ప్రొఫెసర్ పోస్టుల్లో రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగ విరుద్ధం 

యుజిసి మార్గదర్శకాలను ఉపసంహరించాలి

ప్రభుత్వానికి ఎంపీవిజయసాయి రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్టి, ఓబిసిలకు కేటాయించిన రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) జారీ చేసిన మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు రిజర్వ్‌ చేసిన ఖాళీలు భర్తీకాని పక్షంలో వాటిని జనరల్‌ కేటగిరీకి మార్చాలని ప్రతిపాదిస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇది ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసిలకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కాలరాసే చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి అధ్యాపకుల సంఖ్య ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. గత ఏడాది ఆగస్టులో లోక్‌ సభకు సమర్పించిన సమాచారం ప్రకారం దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్శిటీలలో కలిపి ప్రొఫెసర్లలో 4 శాతం, అసిస్టెంట్‌ ప్రాఫెసర్లలో 6 శాతం మాత్రమే ఒబిసి అభ్యర్ధులు ఉన్నారు. ఎస్సి అభ్యర్ధులు 7 శాతం ఉండగా ఎస్టి అభ్యర్ధులు కేవలం 1.5 శాతం మాత్రమే ఉన్నట్లు శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి అధ్యాపకుల సంఖ్య ఇంత తక్కువగా ఉన్నప్పటికీ ఆ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ యుజిసి మార్గదర్శకాలు జారీ చేయడం అత్యంత దురదృష్టకరం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాలయాల అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు రిజర్వ్‌ చేసిన ఖాళీలను ఎట్టి పరిస్థితులలోను తు.చ తప్పకుండా అమలు చేయవలసిందేనని 2006లో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను శ్రీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. అలాగే టీచర్‌ క్యాడర్‌ నియామకాలకు సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు రిజర్వ్‌ చేసిన పోస్టులను డి-రిజర్వ్‌ చేయడాన్ని సెంట్రల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ చట్టం 2019 నిరోధిస్తుంది. వీటిని అతిక్రమిస్తూ యుజిసి తాజాగా మార్గదర్శకాలు జారీ చేయడం శోచనీయమని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు కేటాయించిన ఫ్యాకల్టీ ఖాళీలను జనరల్‌ కేటగిరీ అభ్యర్ధులతో భర్తి చేయడం నిషేధం. యూనివర్శిటీలలో ఆయా వర్గాలకు రిజర్వ్‌ చేసిన ఖాళీలు భర్తీకాని పక్షంలో ఆ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధులు దొరికేవరకు ప్రకటనలు జారీ చేయడం, అవసరమైతే స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహించడం ఆయా విద్యా సంస్థల బాధ్యత. దశాబ్దాలుగా విద్యావకాశాల విషయంలో తీవ్రంగా నష్టపోయిన ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సరి చేయడం దీని లక్ష్యం అని  విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అందువలన యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) జారీ చేసిన తాజా ముసాయిదా మార్గదర్శకాలు అమలు చేయడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడకుండా నిరోధించవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తూ యుజిసి జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేసి ఆయా వర్గాలకు రిజర్వ్‌ చేసిన అధ్యాపక పోస్టులలో నియామకాలను త్వరితగతిన భర్తీని చేపట్టాలి. తద్వారా వెనుకబడిన వర్గాలు  విద్యాపరంగా సాధికారత సాధించడానికి కృషి చేసినట్లవుతుందని శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
 
ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించరు: రాజ్యసభ చర్చలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన విజయసాయి రెడ్డి

స్వార్ధ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ విభజనకు పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏనాటికీ క్షమించబోరని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ వి.విజయసాయి రెడ్డి  విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఘోర తప్పిదమే కారణం అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందుపరచి పార్లమెంట్‌ ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు హోదా చట్టబద్దంగా లభించి ఉండేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రణాళికా సంఘానికి పంపించడం వలనే హోదా అంశం చట్టబద్దతను కోల్పోయిందని శ్రీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున, పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి తరఫున రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటిస్తూ  విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్‌ దుష్పపరిపాలనతో పోల్చుకుంటే భారత్‌ సాధించిన గణనీయమైన ప్రగతి రాష్ట్రపతి ప్రసంగంలో  చెప్పుకోదగ్గ విశేషంగా ఆయన అభివర్ణించారు. చరిత్రకు సైతం గంతలు కట్టి దశాబ్దాల తమ పాలన ఎంత గొప్పదో చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ తాపత్రయపడుతుంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్‌ దేశ ప్రజలను వంచించలేదు. కాంగ్రెస్‌ దుష్పరిపాలనకు అతి పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. హేతుబద్దత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఆగమేఘాలపై లోక్ సభలో విభజన బిల్లు...
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ స్వార్ధంతో ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఏ విధంగా పార్లమెంట్‌ ముందుకు తీసుకువచ్చి అంత అప్రజాస్వామికంగా దానికి ఆమోదం పొందిందో శ్రీ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా రాజ్యసభలో వివరించారు. 2014 ఫిబ్రవరి 18న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సభ్యులే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా నీళ్ళు, విద్యుత్‌ పంపిణీ, రెవెన్యూ పంపిణీ, రాజధాని హైదరాబాద్‌ వంటి ప్రధాన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా బిల్లులో సవరణలు చేపట్టాలని ఏపీకి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు. కానీ ఈ సమస్యలపై వారి భయాలు, ఆందోళనలను తొలగించేలా బిల్లులో సవరణలు చేయడానికి బదులుగా బిల్లుకు ఆమోదం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగింది. లోక్‌ సభ ద్వారాలు మూసేశారు. గ్యాలరీలను ఖాళీ చేయించారు. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయకుండా లైవ్‌ టెలికాస్ట్‌ను సైతం నిలిపేసి విభజన బిల్లును లోక్‌ సభలో పాస్‌ చేశారని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పెట్టిన అనేక షరతులను సైతం లెక్క చేయకుండా పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి కేవలం గంటన్నర వ్యవధి చర్చలోనే లోక్‌ సభలో విభజన బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ పార్టీ నికృష్ట చేష్టలకు పాల్పడిందని ఆయన విమర్శించారు.

హోదాను బిల్లులో ఎందుకు చేర్చలేదు...
లోక్‌సభ ఆమోదం పొందిన విభజన బిల్లు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభకు చేరింది. బిల్లులో పేర్కొన్న అంశాల ఆధారంగా విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన రాజ్యసభ సభ్యులు విభజన అనంతరం ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని సభలో గట్టిగా పట్టుబట్టారు. నాడు బీజేపి సభా నాయకుడి స్థానంలో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి కూడా ఆంధ్రప్రదేశ్‌కు కనీసం పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని సభలో డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన నాటి ప్రధానమంత్రి డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లుగా రాజ్యసభలో ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదాపై ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని చట్టబద్దం చేసేందుకు వీలు కలిగిస్తూ విభజన బిల్లుకు తగిన సవరణలు చేసి మళ్ళీ లోక్‌సభ ఆమోదం కోసం పంపించాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆ పని చేయలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా హామీ కేవలం కంటి తడుపు చర్యగా మాత్రమే కాంగ్రెస్‌ పరిగణించిందని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చ లేదు. బిల్లులో చేర్చి ఉంటే చట్టపరంగా దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైన, అప్పటి ప్రభుత్వంపైన ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చందుకు చట్టపరంగా చర్యలు తీసుకుని ఉండేది. విభజన చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఆ తర్వాత చట్టం అమలులో రావడానికి మూడు నెలల సుదీర్ఘ విరామం లభించింది. అప్పటికి కూడా ప్రత్యేక హోదాపై మంత్రివర్గంలో తీర్మానం చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ సాచివేత ధోరణిని అనుసరించింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్‌ పార్టీకి కేవలం ఒక ఎన్నికల అంశంగా మాత్రమే కనిపించింది తప్ప చిత్తశుద్ధి చూపలేదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌కు ఎన్నికల అంశం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రం ప్రత్యేక హోదా అనేది వారి మనోభావాలకు సంబంధించిన అంశం. హోదా విషయంలో కాంగ్రెస్‌ కపట నాటకం ఆడి ఈరోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నిందిస్తోందని  విజయసాయి రెడ్డి అన్నారు. హోదా విషయంలో అసలు దోషి కాంగ్రెస్‌ పార్టీనే. కానీ ఈరోజున ఎవరో మాణిక్యం టాగూర్‌ అనే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పొద్దుట నిద్ర లేచిన దగ్గర నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

హోదా కోసం ప్రధానమంత్రికి పదేపదే విజ్ఞప్తి...
వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేశారు. అలాగే హోం మంత్రిని కలిసిన పన్నెండుసార్లు ఆయన వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇక అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు లెక్కలేనన్ని సార్లు ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వాన్నికోరుతూనే ఉన్నారని శ్రీ విజయసాయి రెడ్డి వివరించారు.

రాజకీయ దురుద్దేశాలతోనే హడావిడిగా విభజన...
విభజన జరిగే నాటికి కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ళుగా అధికారంలో ఉంది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. విభజనపై పదేళ్ళపాటు కాంగ్రెస్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చుంది. విభజనపై చిత్తశుద్ధి ఉంటే  రెండవ రాష్ట్రాల పునర్వవ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్దంగా రాష్ట్రాన్ని విభజించి ఉండేదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. కానీ పదేళ్ళపాటు నిద్రపోయిన కాంగ్రెస్‌ పార్టీ విభజన ద్వారా తెలంగాణలో రాజకీయ లబ్ది పొందాలన్న దుష్ట చింతనతో 2014 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి కేవలం పది రోజుల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అడ్డదారిని ఎంచుకున్నదని ఆయన విమర్శించారు. అంటే విభజన ద్వారా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ కోరుకోలేదు. సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో లబ్ది పొందాలన్న అవకాశవాద రాజకీయానికే ఆ పార్టీ పాల్పడిందని ఆయన అన్నారు. దేశంలో అంతకు ముందు కాంగ్రేసతర పార్టీల సారధ్యంలో జరిగిన రాష్ట్రాల విభజన అత్యంత సాఫీగా, శాస్త్రీయంగా జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. విభజన బిల్లుపై రాష్ట్ర స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైంది. విభజనపై నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ఒప్పించడంలో ఆ పార్టీ విఫలమై విభజనకు అడ్డదారిని ఎంచుకుందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ను ఆంధ్ర ప్రజలు భూస్థాపితం చేశారు...
ఇంత మోసం, దగా, ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జీవితంలో ఇక నమ్మలేరు. ఆ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ వి.విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నుకున్న ఎంపీల కారణంగానే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టగలిగింది. 2014 నుంచి కాంగ్రెస్‌ పతనం మొదలైంది. 2014లో 44, 2019లో 52 ఎంపీలను గెలుచుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 40 సీట్లు గెలవడం కూడా కష్టమేనని ఆ పార్టీ భాగస్వామి వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ దుస్థితిని సూచిస్తోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. 2029 నాటికి భారత్‌కు కాంగ్రెస్‌ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

విశాఖ ఉక్కు అమ్మకానికి ఈవోఐ జారీ చేయలేదు: రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

 విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ అల్లాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్‌ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సిపి సభ్యులు వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖ ఉక్కు విక్రయానికి ఈవోఐ జారీ చేయలేదని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు, నాన్‌-కోర్‌ అసెట్స్‌, మైన్స్‌, అనుబంధ పరిశ్రమలు, యూనిట్లు, జాయింట్‌ వెంచర్లలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా వంటి అంశాలు పరిగణలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. సేలం స్టీల్‌, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణపై బిడ్డర్లు ఆసక్తి చూపనందునే ఆయా స్టీల్‌ ప్లాంట్‌ల విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఏపీలో 32754 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదేళ్లలో 32754 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఏపీలో 2018-19లో 6933 టన్నులు, 2019-20లో 6539 టన్నులు, 2020-21లో 5898 టన్నులు, 2021-22లో 7096 టన్నులు, 2022-23లో 6288 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 5,71,093 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగినట్లు మంత్రి తెలిపారు.
ముడి ఇనుము ఉత్పత్తిలో 2014లో నాల్గవ స్థానంలో ఉన్న ఇండియా 2018లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. ఇండియా 2018లో 109.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండవ స్థానానికి చేరుకోగా, జపాన్ 104.3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తిచేసి 3వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఇండియా ఐదేళ్లలో ఇనుము ఉత్తత్తిలో  55.7% వృద్ధి సాధించిందని, 2013-14 లో 81.69 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా 2022-23 లో 127.20 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేసిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా స్టీల్ ఉత్పత్తిలో ఇండియా 5% సీఐజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించిందని మంత్రి వెల్లడించారు. స్టీల్ క్రమబద్దీకరించిన రంగం కావడంతో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందని,  జాతీయ స్టీల్ పాలసీ 2017 కింద ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి పలు చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.

తాడేపల్లిగూడెంలో 71.24 కోట్లతో అమృత్ పనులు
ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద 71.24కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావచ్చని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పట్టణంలో పార్కులు అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు, నీటి సరఫరాకు 3 ప్రాజెక్టులు, సీవేజ్, సెప్టేజ్ నిర్వహణకు 2 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్క్‌ల అభివృద్ధికి కేటాయించిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు పూర్తికాగా మరో ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్ట్ ఖరారైనట్లు తెలిపారు అలాగే నీటి సరఫరాకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు పూర్తికాగా మిగిలిన రెండు ప్రాజెక్టులకు కాంట్రాక్ట్ ఖరారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు భూసేకరణలో జాప్యం, కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు

Back to Top