అనంతపురం : చంద్రబాబు మాదిరి కపట హామీలను చెప్పి మభ్యపెట్టడం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలియదని, చెప్పిందే చేయడం.. చేసేదే చెప్పడం ముఖ్యమంత్రి నైజం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్యంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎలా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలో ఆలోచిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసినా ప్రజల కోసం చేసింది ఎం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు చెప్పడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో 600 హామీలను చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోగా మ్యానిఫెస్టోనే లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రూ.750 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పనులు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం తో పాటు అభివృద్ధి కి పెద్దపీట వేశారన్నారు. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా రూ. 750 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పనులను చేపట్టాం అని స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న సందుల్లో సైతం సీసీ రోడ్లు, డ్రైనేజ్ లను అభివృద్ధి చేశామన్నారు. అంతేకాకుండా నాడు నేడు పథకం ద్వారా రూ.300 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. డంప్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం.. డంప్ యార్డ్ లోని వ్యర్థాన్ని తొలగించడం అసాధ్యం కనుక బయోమైనింగ్ ప్లాంట్ ద్వారా వ్యర్థాన్ని రీసైక్లింగ్ పద్దతి ద్వారా పరిష్కరించబడుతున్నదన్నారు. ఇప్పటికే బయోమైనింగ్ ప్లాంట్ ద్వారా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని తొలగించాం, త్వరలోనే మరోమారు పనులను చేపడుతామని స్పష్టం చేశారు. కలహాలకు, కమిషన్లకే పరిమితమైన టిడిపి నాయకులు. 2014౼19 వరుకు టీడీపీ అధికారంలో ఉన్నా అనంతపురం నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రశాంతతకు నిలయమైన అనంతపురం నగరాన్ని కలహాలకి నిలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ ఆధిపత్యంతో అభివృద్ధి ని నాశనం చేసారని విమర్శించారు. 2019 ఎన్నికల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలహాలకు తావులేకుండా నగర అభివృద్దే ధ్యేయంగా సమిష్టి గా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని హామీలను అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రలేఖ, ఎస్సిసెల్ నగర అధ్యక్షుడు సాకే కుళ్ళాయి స్వామి, సచివాలయ కన్వీర్లు శోభన్, సురేష్, నాయకులు ముత్యాలప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు.