్ముకునేవారికి మాత్రమే. 

  ఎవరైతే పారదర్శకంగా ఉండాలనుకుంటారో వారంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తారు. ఎన్టీ రామారావుగారి నుంచి కాంతారావు, రాజబాబు సినిమా ఏదయినా ఒకే టికెట్‌, ఒకే ధర. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం వల్ల ప్రభుత్వానికి వేలకోట్లు అయితే ఆదాయం రాదుకదా? దీనిపై టీడీపీ, పవన్‌ కల్యాణ్‌ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మటన్‌ మార్ట్‌లు అంటూ ఇలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం ఏ పని చేసినా విపక్షాలు అడ్డదిడ్డంగా, ఏమీలేని దానికి, శూన్యం నుంచి ఒకదానిని పుట్టించి, దానిమీద హడావుడి చేసి, విమర్శలు చేసి, చివరకు వాళ్లే జడ్జిమెంట్‌ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఏమీ దొరకక ఇలాంటివి సృష్టిస్తున్నారు. మొదటి వారంరోజుల్లో ఎంతటి ధరకైనా సినిమా టికెట్‌ అమ్ముకోవచ్చని అనుమతి ఇస్తే ఈ విమర్శలు, ఆరోపణలు ఆగిపోతాయి.

 ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం అమలు చేయడం వల్ల ఇబ్బందులు ఏంటని విమర్శలు చేసేవారిని మీడియా కూడా ప్రశ్నించాలి. ప్రజలకు ఉపయోగపడేలా మంచి ఆలోచనను అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి సినిమా పెద్దలతో చర్చించడం కూడా జరిగింది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

    చంద్రబాబు నాయుడులా ముఖ్యమంత్రి జగన్ గారికి షో చేయడం ఇష్టం లేదు. ఫోటోలకు ఫోజులు ఇచ్చి జాతీయ మీడియాలో హైలైట్‌ చేయించుకోవడం మాకు అలవాటు లేదు. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ముఖ్యమంత్రి గారు సమావేశం కాలేదంటూ విమర్శలు చేయడం కూడా సరికాదు. ఈ విధానంపై ఎటువంటి అనుమానాలు ఉన్నా, సినిమా పెద్దలు ఎప్పుడైనా ముఖ్యమంత్రిగారిని అపాయింట్ మెంటు తీసుకుని కలవొచ్చు.

తాజా వీడియోలు

Back to Top