హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైయస్ఆర్‌సీపీ నేతలు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులు భారీగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను పోలీసులు అడ్డుకుని, ఆయన గొంతు పట్టుకుని నెట్టివేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసుల ఓవర్‌యాక్షన్‌పై పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధిపై ఇలాంటి ప్రవర్తన అనాగరికమని విమర్శించారు. నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్‌లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మహిళలను అవమానించే విధంగా రాతలు ఉన్నాయని ఆరోపిస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మార్గాని భరత్, కారుమూరి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.