తాడేపల్లి: మందులేని మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తూ.. సోషల్ డిస్టెన్స్, పరిశుభ్రత పాటించాలని, అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే.. బడ్జెట్ ఈ నెలాఖరులోపు ఆమోదించాల్సి ఉంది. కానీ ఈ రోజున ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనకు మనం స్వీయ నియంత్రణ విధించుకున్నందున అసెంబ్లీ సమావేశాలు జరపడం కుదరనందున కేబినెట్ భేటీలో బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు అవసరమైన అన్ని రకాల వ్యయాలు చేసేందుకు ఆర్టికల్ 213 సబ్ సెక్షన్ 1లోని నిబంధన మేరకు రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టిన కోవిడ్-19 నియంత్రణ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనుచరిస్తున్న విధి విధానాలు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. ప్రజలకు ప్రభుత్వం ఏం చెప్పాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 11 నమోదయ్యాయి. విశాఖలో 3, విజయవాడలో 3, ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి సుమారు 28 వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. 2020 మార్చి 13న కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం రెగ్యులరైజేషన్స్ జారీ చేసింది. దాంతో పాటు 104 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసి ఒకేసారి 60 మంది ఫోన్ చేసేలా చర్యలు తీసుకుంది. కరోనా అరికట్టేందుకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి 104 హెల్ప్‌లైన్ 24 గంటలు పనిచేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో 200 పడకలతో కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేశాం. ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఉంటే సెకండ్, థర్డ్ లెవల్స్‌లో ఎలా చేయాలనే స్థిరమైన ప్లాన్ తయారు చేసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో కరోనా వైరస్ బారినపడిన వ్యక్తులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో ఆస్పత్రిలో సుమారు 100 వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో మార్చి 23వ తేదీ నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉండాలని సీఎం ఆలోచన చేశారు. దేశ ప్రధాని ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌కు ఆదేశించిన మేరకు అప్పటి వరకు కొనసాగిస్తాం. ప్రాథమిక, నిత్యావసరాలకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ సోకిన వారు, ట్రీట్‌మెంట్ చేసేవారికి 52 వేల ఎన్95 మాస్కులు అందుబాటులో ఉంచాం. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్‌కు (పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్యూర్ట్‌మెంట్) తల నుంచి కాలి గోరు వరకు ఉండే పీపీఈలు 4 వేలు అందుబాటులో ఉంచాం. ఇంకా అత్యవసరం కావాల్సి ఉంటే హెచ్‌ఐవీ పేషెంట్లను ట్రీట్ చేయడానికి ఉండే కిట్‌లను వాడే అవకాశం ఉంది కాబట్టి 52 వేల కిట్లను అందుబాటులో ఉంచాం. పది లక్షల సర్జికల్ మాస్కులను అందుబాటులో ఉంచాం. కేబినెట్ సమావేశంలో సీఎం వైయస్ జగన్ మంత్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతి ఒక్కరూ సోషల్ కర్ఫ్యూ పాటించాలి. ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తరచుగా శానిటైజర్స్ లేకున్నా సబ్బుతోనైనా మోచేతి వరకు ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవడం, మన ఇంటి వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద అత్యవసరాల కోసం రూ. 2 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న ఆక్వా పరిశ్రమ కార్యకలాపాలకు సంబంధించి సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్‌కు సరుకు రవాణా అన్నింటికీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. ఆక్వారంగంలోని ఎక్స్‌పోర్టర్స్ అందరితో రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కూలీలకు పని చూపించాలని, కచ్చితంగా కూలీలు సామాజిక దూరం పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎవరికీ ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ పనులకు సంబంధించి కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు కొనసాగించవచ్చని తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు నేతృత్వంలో పదిమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, నలుగురు సీఎంఓ అధికారులు, ఐదుగురు మంత్రులను కమిటీలో మెంబర్లుగా చేర్చారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో కూడా టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ టీమ్‌లో జిల్లాస్థాయి అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేను కూడా సభ్యుడిగా చేర్చుతారు. రైతుబజార్లు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు, నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని సీఎం సూచించారు. కేవలం విదేశాల నుంచి వచ్చినవారే కాకుండా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారికి సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే గుర్తించాలని వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనవాళ్లు ఎక్కడైనా చిక్కుకుపోతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తీసుకువచ్చాం. ఇవాళ కరోనా వైరస్ అనే మందులేని మహమ్మారి ప్రపంచంపై పడింది. కాబట్టి ఏపీ ప్రజలంతా ప్రభుత్వ అచేతస్థితిని అర్థం చేసుకోవాలని సీఎం కోరారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న వ్యక్తులు ఎవరితో తిరిగారు.. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయలేం. కరోనా వైరస్ 14 నుంచి 28 రోజుల వరకు బయటపడదని కేంద్రం, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మీ అందరినీ చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం. ఎక్కడి వారు అక్కడే బస చేయండి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్ సీఎంలతో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు. మా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం కోరారు. నిలువ నీడ లేకుండా ఉన్న వారి కోసం కల్యాణ మండపాలను అద్దెకు తీసుకొని వారికి ఆశ్రయం కల్పించాలని సీఎం వైయస్ జగన్ అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భోజనానికి ఇబ్బందులు పడే వారి కోసం ఆహారాన్ని అందించేందుకు దాతలు ముందుకు వచ్చి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌ను కలిసి చేతనైనంత సాయం చేయాలని కోరుతున్నాం. దాతలు వచ్చినా.. రాకపోయినా సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సరిహద్దులో వందల సంఖ్యలో ఎదురుచూస్తున్న వ్యక్తులను ఒకటే కోరుతున్నాం. 14 రోజులు క్వారంటైమ్‌కు సిద్ధపడి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని కోరుతున్నాం. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఆ ఇంటి దగ్గరికి చలికాచుకోవడానికి ఇంకోడు వెళ్లాడంట. వెనకటికి పెద్దలు చెప్పిన సామెతలా చంద్రబాబు తీరు ఉంది. మొన్న 13 వేలు అన్నారు కదా.. నిన్న సీఎం వైయస్ జగన్ 28 వేలు అంటున్నాడు.. ఒక్కరోజులోనే 15 వేల మంది పెరిగారా అని 40 ఇయర్స్ ఇండస్ట్రీ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు హైదరాబాద్‌లో కాపురం ఉంటూ ప్రాణాలను కాపాడుకుంటే మంచిదే. కానీ, ఏ అధికారితోనైనా 13 వేలు... 28 వేలు ఎలా అయ్యిందని ఆరా తీశారా చంద్రబాబూ..? మార్చి 10వ తేదీన వలంటీర్ల ద్వారా సర్వే ఆదేశించాం. మార్చి 13వ తేదీన సుమారు 13 వేల మంది వచ్చి ఉన్నారని సర్వేలో తేలింది. రెండో విడత సర్వేలో 28 వేల మంది అని తేలింది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసే వ్యక్తులను ఇన్నాళ్లు పోషించామా అని ప్రజలు బాధపడుతున్నాం. అనాలోచితంగా మనం ఇంటికి వెళ్లిపోవాలని తొందరపాటుతనంతో కొందరు వ్యక్తులు సరిహద్దులోకి వచ్చేస్తే.. ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా చూపిస్తున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు పోటీపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విలేకరుల్లో కూడా కొంతమంది వక్రీకరణ చేయడం శోచనీయం. క్వారంటైమ్‌కు తీసుకెళ్లకుండా ఇంటికి ఎలా పంపించమంటారు.. ఈ రోజుల్లో కూడా రేటింగ్‌ల కోసం పాకులాడడం ఎంతవరకు సమంజసం.