అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్‌లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... గవర్నర్ నియమించిన విసి లని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకం. పోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారు గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్ ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని అర్థమవుతోంది. వైయస్ఆర్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. చేనేత కార్మికులను మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ... సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. - 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. - రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్‌లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది.