తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణిని, ఆమె భర్త, పిల్లలతో సహా ఈనెల 4న హైదరాబాద్‌లో గుడికి వెళ్లి వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, నేరుగా చిలకలూరిపేట తీసుకొచ్చారని, అప్పటి నుంచి నాలుగు రోజుల పాటు, థర్డ్ డిగ్ర ఉపయోగించి దారుణంగా వేధించారని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ ప్రతినిధులు వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ ప్రతినిధులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, వినయ్‌కుమార్ మీడియా సమావేశంలో ఒంగోలు పోలీసులు సుధారాణి దంపతులపై కొనసాగించిన దమనకాండను వివరించారు. నిజానికి కేసు చిలకలూరిపేట టౌన్ పీఎస్‌లో నమోదై ఉన్నా, రూరల్ పీఎస్‌లో నిర్భంధించి, బంధువులను పిల్చి పిల్లలను వారికి అప్పగించి, 6వ తేదీ ఉదయం వరకు థర్డ్ డిగ్రీతో దారుణంగా హింసించారని, కనీసం మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించారని వారు తెలిపారు. ఒంగోలు టౌన్ పీఎస్‌లో వారిని లాయర్లు కలవడానికి ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదని చెప్పారు. ఆ తర్వాత 6వ తేదీనే ఒంగోలు టౌన్ పీఎస్ నుంచి డీఎస్పీ ఆఫీస్‌కు తరలించి, అక్కడా దారుణంగా హింసించి, తిరిగి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ ప్రతినిధులు వెల్లడించారు. మర్నాడు 7వ తేదీన ఉదయం గుంటూరు కొత్తపేట పీఎస్‌కు తరలించి, అక్కడా శారీరక దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు. సుధారాణిని అక్రమంగా నిర్భంధించి, హింసించడమే కాకుండా కేసులతో ఏ సంబంధం లేని ఆమె భర్తను కూడా వేధించి, హింసించారని చెప్పారు. ఒక కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏకంగా ఆరు కేసులు బనాయించారని ఆక్షేపించారు. చివరకు తాము హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో, 8వ తేదీ సాయంత్రం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారని చెప్పారు. కస్టడీలో పోలీసుల థర్డ్ డిగ్రీతో తన చేతులు, కాళ్లపై ఏర్పడిన గాయాలను సుధారాణి మెజిస్ట్రేట్‌కి చూపారన్న వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ ప్రతినిధులు.. ఆమె కుటుంబాన్ని అన్యాయంగా వేధించిన, హింసించిన ప్రకాశం జిల్లా ఎస్పీ, చిలకలూరిపేట సీఐపై న్యాయపరంగా చర్యలు తీసుకునే దాకా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కోర్టులో సుధారాణి వాంగ్మూలాన్ని 164 సెక్షన్ కింద నమోదు చేసిన మెజిస్ట్రేట్, గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారని తెలిపారు. సుధారాణి శరీరంపై గాయాలున్నట్టు వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆమెను పోలీసులు హింసించినట్లు ధృవీకరించినట్లు అయిందని చెప్పారు. సుధారాణిని వేధించి హింసించేందుకు ఏకంగా ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలతో పాటు, 200 మంది పోలీసులు పని చేశారని వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ ప్రతినిధులు వివరించారు.