ఏపీఎండీసీ ద్వారా ఇసుక డోర్‌ డెలవరీ

2న కృష్ణా, 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు

జనవరి 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా..

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ నిర్ణయం

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఇసుక రీచ్‌ల పర్యవేక్షిస్తాం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

సచివాలయం: ఏపీఎండీసీ ద్వారా ఇసుక డోర్‌ డెలవరీ చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జనవరి 2వ తేదీన కృష్ణా, 7వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలవరీ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌ డెలవరీ చేస్తామన్నారు. సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 255 రీచ్‌ల నుంచి రోజు వారీగా 80 వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 9.63 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ ఉందన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక అందుబాటులోకి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నూతన ఇసుక పాలసీని కొద్దిగా మార్పులు చేసి  ప్రభుత్వమే ఏపీఎండీసీ ద్వారా ఇసుకను డోర్‌ డెలవరీ చేయాలని నిర్ణయం చేయడం జరిగిందన్నారు. దీని వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే ఇసుక చేరుతుందన్నారు.  

255 స్టాక్‌ పాయింట్లలో 13 చోట్ల ఆన్‌లైన్‌లో రెండు నిమిషాల్లో రిపీటెడ్‌గా ఒకరే బుక్‌ చేసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితులు లేకుండా డోర్‌ డెవలరీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. సెప్టెంబర్‌ 5వ తేదీన నూతన ఇసుక పాలసీ  వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 43.70 లక్షల టన్నులు సరఫరా చేశామన్నారు.  ఇంకా స్టాక్‌ యార్డుల్లో 9.63 లక్షల స్టాక్‌ ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నెలకు 15 లక్షల టన్నుల స్టాక్‌ పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు నాలుగు నెలలు తప్పనిసరిగా చేసి 60 లక్షల స్టాక్‌ పెట్టాలని ఏపీఎండీసీ ప్రయత్నిస్తుందన్నారు.  

గత ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఇసుకను విచ్చలవిడిగా దోచుకొని సొమ్ముచేసుకుందని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ ట్రిబ్యూనల్‌ కూడా గత ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా వేసిందని గుర్తుచేశారు. పర్యవరణానికి ఇబ్బందులు కలగకుండా.. ప్రజలకు సమస్య లేకుండా ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. 444 చెక్‌పోస్టులు చేపట్టాలని నిర్ణయించామని, వాటిల్లో నాలుగు జిల్లాల్లోని 55 చెక్‌పోస్టుల వద్ద పోలీస్‌ శాఖ చెక్‌పోస్టులు అవసరం లేదని చెప్పడంతో 389 మాత్రమే నిర్మిస్తున్నామన్నారు. అవి కూడా పూర్తికావొచ్చాయన్నారు. జనవరి 9వ తేదీ లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఇసుక రీచ్‌లను పర్యవేక్షిస్తామని, సీఎం కార్యాలయానికి కూడా ఈ సదుపాయాన్ని కనెక్ట్‌ చేస్తామన్నారు.

 

Back to Top