తాడేపల్లి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాస్తే..ఓ వర్గం మీడియా ఆ వార్తను ప్రచురించకుండా నొక్కి పెట్టిందని, అలాంటి పత్రికలను రాష్ట్ర ప్రజలు ఎందుకు చదవాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో పేపర్లు అమ్ముకుంటున్నారని, సుప్రీం కోర్టు జడ్జిపై ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైయస్ జగన్ లేఖ రాస్తే దాన్ని ప్రచురించకుండా ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఇది పత్రికా స్వేచ్ఛ అవుతుందా? సుప్రీం కోర్టుకు సంబంధించిన ఒక జస్టిస్‌పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో కూడిన ఓ లేఖను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు రాస్తే..దాన్ని ప్రచురించకపోవడం ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవుతుందా అని ప్రశ్నించారు. లేదా పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించినట్లు అవుతుందా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి. జాతీయ పత్రికలన్నీ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచురించాయి. ప్రసారం చేశాయని తెలిపారు. కానీ మన రాష్ట్రంలోని తెలుగు చానల్స్ మాత్రం ప్రసారం చేయడం మానేశాయి. జాతీయ పత్రికలు అనుకూలంగానో, వ్యతిరేకంగానో వార్తలు రాశాయని తెలిపారు. చాలా చానల్స్ కూడా ప్రసారం చేశాయని చెప్పారు. ఇంత ప్రాధాన్యత ఉన్న వార్తను ఎందుకు నొక్కి పెట్టారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంలో హర్షించాల్సిన విషయమా? దీని వెనుక ఎవరు ఉన్నారని నిలదీశారు. రామోజీ రావు పత్రికను నా ప్రెస్ మీట్‌ను వేయకపోవచ్చు కానీ, ఒక ముఖ్యమంత్రి సీజేఐకి ఒక జడ్జిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు రాయడం లేదని, దీని వెనుక ఏం కుట్ర ఉందని ప్రశ్నించారు. ఆ కుట్రలో ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాలు భాగస్వామ్యం ఎందుకు అవుతున్నారని నిలదీశారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు చంద్రబాబును కాపాడాలని ఎంత తాపత్రయ పడ్డ..ఆరచేతితో సూర్యుడిని ఆపలేరు కదా అన్నారు. సీఎం వైయస్ జగన్ సుప్రీం కోర్టు సీజేఐకి లేఖ రాయడం మీకు నచ్చకపోవచ్చని, అయితే అది వేరే అంశమన్నారు. ఇలాంటి పత్రికా స్వేచ్ఛ పేరు చెప్పి పత్రికలు అమ్ముకుంటున్న పత్రికలను చదవాల్సిన అవసరం ఉందా అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఒక వర్గాన్ని కాపాడేప్రయత్నం చేసే పత్రికలను ఇంటికి ఎందుకు తెప్పించుకోవాలన్నారు. కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ మీడియా స్వేఛ్చ అంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. వార్తలు రాయకపోగా, మరుసటి రోజు డిబేట్లు పెట్టి సీఎం వైయస్ జగన్‌పై విమర్శలు చేసే కార్యక్రమాలు చేశారు. వైయస్ జగన్ చేసింది తప్పు అని ఫుంఖాలు ఫుంఖాలుగా రాస్తున్నారు. ఇలాంటి పత్రికలు మనం చదవాలా ఆలోచన చేయాలన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న పత్రికలు కూడా ఈ వార్తను రాశాయి. మన రాష్ట్రంలో ఉన్న కొన్ని పత్రికలు మాత్రం ఈ వార్తను ఎందుకు ప్రచురించలేదన్నారు. అలాంటి పత్రికలు డిబేట్లు పెట్టడం, వ్యాసాలు రాసే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ పత్రికలు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అంబటి రాంబాబు సూచించారు.