బోర్డ‌ర్‌లోని అన్ని ఆస్ప‌త్రుల‌ను సిద్ధం చేశాం

సీఎం ఆదేశాల‌తో మ‌న‌వాళ్ల వివ‌రాల‌న్నీ సేక‌రిస్తున్నాం..

ఒడిశాకు మంత్రి అమ‌ర్‌నాథ్‌, ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌లు 

ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదు.. గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం 

ఒడిశాలో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖప‌ట్నం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాలు మేరకు ఇచ్ఛాపురం నుంచి బోర్డర్‌లో ఉన్న అన్ని ఆస్ప‌త్రుల‌ను సిద్ధం చేశామని, అన్ని కలెక్టరేట్‌ల‌లోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామ‌ని, రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్ తో పాటు మొత్తంగా 65 అంబులెన్స్‌లు పంపించామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందని.. ట్రైన్ ప్రమాదంలో క్షతగాత్రులను మృతులను తీసుకురావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించార‌న్నారు. ఇప్పటికే  ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్, ముగ్గురు ఐఎఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు, రెండు టీమ్‌లను ఒడిశాకు చేరుకున్నార‌ని, అక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నార‌ని చెప్పారు. విమానాశ్రయంలో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవి సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం అందిందన్నారు. ఒడిశాలో కూడా మన వారికి వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైనట్లు తెలిపారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అయినట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 10 మంది ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకున్నార‌ని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అయినట్లు తెలిపారు. అందరితో సంప్రదింపులు చేస్తున్నామ‌ని, రేపు ఉదయం 8 గంటల కల్లా పూర్తి సమాచారం అందిస్తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప‌పారు.  

Back to Top