చిత్తూరు: ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేస్తే అలాంటి వారిని ఏమనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా సూటిగా ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం పేరుతో కూటమి సర్కార్ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా రోజా ఏమన్నారంటే.. సూపర్‌సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అన్నారు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులకు మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ? ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా? తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విద్యాలయం (#KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా? గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు , దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు. పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే వైయస్ జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.