విజయవాడ: చంద్రబాబు కోసం ఢిల్లీలో పవన్ కల్యాణ్ దళారీగా మారాడని, తన తల్లిని తిట్టించిన వ్యక్తి కోసం పవన్ దళారీగా మారడం సిగ్గుచేటని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. పవన్ కల్యాణ్ దళపతి కాదు దళారీ అని ఎద్దేవా చేశారు. విజయవాడలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు కానీ, ప్రజల కోసం పనిచేయడం లేదని కాపులు, జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, కాపు సామాజిక వర్గానికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దిగజారుడు, అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీయే సమావేశానికి పిలవకుండా పక్కనబెట్టారన్నారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్ చెబుతారని పవన్ మాట్లాడటం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్ రాసిచ్చింది.. మీటింగ్స్‌లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు. మోడీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని, సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ కలిసిపోయాడన్నారు. తల్లి ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టి చంద్రబాబు కోసం దిగజారిపోయి దళారీలా పనిచేస్తున్నాడన్నారు. 3 పార్టీలు కలిసి పోటీచేస్తాయని పవన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తుని సభలో దళపతిని అని మాట్లాడిన పవన్.. చంద్రబాబు కోసం ఢిల్లీకి వెళ్లి దళారీలా పనిచేస్తున్నాడన్నారు. రాజకీయ పార్టీ పెట్టి వేరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేస్తున్న దేశంలోనే ఒకే ఒక దద్దమ్మ పవన్ కల్యాణ్ మాత్రమేనన్నారు. పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైందన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలులేక పవన్ మళ్లీ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని గతంలో ప్రగల్భాలు పలికిన పవన్.. ఇప్పుడు సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని లేఖలు పంపినా బీజేపీ ఎన్డీయే సమావేశానికి పిలవలేదని, బాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసన్నారు. రాహుల్‌ను ప్రధాని చేస్తానన్న బాబు కాంగ్రెస్‌ను సైతం మోసం చేశాడని గుర్తుచేశారు.