ఏకగ్రీవాలు కావొద్దనటానికి నిమ్మగడ్డ ఎవరు?

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌

రూల్స్‌ను అతిక్రమించే వ్యక్తిని చంద్రబాబు ఎస్‌ఈసీగా పెట్టారు

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు నిమ్మగడ్డ, బాబు ప్రయత్నం

 చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా టీడీపీ మేనిఫెస్టో రద్దు అంటే అర్థం ఏమిటి?

వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు చూసి..అప్పట్లో ఓటు వేయని వారు ఇప్పుడు వేస్తున్నారు

తాడేపల్లి:  పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావొద్దనటానికి నిమ్మగడ్డ రమేష్‌  కుమార్‌ ఎవరని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగిరమేష్‌ ప్రశ్నించారు. గ్రామాల్లో కక్షలు, గొడవలు ఉండకూడదని అక్కడి ప్రజలంతా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంటే నిమ్మగడ్డకు వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. ప్రాథమిక సూత్రాలు తెలియని వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా ఎలా నియమించారని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కలెక్టర్లను ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఆదేశించడాన్ని జోగి రమేష్‌ తప్పుపట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్‌ తీరును ఆయన ఎండగట్టారు.

ప్రజల అధికారాన్ని కాలరాయడానికి నిమ్మగడ్డ ఎవరు?

ఎన్నో ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల సంస్కృతి కొనసాగుతుందని, ప్రజల అధికారాన్ని కాలరాయడానికి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎవరని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కానీ, సర్పంచ్‌లను ఎన్నకోకూడదా అని నిలదీశారు. ఏకగ్రీవాలన్నవి 30 ఏళ్లుగా కొనసాగుతున్న తంతు అని గుర్తు చేశారు.  గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటారని చెప్పారు. ఏకగ్రీవాలను నిలుపుదల చేయాలనే హక్కు నిమ్మగడ్డకు ఎక్కడిదన్నారు. ఏకగ్రీవాలు తప్పు అని కోర్టు కెళ్లి ఆర్డర్‌ తీసుకువస్తారా అని ప్రశ్నించారు. రూల్స్‌ను అతిక్రమించే వ్యక్తిని చంద్రబాబు తన హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నియమించారని తప్పుపట్టారు. ఏకగ్రీవాలు కావొద్దనటానికి నిమ్మగడ్డ ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబుది చిత్తూరు జిల్లా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ది గుంటూరు జిల్లా కావడం, ఆ రెండు జిల్లాలో ఏకగ్రీవాలు ఎక్కువ కావడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని ఓటు హక్కును ఏపీలోకి ఎలా మార్చుకోగలరని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ హైదరాబాద్‌లో ఉండి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని, ఆయనపై చర్యలు తీసుకోమని ఎన్నికల కమిషనర్‌ను కోరితే..ఆయన ఎలాంటి ^è ర్యలు తీసుకోలేదన్నారు. పైగా టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేయని వారు ఇప్పుడు  సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఓట్లు వేస్తున్నారని, 90 శాతం వైయస్‌ఆర్‌సీపీ బలపరచిన వ్యక్తులను సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌ ప్రయత్నిస్తున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. 
 

Back to Top