వీధి వర్తకుల రుణాన్ని 20 వేలకు పెంచుతారా?

రాజ్యసభలో మంత్రిని ప్రశ్నించిన ఎంపీ విజయసాయి రెడ్డి
 

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి స్వానిధి పథకం కింద వీధి వర్తకులు, చిల్లర వ్యాపారులకు ప్రస్తుతం ఇస్తున్న 10 వేల రూపాయల పెట్టుబడి రుణాన్ని 20 వేల రూపాయలకు పెంచే ప్రతిపాదన ఏదైనా ఉందా అని వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిని ప్రశ్నించారు. రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పీఎం స్వానిధి పథకం కింద ప్రస్తుతం మంజూరు చేస్తున్న 10 వేల రూపాయల పెట్టుబడి రుణాన్ని 20 వేల రూపాయలకు పెంచడం వలన వీధి వర్తకులు, చిల్లర వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకుని మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. తద్వారా దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) పెరుగుదలకు వారు దోహద పడతారు. కాబట్టి వారికిచ్చే పెట్టుబడి రుణాన్ని 20 వేల రూపాయలకు పెంచే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు. వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులను సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేస్తూ దేశ జీడీపీలో వారి వాటాను కచ్చితంగా ఆవిష్కరించే దిశగా పీఎం స్వానిధి పథకాన్ని ప్రభుత్వం వినియోగించుకుంటుందా అని కూడా ప్రశ్నించారు.
 విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నుకు మంత్రి జావబిస్తూ పీఎం స్వానిధి పథకం కింద అర్హులైన వీధి వ్యాపారులందరికీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారినపడి ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులు, చిల్లర వర్తకుల ఉపాధికి భద్రత కల్పించే లక్ష్యంతో 2020లో ప్రారంభించిన పీఎం స్వానిధి పథకం కింద దేశంలో ఇప్పటికే 32 లక్షల మంది వీధి వ్యాపారులకు 3648 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. వడ్డీ వ్యాపారుల కోరల నుంచి వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులకు విముక్తి కల్పించడం కూడా పథకం లక్ష్యాలలో ఒకటి. వీధి వ్యాపారుల చట్టం కింద పట్టణ వీధి వ్యాపారులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 
 పీఎం స్వానిధి కింద రుణాల కోసం దరఖాస్తున్న చేసుకున్న వీధి వ్యాపారుల్లో 25 శాతం మందికి రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకు  అధికారులు తిరస్కరించారని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళతో కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కవగానే ఉంటుందన్న  విజయసాయి రెడ్డి మాటను మంత్రి అంగీకరిస్తూ ఇది కేంద్ర పరిధిలోని అంశం కాదని అన్నారు. రుణాల మంజూరుపై ఆయా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. సంబంధిత శాఖల మంత్రులు ఈ విషయమై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. గతంలో రుణాలు మంజూరు చేసేందుకు కట్ ఆఫ్ తేదీ ఉండేది. ఇప్పుడు అది లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  రుణాలు మంజూరు చేసి వీధి వ్యాపారులను అనధికార అర్థిక వ్యవస్థ నుండి సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చి జీడీపీతో జోడించడం జరుగుతుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top