న్యూఢిల్లీ: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కేంద్రం దాటవచ్చు..రాష్ట్రాలు దాటకూడదా అని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా అని నిలదీశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కేంద్రానికైనా..రాష్ట్రానికైనా ఒక్కటే అన్నారు. ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 2022–2023 ఆర్థిక బడ్జెట్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ తర్వాత పార్టీ ఎంపీలతో కలిసి ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీ వి.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..: రాష్ట్రాలకు ప్రయోజనకారి కాదు: ఈ బడ్జెట్ చివరకు ఎలా తయారైందంటే, చూడడానికి చాలా స్టైల్‌గా, కానీ వాస్తవానికి ఏమీ లేకుండా ఉంది. ఆర్థిక మంత్రి సబ్‌కా వికాస్ అని చెప్పినా, నిజానికి రాష్ట్రాల ప్రయోజనకారిగా లేదని చెప్పాలి. దాదాపు రూ.40 లక్షల కోట్ల బడ్జెట్, గత ఏడాది కంటే 4.6 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. బడ్జెట్ పెరగడం అభినందనీయమైనా, వృద్ధి రేటు చూస్తే.. 2021–22లో 9.2 శాతంగా బడ్జెట్‌లో చూపారు. కరోనా సమయంలో అంత సాధించడం ప్రశంసనీయం. ద్రవ్యలోటు చూస్తే, 6.9 శాతం నుంచి 6.4 శాతం వరకు తగ్గినట్లు బడ్జెట్‌లో చూపారు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 3 శాతం వరకు ద్రవ్యలోటు కనిపిస్తోంది. నాటి రుణాలకు ఇప్పుడు పరిమితా?: జ.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని 3 శాతంగా నిర్ధారించినా, దాని కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. ఆ మేరకు ఆ మొత్తాన్ని ఇప్పుడు మనకు నిర్థారించిన రుణ సేకరణలో తగ్గించే ప్రయత్నం జరగ్గా, వెంటనే ప్రధానిగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఆ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. ద్రవ్యలోటు ఎలా ఉందంటే?: ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. 2020–21లో కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యలోటు 9.3 శాతం కాగా, ఆ మరుసటి ఏడాది 2021–22 బడ్జెట్‌లో అది 6.9 శాతం నమోదవ్వగా, ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 6.4 శాతం ద్రవ్యలోటును అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2020–21లో ద్రవ్యలోటు 5.38 శాతం కాగా, ఆ తర్వాత ఏడాది అంటే 2021–22లో ద్రవ్యలోటు 3.49 శాతం. ఎఫ్‌ఆర్‌బీఎం–ద్వంద్వ ప్రమాణాలు: ఎఫ్‌ఆర్‌బీఎం అనేది కేంద్రం, రాష్ట్రాలకు ఒక్కటే. కానీ ఇక్కడ కేంద్రం ఆ పరిధి దాటొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాటొద్దు అంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఇది అభ్యంతరకరం. క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్: ఇక దాదాపు రూ.40 లక్షల కోట్ల బడ్జెట్‌లో, గత ఏడాది కంటే ఈసారి దాదాపు 35 శాతం ఎక్కువ మొత్తాన్ని మూలధన వ్యయంగా చూపారు. ఇది మంచి పరిణామం. ఈసారి ప్రతిపాదించిన మొత్తం మూలధన వ్యయం రూ.7.5 లక్షల కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్‌లో 20 శాతం. అలాగే జీడీపీలో 2.9 శాతం. ఇది రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు, మూలధన వ్యయంతో సహా చూస్తే, ఆ మొత్తం రూ.10.68 లక్షల కోట్లు. అది జీడీపీలో 4.1 శాతం. రాష్ట్ర వాటా పెంచాలి: మూలధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రిగారు చెప్పారు. ఇది స్వాగతించదగిన విషయమే అయినా, కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమే. ఇప్పుడు ఇస్తామన్న లక్ష కోట్లులో అదే ఫార్ములాను పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్రానికి వచ్చేది కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే. కేంద్ర పన్నుల్లో ఇతర రాష్ట్రాలను చూస్తే.. మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్‌కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా ఈ నిధుల్లో అన్యాయం జరుగుతోంది. సరైన న్యాయం జరగడం లేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాలో గత ఏడాది చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కు రూ.35 వేల కోట్లు రాగా, యూపీకి రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చారు. అంత తేడా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ వ్యయం తిరిగి ఇవ్వాలి: ఇక గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదుల అనుసంధానం నిర్ణయం అభినందనీయం. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసింది. మరోవైపు కృష్ణా–పెన్నా అనుసంధానంలో కూడా కొంత పని జరిగింది. కాబట్టి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పథకం టీడీపీకి ప్రయోజనం: నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇది కూడా మంచి నిర్ణయం. దీని వల్ల ప్రయోజనం పొందేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో చాలా మందికి మెంటల్ సమస్యలు వచ్చాయి. కాబట్టి దాన్ని వారు వినియోగించుకోవాలి. ఇది అభినందనీయం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్)లో అదనంగా 4 శాతం, అంటే 14 శాతం వరకు పన్ను రాయితీ ఇచ్చారు. ఇది కూడా అభినందనీయం. ఈ ప్రాజెక్టులు ఆమోదించాలి: రూ.20 వేల కోట్లు పీఎం గతి శక్తి పథకంలో మౌలిక వసతుల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు ముఖ్య ప్రాజెక్టులు కోరుతోంది. వాటిని పథకంలో ఆమోదించాలని కోరుతున్నాం. ఇవీ ఆ ప్రాజెక్టులు. 1. తూర్పు తీరం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. అంటే ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు. 2. అలాగే రాష్ట్రంలోని అన్ని పోర్టులను కలుపుతూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. 3. బోగాపురం జాతీయ రహదారిని వేగంగా పూర్తి చేయాలి. ఆరోగ్య రంగం–ఆర్ అండ్ డీ: ఆరోగ్య రందానికి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టలేదు. ఆర్ అండ్ డీ ప్రస్తావన అసలే రాకపోవడం చింతించే విషయం. ఫార్మా రంగంలో గత ఏడాది చైనా నుంచి దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఫార్మా రంగంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య బీమా: ఇంకా మధ్య తరగతి వర్గాలవారికి ఆరోగ్యబీమా అందడం లేదు. దేశంలో వారు 56 శాతం ఉండగా, కేవలం 40 శాతం వరకే ఆరోగ్య బీమా అందుతోంది. కాబట్టి మిగిలిన 60 శాతం ప్రజల్లో కొందరు ధనికులను వదిలేస్తే, కనీసం 56 శాతం మందికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి. కాబట్టి పీఎం జన ఆరోగ్య యోజన కింద వారికి ఆ సదుపాయం అందించాలి. కానీ ఈ బడ్జెట్‌లో అలాంటి ప్రస్తావన లేదు. వీటి ప్రస్తావన లేదు: నరేగాలో కవరేజ్ ఏ మాత్రం పెంచలేదు. కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఏ ప్రకటనా లేదు. పీఎం కిసాన్ పథకంలో భూమిలేని రైతులను పూర్తిగా వదిలేశారు. కాబట్టి వారికి ఒక పథకం వర్తింపచేయాలి. కనీస మద్దతు ధరకు చటబద్దత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. ఏదో ఉన్నా అది క్లియర్‌గా లేదు. కాబట్టి వెంటనే దాన్ని రూపొందించాలి. మరో 5 ఏళ్లు ఇవ్వాలి: జీఎస్టీకి సంబంధించి కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారు. సేవా రంగం మినహా అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని, జీఎస్టీ వల్ల రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా వస్తోందని చెప్పారు. అయితే జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గినందువల్ల మరో 5 ఏళ్లు రాష్ట్రాల వాటా పొడిగించాలని విజ్ఞప్తి చేసినా, ఇవాళ ఏ ప్రస్తావన లేదు. నిరుత్సాహపర్చింది: బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపర్చింది. సీఎంగారు ప్రధానమంత్రికి నివేదించిన 10 అంశాలను కమిటీ ముందుంచాము. వాటి మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ప్రైవేటీకరణ వద్దే వద్దు: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మవద్దని పదే పదే చెబుతున్నాం. ఎల్‌ఐసీ, హెచ్‌పీసీఎల్ వంటి లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు కంపెనీ కూడా లాభాల్లో ఉంది కాబట్టి, అమ్మవద్దని కోరుతున్నాం. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలులో ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని..పోలవరం ప్రాజెక్టు.. ఇంకా 13వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. వాటికి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే రాష్ట్రంలో సచివాలయాల్లో మొదలు పెట్టాం. ఇక స్టాంప్ డ్యూటీకి సంబంధించి దేశమంతా ఒకే విధానం ఉండాలన్న అంశానికి సంబంధించి, కేంద్రం ప్రతిపాదించినప్పుడు స్పందిస్తామంటూ శ్రీ వి.విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ ముగించారు.