ప్రకాశం జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాట తప్పిన నాయకులు మీ వద్దకు వస్తే నిలదీయాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నైజమని అన్నారు. ఎర్రగొండపాలెంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైయస్ జగన్ అర్హులందరికీ అన్నీ పథకాలు అందిస్తే...ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైయస్ఆర్‌సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు. వైయస్ఆర్ , వైయస్ జగన్‌లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మఒడి, నాడు–నేడు, కార్పొరేట్ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు. మహిళలకు మొండిచేయి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ.. చంద్రబాబు తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పథకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తే ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. పిఠాపురం పీఠాధిపతి పవన్ తన సొంత జిల్లాలో మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడరు కానీ పక్క రాష్ట్రాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తా, నారతీస్తా అంటారని అన్నారు. సకల శాఖా మంత్రి లోకేష్ జగన్న పథకాలు అన్నీ తానే సృష్టించానని ప్రచారం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రి బొద్దింక అని చెప్పి తెల్లవారు జామున వెంట్రుక అని చెప్పే మహిళా హోంమంత్రి కూటమి పాలనలో ప్రతి గంటకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడలేదని మండిపడ్డారు. జీవితాంతం జగనన్నతోనే పయనం పొదిలి పర్యటనలో టీడీపీ వాళ్లు తప్పులు చేస్తే దాచి పెట్టి అమాయకులను జైల్లో పెట్టారని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. సెంటర్లో బ్యానర్లు వేస్తామంటే అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గుడివాడలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్ పై దాడి చేస్తే మహిళా హోం మంత్రి అయి బాధితురాలిపైనే కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ మార్కాపురంలో నిర్వహించిన సభలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వంలో ఉంటామని చెప్పడమే జగనన్న అంటే వాళ్లకు పట్టుకున్న భయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమికి దడపట్టుకుందని చెప్పారు. మద్యం, ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జెండాలు, ఫ్లెక్సీలు కట్టనీయడం లేదని కనీసం కార్యక్రమాలకు కళ్యాణ మండపాలు కూడా ఇవ్వకుండా ఆపితే కార్యక్రమాలు ఆగిపోవని, అంతకు రెట్టింపు ఉత్సాహంతో భారీగా కార్యకర్తలు హాజరయ్యారన్నారు. క్యూఆర్ కోడ్‌ను ప్రతి ఇంటికి చేర్చి చంద్రబాబు ఇచ్చిన హామీలు– చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతుల కోసం వచ్చిన జగనన్నను కలవడానికి వస్తే 40 మంది పై కేసులు పెట్టారన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని స్పష్టం చేశారు.