పండగ పేరుతో దోపిడీపై కఠిన చర్యలు  

బస్సు టికెట్‌ ధరలు పెంచొద్దు 

ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలకు సర్కార్‌ హెచ్చరిక

ప్రైవేట్‌ బస్సులపై 3132 కేసులు నమోదు

516 ప్రైవేట్‌ బస్సులను సీజ్‌ చేశాం

ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోండి

మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్నినాని హెచ్చరించారు. ఆర్టీసీలో డిమాండుకు మించి బస్సులు సిద్ధంగా ఉన్నాయని, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకొని గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యం టికెట్‌ ధరలు పెంచొద్దని సూచించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
 2019 డిసెంబర్‌ 30న తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశాం. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఓనర్స్‌కు కూడా హెచ్చరిక చేశాం. ప్రయాణికుల జేబులు లూటీ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశాం. అత్యధిక ధరలతో టికెట్లు వసూలు చేస్తే మాకు ఫిర్యాదు చేయమని సూచించాం. ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్లకు ఫిర్యాదులు వచ్చాయి. జనవరి 2వ తేదీ నుంచి బ్రేక్‌ ఇన్ స్పెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయించాం. జనవరి 2 నుంచి 16వ తేదీ వరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై  3132 కేసులు నమోదు చేశాం. 546 బస్సులను సీజ్‌ చేశాం. కృష్ణా జిల్లాలో 202 బస్సులను సీజ్‌ చేశాం. కేసుల పరంగా కూడా 615 కేసులు కృష్ణా జిల్లాలో నమోదు చేశాం. పశ్చిమగోదావరిలో 350 కేసులు నమోదు చేశాం. ప్రైవేట్‌ బస్సులను కట్టడి చేసేందుకు ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడిపించాం. జనవరి 9 నుంచి రెగ్యులర్‌ సర్వీసుల ద్వారా 2.10 లక్షల మందిని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ప్రయాణికులను తీసుకువచ్చాం. డిమాండ్‌ మేరకు 2945 ప్రత్యేక బస్సులు ఉపయోగించాం. రెగ్యులర్‌ సర్వీసుల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది 7వేల పైచిలుకు మందిని తీసుకువచ్చాం. గడిచిన సంవత్సరం కంటే ఆర్టీసీలో ప్రత్యేక బస్సుల్లో 20 వేల ప్రయాణికులను తీసుకువచ్చాం. ఈ పండుగకు 3.17 లక్షల మందిని ఆర్టీసీ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చాం. తిరుగు ప్రయాణానికి కూడా ఈ రోజు నుంచి రైడ్స్‌ ప్రారంభిస్తున్నాం. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని బస్సులపై రైడ్స్‌ చేస్తాం. ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. ఒంగోలు నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ బస్సును కూడా తనిఖీ చేయాలని ఆదేశించాం. ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున సర్వీసులను పంపించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇటు నుంచి గమ్య స్థానాలకు చేర్చేందుకు మరో 3 వేల బస్సులను రెడీ చేస్తున్నాం. గతం కంటే కూడా ఎక్కువగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. 
ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రయాణికులను దోపిడీ చేయకుండా, చార్జీలు పెంచకుండా సహకరించాలని కోరుతున్నాం. ప్రజల పక్షాన మీ అందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ప్రయాణికులు 8309887955 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రాత పూర్వకంగానైనా, స్క్రీన్‌ షార్ట్‌ తీసి వాట్సాప్‌ చేస్తే సంబంధిత బస్సులపై చర్యలు తీసుకుంటాం. సుఖమైన, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోవాలని పేర్ని నాని సూచించారు. 

Back to Top