తాడేపల్లి: కాపులను మోసంచేసి చంద్రబాబుకు ఊడిగం చేసే పనిలో దత్తపుత్రుడు ఉన్నాడని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ ఆత్మహత్య దిశగా పవన్‌కళ్యాణ్ పయనిస్తున్నారని వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిత్యం పిచ్చి వ్యాఖ్యలతో గ్రాఫ్ దిగజారిపోవడంతో పాటు, రాజకీయాల్లో మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ వ్యక్తిగా పవన్ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ‘పవన్ నువ్వు ఎక్కింది వారాహి కాదు పందిని. ఆ పందిపై తిరుగుతూ నీపై నువ్వే బురద చల్లుకుంటున్నావు. నీ పిరికితనం తప్ప.. నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి. అసలు నీస్థాయి ఎంత.. నువ్వు గెలిచిన సీట్లు ఎన్ని. నీ మాటలు చాలదా.. ఒకడు నిన్ను చంపాలా? నీ వ్యాఖ్యలతో నువ్వే రాజకీయంగా చచ్చిపోయేలా ఉన్నావు. నీకే నమ్మకం లేని ఎన్నికలకు నువ్వే ప్రచారం చేసుకోవడం చూస్తే నవ్వొస్తోంది. ఒకవేళ నిన్ను చంపాల్సి వస్తే.. వంగవీటి మోహనరంగాను హతమార్చిన వాళ్లకే ఆ ఆలోచన ఉంటుంది. నువ్వు చెగువేరా బొమ్మ వేసుకుని ప్రాణహాని గురించి ప్రస్తావించడం సిగ్గుచేటు..’ అని మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబును మాత్రమే కాదని, దుష్టచతుష్టయంతో పాటు దత్తపుత్రుడు పవన్‌ను కూడా ఒంటరిగానే ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రజల్లో సీఎం జగన్‌కు ఉన్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక భయపడుతున్న రామోజీరావు.. వపన్‌ను అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండే రామోజీరావు, అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చిపోయే పవన్ కలిసి.. నిత్యం ప్రజాసంక్షేమం కోసమే పనిచేస్తున్న సీఎం జగన్‌ను ఎక్కడికి పంపించగలరని నిలదీశారు. ‘రామోజీరావు లేనిపోనిదిరాసి.. గందరగోళం చేసి ప్రజల మనసులను మార్చాలనుకోవడం పూర్వం చెల్లింది. ఎన్టీఆర్‌పై అలాంటి రాతలేరాసి భ్రష్టుపట్టించారు . ఆ పాపానికి ఇప్పుడు ఖర్మ అనుభవించక తప్పదు..’ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ కూటమిని ఓడించేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారన్నారు. పవన్‌కు ప్రాణహానిపై భయం ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వం కచ్చితంగా విచారణ చేస్తుందని చెప్పారు. వైట్‌కాలర్ నేరగాడు రామోజీ భారతదేశంలోనే రామోజీరావుకి మించిన వైట్‌కాలర్ నేరస్థులు లేరని చెప్పారు. చిట్‌ఫండ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్నారు. న్యాయస్థానాలు సైతం విచారణను ఎక్కడా అపమని చెప్పలేదని.. పవన్ మాత్రం రామోజీకి ఒత్తాసు పలకడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాపుల కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి అండగా నిలబడింది ముద్రగడ పద్మనాభం ఒక్కరేనని చెప్పారు. వంగవీటి మోహనరంగారావు మరణానికి ముందే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పడు విజయవాడలో నిర్వహించిన కాపునాడులో కాపుల కోసం గొంతెత్తారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నించిన ముద్రగడను చిత్రహింసలకు గురిచేసినప్పుడు పవన్ ఎక్కుడున్నారని నిలదీశారు. ఎప్పుడూ కాపు ఉద్యమాల్లో పాల్గొనని వ్యక్తికి ముద్రగడ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని చెప్పారు. కాపులను వాడుకుని వదిలేసేలా పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలను గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో తాము ప్రజలకు చిత్తశుద్ధితో సేవచేస్తున్నామని చెప్పారు. ఈనాడు ఎంత రాసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దుష్టచతుష్టయం ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని.. పవన్ అనుకుంటే ఇచ్చేసేంత సులభం కాదని చెప్పారు. కాపులను మోసగించే మాటలు కాకుండా బీజేపీతో అఫిషియల్‌గా పొత్తులో ఉన్న పవన్.. దమ్ముంటే కేంద్రం వద్ద పెండింగ్‌లోని రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునేలా ఒప్పించాలని మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.