తాడేపల్లి: చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇది అమల్లోకి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని చోట్ల అతికష్టం మీద ఫ్యాక్టరీలు రూ.6కు కొనుగోలు చేస్తామని చెబుతున్నాయని, ఇదీ కూడా కొన్ని రోజుల ముచ్చటేనన్ని రైతులు దిగాలు చెందుతున్నారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఏపీ హార్టికల్చర్ స్టేట్, ఇందులో ప్రధానంగా మామిడి పంట పండిస్తున్నారు, రైతులకు మామిడి ధర వస్తేనే సంతోషంగా ఉంటారు, ప్రస్తుతం తోతాపురి రకం మామిడి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పండిస్తున్నారు, కానీ జ్యూస్ ఫ్యాక్టరీలు మాత్రం కొనుగోలు చేయడం లేదు, గతంలో జగన్ గారు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వమే ఫ్యాక్టరీలతో కొనుగోలు చేయించింది, కానీ ఈ ఏడాది ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు, ప్రతి ఫ్యాక్టరీ దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధర అందిందా లేదా అనేది ప్రభుత్వమే ఒక టీమ్ ఏర్పాటు చేసి పరిశీలించాలి, తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటన కేవలం మాటలకే పరిమితమైందన్నారు.