అనంతపురం: వెనుకబడిన వర్గాలపై తన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చాటుకున్నారని, గడిచిన మూడేళ్లలో బడుగు, బలహీనవర్గాలకు అన్ని రకాలుగా తోడుగా నిలిచారని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. సామాజిక న్యాయభేరి అనంతపురం బహిరంగ సభలో మంత్రి నారాయణస్వామి మాట్లాడారు. ఇన్నాళ్లూ బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనారిటీలనూ సామాజికంగానూ, ఆర్థికంగానూ, విద్యాపరంగానూ అణగదొక్కారని, ఎవ్వరూ వారి గురించి ఆలోచించిన పాపానపోలేదన్నారు. కానీ, తొలిసారిగా సీఎం వైయస్ జగన్‌గారు, ఆ వర్గాలకు మంత్రి పదవులు మొదలు, అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాల వారికే ఎక్కువగా ఇచ్చారని గుర్తుచేశారు. విజయవాడ మేయర్ జనరల్‌కు కేటాయించినా.. సీఎం వైయస్ జగన్ బీసీ మహిళకు ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే విధంగా బడుగు, బలహీనవర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకోవాలని వారి కోసం అమ్మ ఒడి పథకం, మహిళల సంక్షేమం కోసం చేయూత పథకం అమలు చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అన్నగా, తమ్ముడిగా అండగా నిలిచారన్నారు. చివరకు కాపు సామాజిక వర్గం మహిళలకు కూడా సీఎం ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. అందుకే మనమంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు రుణపడి ఉండాలని, అండగా నిలవాలని, మరోసారి తప్పనిసరిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.