'జగనన్న సురక్ష' పేదలందరికీ రక్ష...

 అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యం

 జగనన్న సురక్షను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్షాల కుట్రలు

చంద్రబాబు పేదల కోసం ఏనాడైనా ఆలోచించాడా ? 

 రూ.2 కే కిలో బియ్యంను రూ. 5.25 చేసిన ఘనత చంద్రబాబు ది

టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు

మినీ మ్యానిఫెస్టో పేరుతో కపట హామీలు

గతంలో ఎన్నడూ లేని విధంగా అనంత లో అభివృద్ధి పనులు

ప్రధాన రహదారులతో పాటు వీధుల్లోనూ సీసీ రోడ్లు,డ్రైనేజ్ నిర్మాణం పనులు

 అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టికరణ.

అనంతపురం  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలందరికీ రక్ష అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం అసెంబ్లి నియోజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయితీ పరిధిలోని సచివాలయం 1 లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లతో 'జగనన్న సురక్ష' పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపామని, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం 'జగనన్న సురక్ష' చేపడుతున్నామనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  లక్ష్యమని స్పష్టం చేశారు. 

నెల రోజల పాటు చేపట్టనున్న 'జగనన్న సురక్ష' కార్యక్రమం ద్వారా జనన, మరణ, వివాహ, కుల, ఆదాయం వంటి వివిధ రకాలైన 11 సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవలు ఎక్కడా అందించలేదని, ఒక్క ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం ఇంతలా ఆలోచిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కి మంచి పేరు వస్తే తమ రాజకీయ మనుగడ లేకుండా పోతుందోనన్న అక్కసుతో ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.

 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేశా అని చెప్పుకునే చంద్రబాబు పేదల కోసం ఏనాడైనా ఆలోచించాడా ? పేదల కోసం ఏ ఒక్క పథకమైన ప్రవేశ పెట్టాడా అని ప్రశ్నించారు. వైయస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల చెంతకే పథకాలను ఇస్తుంటే, ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారన్న మీరు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు యాత్రలను చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూ.2 కే కిలో బియ్యం ను ఇస్తే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5.25 చేసిన ఘనుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. 

మినీ మ్యానిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, టీడీపీ మోసపూరిత హామీలను ఎవ్వరు నమ్మేపరిస్థితిలో లేరని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో అనంతపురంలో ఏం అభివృద్ధి చేసింది లేదని, టీడీపీ ఐదేళ్ల  పాలనలో కమీషన్ల కోసం ఆధిపత్యం కోసం కొట్లాడుకోవడమే  సరిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుండి అనంతపురంలో అభివృద్ధి పరుగులు పెడుతొందని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన రహదారులు నిర్మాణం పనులు పూర్తి అయ్యాయని,అంతర్గత వీధులలో బీటీ రోడ్లు,సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నగరానికి దీటుగా పంచాయితీలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

జేసీఎస్ కన్వీనర్ ఆలుమూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 'జగనన్న సురక్ష' ను సద్వినియోగం చేసుకుని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ సుగాలి పద్మావతి, వైస్ ఎంపీపీ బాలాజీ, ఎంపీటీసీలు ఓం ప్రకాష్ రెడ్డి, నారాయణమ్మ, మహబూబ్ బీ, వైయస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, స్థానిక నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నవీన్, సాదిక్, తిరుపతినాయుడు, వెంకటేష్ నాయక్, బెస్త నాగరాజు, పురుషోత్తం, విజయ్ కుమార్, పద్మావతి, రామమూర్తి, రాజు నాయక్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top