వైయస్‌ఆర్ జిల్లా: ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయని, బీజేపీకి అడ్రస్ లేదని, గల్లంతైన, అడ్రస్ లేని పార్టీలు ఏ అర్హతతో ఓటు అడుగుతారని బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక వైయస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బద్వేలులో మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి వైయస్ జగన్ ప్రభుత్వం రూ.792 కోట్లు కేటాయించిందన్నారు. బ్రహ్మంసాగర్ ద్వారా తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నామని చెప్పారు. సీఎం వైయస్ జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెప్పేందుకు ప్రతి ఇంటికి వెళ్తామని, ఓటేయమని అభ్యర్థిస్తామని చెప్పారు. అప్పులు ఎక్కువ చేస్తున్నామని ఆరోపిస్తున్నారని, కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచామన్నారు. నోబెల్ గ్రహీత అమర్థ్యసేన్ చెప్పినట్టు హెలికాప్టర్ మనీ ద్వారా పేదలను ఆదుకున్నామని చెప్పారు.
టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలోనే విజయవాడలోని ఆలయాలను కూల్చేశారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. హిందూమతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. వైయస్‌ఆర్ సీపీ సెక్యులర్ పార్టీ.. అన్ని మతాలను సమానంగా చూస్తామన్నారు. బీజేపీ నేత సునీల్ దియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నుంచి వెళ్లిన తాబేదారుల స్క్రిప్టు చదువుతున్నారని, ఆరోపణలు చేసే ముందు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.