ఆడపడుచుల అభ్యున్నతే లక్ష్యం

వైయ‌స్ఆర్ ఆస‌రా కార్య‌క్ర‌మంలో ఎంపీ డాక్ట‌ర్ తలారి రంగయ్య 

అనంత‌పురం:   ఆడ‌ప‌డుచుల అభ్యున్న‌తే ల‌క్ష్యంగా అనంత‌పురం ఎంపీ డాక్ట‌ర్ త‌లారి రంగ‌య్య అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైయ‌స్ఆర్ ఆసరా నాలుగవ విడత సంబరాల కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త  డాక్ట‌ర్ తలారి రంగయ్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రంగ‌య్య మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆసరా పథకం కింద ఇప్పటి వరకు నాలుగు విడతల్లో డ‌బ్బులు అందించామని వివరించారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకే జగనన్న మార్ట్‌లు, ఈ–మార్ట్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యాపార రంగంలో సైతం ఆడపడుచులు ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. నవరత్న పథకాల కింద ప్రజలకు రూ.కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేశామని వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీని గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.  

Back to Top