శ్రీకాకుళం: నిస్సహాయులకు అండగా నిలిచేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్నారని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో వైయస్ఆర్ కల్యాణ మండపంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వాన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడి వీధికి చెందిన లబ్ధిదారులంతా ఇక్కడి శిబిరానికి హాజరయ్యారు. 296 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించారు. మొత్తంగా శ్రీకాకుళం నియోజవర్గం పరిధిలో సుమారు 25 వేల మందికి సురక్ష ద్వారా వివిధ ధ్రువీకరణలు జారీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.."నిస్సహాయులకు అండగా నిలిచేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న అధికార యంత్రాగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోతే అలాంటి వారి కోసమే జగనన్న సురక్ష. ఇందులో భాగంగా అర్హులను గుర్తించి, వారికి ధ్రువీకరణ పత్రాలు వెను వెంటనే ఇస్తున్నాం. ఇందుకు ఒక్క పైసా కూడా ఎవ్వరూ ఖర్చు చేయనవసరం లేదు. ఇవాళ పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చాము. ప్రజల కష్టాలు తీసుకొని తదనుగుణగా పరిపాలనలో మార్పు లు చేసి అందరి సంతోషాలకూ కారణం అయ్యాం. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆంధ్రావని వాకిట వైయస్ జగన్ పాలన ఆదర్శంగా ఇవాళ నిలుస్తోంది. అందుకు కారణంగా ఆ రోజు మీరంతా ఓటు వేసి మమ్మల్ని గెలిపించడమే. సమర్థ నాయకత్వానికి అండగా మీరంతా నిలిచిన కారణంగానే ఇన్ని పాలన సంబంధ సంస్కరణలు సాధ్యం అయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో మహిళా సంఘాలకు మోసం చేశారు చంద్రబాబు. వారికి చెందిన రుణాలు చెల్లిస్తామని చెప్పి చెల్లించకుండా తెలివిగా తప్పుకున్నారు. ఆ విధంగా మోసం చేసి వెళ్లిపోయిన చంద్రబాబు మళ్ళీ మరొక్క అవకాశం కావాలని అడుగుతున్నారు. కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం విపక్ష నేతకు భిన్నంగా ఇచ్చిన హామీ మేరకు మీ అందరి రుణాలనూ నాలుగు విడతలుగా చెల్లిస్తానని చెప్పారు. ఆ..మాట ప్రకారం బ్యాంకర్లకు చెల్లించి మీ అందరినీ తలెత్తుకునే విధంగా చేశారు. ఓటు అడిగే ముందే మీ ఎదుట తన మ్యానిఫెస్టోను ఉంచి ఆ రోజు జగన్ ఎన్నికలకు వెళ్ళారు. ఆ రోజు చెప్పిన విధంగానే ఇప్పటికే 98 శాతం పనులు పూర్తి చేశాము. గౌరవంగా పథకాలు అందుకునే పద్ధతిని తీసుకు వచ్చాము. జన్మ భూమి కమిటీ సభ్యులు హవా సాగించిన రోజులు ముగిశాయి. ఒకనాడు పథకాలు అందాలి అంటే వారికి లంచం ఇవ్వనిదే పనులు జరిగేవి కావు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. ఆ రోజులు పోయాయి. నిత్యావసర ధరలు దేశం మొత్తం మీద పెరిగాయి అన్న విషయం పౌరులు గుర్తించాలి. వాటి ధరలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. సమాజంలో అందరి జీవన ప్రమాణాలు పెరగాలి అని సీఎం జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వివిధ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు. ఆదేశిక సూత్రాలను అనుసరించి పాలన సాగిస్తూ, పేద,ధనిక వర్గాల మధ్య భేదభావాలు లేకుండా చేస్తున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు గడుస్తున్నా,సమాజంలో ఇప్పటికీ మిగిలి ఉన్న అసమానతలు తొలగిపోవాలి అన్నా,జీవన ప్రమాణాలు పెరగాలన్నా వై.ఎస్.జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి. అందుకు మీ మద్దతు మళ్లీ అవసరం. మీరు మేలు చేసే ప్రభుత్వానికి మరోసారి అండగా నిలవండి. ఇవాళ అవినీతి లేని వ్యవస్థను రూప కల్పన చేశాం. అలానే మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకుండా పథకాల వర్తింపు అన్నది సుసాధ్యం చేశాం. వలంటీరు వ్యవస్థ తో అనేక పౌర సేవలను చేరువ చేశాం. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో మీ ఇంటి చెంతకే పాలన తీసుకువచ్చాం. జగనన్న సురక్షతో మీ గడప దగ్గరకే 11 రకాల సేవలను మరింత సుసాధ్యం చేశాం. వీటి కోసం ఒకప్పుడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇకపై రాదు కూడా ఆ విధంగా ఇవాళ అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. సీఎం వైయస్ జగన్ నిర్ణయాలు అన్నవి ప్రజా శ్రేయస్సు కోరి ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం..పెద్ద మార్కెట్ రూపు రేఖలను పూర్తిగా మర్చేశాం. రిమ్స్ లో 900 బెడ్స్ అందుబాటులోకి తీసుకు వచ్చాం. వీటిని అన్నింటినీ చూసి, మీరు మీ చెంత జరిగిన అభివృద్ధిని మరోసారి గమనించి, గత పాలనకూ ఇప్పటి పాలనకూ ఉన్న భేదాన్ని గుర్తించండి. విపక్షాల మోసపూరిత మాటలకు ఆకర్షితులు కాకండి. అన్ని వర్గాల శ్రేయస్సునూ కోరుకునే జగన్ కు అండగా నిలవండి అని విన్నవిస్తూననాని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ అధికారి వెంకట రావు, పిల్లల నీలాద్రి, అర్జున్ రెడ్డి, చిన్న బాబు, ఖాన్, భాను ప్రసాద్, అశిరి నాయుడు, పొన్నాడ రిషి, భాస్కర్ రావు తదితరుల పాల్గొన్నారు.