విజయవాడ : వైయస్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన వారితో పాటు టీటీడీ లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైఎస్ జగన్‌పై అవాస్తవాలు ప్రచారం చేశారని విమర్శించారు. సీబీఐ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, కూటమి నేతలు చెప్పింది పచ్చి అబద్ధమని ప్రజలకు స్పష్టమైందన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని అవినాష్ ఆరోపించారు. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నా కూడా చూడకుండా దాడులు చేసి ఇల్లు తగులబెట్టడం దారుణమన్నారు. అదే విధంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి జరిగిందని తెలిపారు. నారా లోకేష్, ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. విజయవాడలో పెట్రోల్ బాంబు సంస్కృతి తీసుకొచ్చారని, దాడి చేసిన వారంతా అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉన్న వారేనని అన్నారు. పోలీసుల వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని, టీడీపీ గుండాలతో పోలీసులు మంతనాలు జరిపి దాడులకు సహకరించారని తీవ్ర విమర్శలు చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ పేరుతో వారిని అధికార పార్టీ నేతలకు అప్పగించి దాడులకు ప్రోత్సహించారని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చేసిన అసత్య ఆరోపణలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకుంటున్నారని అవినాష్ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాల్ మనీ కేసులు, హత్యలు, అక్రమాలు పెరిగాయని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.