తాడేపల్లి: విధివంచితులైన దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని, పింఛన్ల మీద ఆధారపడి జీవించే దివ్యాంగుల విషయంలో రాజకీయాలు చేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక భారం పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్న అప్పిరెడ్డి, ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతూ ఆర్భాటాల కోసం ఆ ముగ్గురు నాయకులు చేసే ఖర్చులో ఇది అణువంత కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడి పోరాడుతుందని, ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఙప్తి చేశారు. దివ్యాంగుల కష్టాలను కళ్లుండీ చూడలేని ఈ ప్రభుత్వమే అసలైన మానసిక వైకల్యంతో బాధపడుందని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● దివ్యాంగుల విషయంలో రాజకీయాలా..? దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఖండించాలి. పింఛన్లు పెంచామని ఘనంగా చెప్పుకుంటూనే దివ్యాంగుల పింఛన్లు పీకేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు ఒక్క పింఛన్ కూడా తీసేయమని ఘనంగా చెప్పుకుని, కొత్త పింఛన్ ఒక్కటీ ఇవ్వకపోగా లక్షల సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు తీసేశారు. ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగుల పింఛన్లు కోత కోయడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో పింఛన్ పోతుందనే భయంతో దివ్యాంగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం మనసు కరగడం లేదు. విధివంచితులైన దివ్యాంగుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాల్సింది పోయి ఖర్చు తగ్గింపు పేరుతో అంగవైకల్యంతో బాధపడే వారి పింఛన్లు తీసేయడం సిగ్గుచేటు. వైకల్యంతో బాధపడుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో జీవనాన్ని కొనసాగిస్తున్న దివ్యాంగుల విషయంలోనూ ఈ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వీళ్లసలు మనుషులేనా అని ఎవరికైనా అనిపిస్తుంది. ● ఆరోజు పింఛన్లు సర్టిఫై చేసింది ఈ ప్రభుత్వ డాక్టర్లు కాదా..? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు దివ్యాగులు వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. నడవలేని స్థితిలో కొందరు, కదల్లేని స్థితిలో ఇంకొందరు, మానసికస్థితి సరిగా లేక కుటుంబ సభ్యులతో వచ్చిన ఇంకొందరు.. నోరు లేని వారు, వినలేని వారు, మానసిక రుగ్మతలున్న అభాగ్యులు. ఇలా సొంతంగా గడప దాటి బయటకు కూడా వెళ్లలేని దుస్థితో వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైనా రాజకీయాలు చేస్తారా? దొంగసర్టిఫికెట్‌లతో పింఛన్లు పొందుతున్నారని అటు డాక్టర్లు, ఇటు లబ్ధిదారులను ప్రభుత్వం అనరాని మాటలతో అవమానిస్తోంది. వీరంతా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్‌లతో పింఛన్ తీసుకుంటున్నవారే. గతంలో వారిచ్చింది దొంగ సర్టిఫికెట్‌లు అయితే, ఇప్పుడిచ్చేవి మంచివా? (ఈ సందర్భంగా కలెక్టరేట్‌లకు వచ్చిన దివ్యాంగుల ఫొటోలను ప్రదర్శించారు.) తమ బాధలు చెప్పుకోవడానికి సోమవారం వారంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో జరిగిన గ్రీవెన్స్‌లకు విచ్చేశారు. డాక్టర్‌లపై ఒత్తిడి పెంచి వైకల్య శాతం తక్కువగా రాసి పింఛన్లు తొలగించేస్తున్నారు. పింఛన్లు తొలగించడాన్ని కూడా ఈ ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టాలని చూస్తోంది. మా ప్రభుత్వ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి ప్రభుత్వ డాక్టర్లతో పరీక్షలు చేయించి పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డాక్టర్లే మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. అలాంటప్పుడు నాడు అర్హులైన వారు ఈరోజు అర్హులు కాకుండా ఎలా పోతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భారం తగ్గించే పేరుతో దివ్యాంగుల పొట్టకొట్టడం దుర్మార్గం. ● అవన్నీ ప్రభుత్వ హత్యలే: పుట్టుకతోనే దివ్యాంగురాలైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో నివసించే మేడం లక్ష్మి(53) పింఛన్ తొలగించడంతో ఆమె మనోవేదనకు గురై గుండెపోటుతో చనిపోయింది. ఈమె మృతికి ప్రభుత్వానిదే బాధ్యత. కళ్లు సరిగా కనిపించక పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని వెరిఫికేషన్ పేరుతో పిలిచి పింఛన్ తొలగించారు. దీంతో ఆయన మనస్థాపం చెంది బతికే మార్గం కానరాక భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. పింఛన్ తొలగించారనే దిగులుతో ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంకి చెందిన రామలింగారెడ్డి (48) ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న చెట్లలో ఆయన మృతదేహం కనిపించింది. రీ వెరిఫికేషన్‌లో పింఛన్ తీసేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య చెబుతోంది. ఇవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. అహంకారంతో వారిని బలితీసుకుంది. ● మీ ఆర్భాటాల ముందు ఈ పింఛన్లు భారమా..? ఈ కన్నీళ్లు పెట్టించే ఘటనలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదు. 2014-19 మధ్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. విచిత్రం ఏంటంటే ఆ సమయంలో మంజూరు చేసిన చాలా పింఛన్లు కూడా ఈ ప్రభుత్వం తొలగించేసింది. దివ్యాంగులు మనోవేదనకు గురై సెల్ టవర్ లు ఎక్కి, రోడ్డెక్కి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి వారి మీద జాలి కలగడం లేదు. ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లతో తిరుగుతూ ఆర్భాటాల కోసం వందల కోట్లు ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారు. కానీ పేదల కడుపులు నింపడానికి మాత్రం వారికి మనసు రావడం లేదు. దివ్యాంగుల పింఛన్లు ఈ ప్రభుత్వానికి ఖర్చుగా కనిపిండం మన దౌర్భాగ్యం. కొన్ని నియోజకవర్గాల్లో 5 వేల నుంచి 6 వేల పింఛన్లు తొలగించడానికి నోటీసులిచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి వీరికి పింఛన్లు నిలిపివేయడానికి ప్రభుత్వం కుట్ర చేసింది. నిజంగా మానసిక వైకల్యం ఈ ప్రభుత్వానికే ఉంది. దివ్యాంగుల కష్టాలను సహృదయంతో అర్థం చేసుకోలేక కర్కశంగా వ్యవహరిస్తోంది. అందుకే పింఛన్లలో పార్టీలను చూస్తోంది. ●దివ్యాంగుల పక్షాన వైయస్ఆర్‌సీపీ: 2016 లో కేంద్రం దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పడేస్తే, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2023 ఏప్రిల్‌లో గెజిట్ విడుదల చేసింది. దివ్యాంగుల సంక్షేమం పట్ల వైయస్ఆర్‌సీపీకి ఉన్న నిబద్ధతకి ఇది నిదర్శనం. దివ్యాంగుల పక్షాన నిలబడి వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది. సెప్టెంబర్ 1న అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తొలగించినా ఊరుకునే ప్రసక్తే లేదు. పింఛన్లు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్న డబ్బు కాదని మేం గుర్తు చేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. తీసేసిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలి. ప్రభుత్వం పింఛన్లు తొలగిస్తుందనే ఆందోళనతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వైయస్ఆర్‌సీపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదు. దివ్యాంగులకు వైయస్ఆర్‌సీపీఅండగా ఉంటుంది. పింఛన్లు పునరుద్ధరించే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతుంది.