అభివృద్ధిని అడ్డుకునేందుకు బాబు కుట్రలు

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు లేరు

ఓటమి భయంతో చంద్రబాబు ఆరోపణలు

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి

 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: ఏదోరకంగా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని, ఓటమి చంద్రబాబు ముందే సాకులు వెతుక్కుంటున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, చంద్రబాబు, ఆయన ఎల్లోమీడియా లేనిపోనివి చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తొమ్మిది నెలల్లోనే వైయస్‌ జగన్‌ 90 శాతం హామీలు అమలు చేశారని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వైయస్‌ జగన్‌ పాలనను అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. విజయవాడలో శుక్రవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 
అభ్యర్థులు దొరక్క..నానా తంటాలు పడి చంద్రబాబు నామమాత్రంగానే స్థానిక సంస్థల్లో పోటికి దించుతున్నారు. వైయస్‌ జగన్‌ తొమ్మిది నెలల్లోనే 90 శాతం హామీలు అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. 9 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలు గెలిచాం. ఈ తొమ్మిది నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో కోటి కుటుంబాలు లబ్ధి పొందారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ప్రెస్‌మీట్లు పెట్టి ఏదో జరిగిపోతున్నట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు కొన్ని చానల్స్‌ వంత పడుతున్నాయి. పార్టీ రహితంగా వైయస్‌ జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. పది కాలాలు రాష్ట్రం చల్లగా ఉండాలని ప్రజలంతా దృఢ నిశ్చయంతో ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, శివనాగిరెడ్డి, రహిమాన్‌, వంకచర్ల రమేష్‌ తదితరులు టీడీపీ వదిలెందుకు రెడీగా ఉన్నారు. టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఇలాంటి తరణంలో అపజయాన్ని కప్పి పుచ్చుకునేందుకు మాపై నెపం నెట్టడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. 2014-2019 వరకు చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చారో అందరికి తెలుసు. ఓడిపోయే స్థానాన్ని ఈ రోజు చంద్రబాబు దళిత నేత వర్ల రామయ్యకు ఇస్తున్నారు. దళితులపై ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటుకు ఎందుకు ఇవ్వలేదు. ప్రస్తుతం రాజ్యసభ సీటు నారా లోకేష్‌కు ఎందుకు ఇవ్వలేదు?. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు నామమాత్రంగా పోటీ చేస్తున్నారు. చాలా చోట్ల టీడీపీ నేతలకు ఆ పార్టీ నుంచి మద్దతు లేక నామినేషన్లు విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఎన్నడు కూడా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగలేదు.ఈ రోజు చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు.
2019లో చంద్రబాబు ఎన్నికల ముందు మోదీ కుటుంబ సభ్యులను దూషించారు. ఢిల్లీ వెళ్లి జాతీయ పోరాటం అన్నారు. మోదీ అంతు చూస్తానని ఇప్పుడు ఆయన వద్దకు కాళ్ల బేరానికి దిగారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధీటుగా పోరాటం చేశాం. ఏ రోజు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బెదిరించి తీసుకోలేదు. చంద్రబాబు మా పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను తీసుకెళ్లి జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలను చేసుకున్నారు. నీతి నియమాలు లేకుండా చంద్రబాబు గత ఐదేళ్లు పాలన సాగించారు. ఇలాంటి వ్యక్తికి ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, కొన్ని చానల్స్‌, పేపర్లు మద్దతుగా నిలిచి ప్రజలను మభ్యపెడుతున్నాయి. 
సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన రైతు భరోసా, అమ్మ ఒడి, ఇంగ్లీష్‌ మీడియం, స్కూల్స్‌, ఆసుపత్రుల్లో నాడు-నేడు, జిల్లాకో టీచింగ్‌ ఆసుపత్రి, ఆరోగ్యశ్రీలో మరో వెయ్యి జబ్బులు చేర్చడం, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, కంటి వెలుగు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు చంద్రబాబుకు కనిపించడం లేదు. ఇన్ని పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు ఏవిధంగా టీడీపీకి ఓట్లు వేస్తారు?. తొమ్మిది నెలల్లోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్‌ జగన్‌ పాలన సాగించారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ పాలనను కోరుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు మోకాలడ్డారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యలు కూడా చేయించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top