అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కిలో ఉల్లి రూ.25 చొప్పున సబ్సిడీపై రైతు బజార్ల ద్వారా అందజేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ఉల్లి ధరలపై టీడీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారని, వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. సోమవారం సచివాలయంలో మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. మన అవసరాలకు తగ్గట్టుగా పంటలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉల్లి కొరతను దృష్టిలో పెట్టుకొని రైతు బజార్ల ద్వారా రూ.25లకే కేజీ ఉల్లిపాయలు ఇచ్చామన్నారు. నవంబర్ 14 నుంచి ఒక్కసారిగా ఎక్కడ లేని విధంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ఉందన్నారు. కొరతను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే సప్లై అధికంగా ఉంటుందో అన్ని ప్రాంతాల నుంచి కూడా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు 36,536 మెట్రిక్ క్వింటాళ్ల ఉల్లిని అందజేశామన్నారు. మనకు అందుబాటులో ఉన్న కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, రాజస్థాన్ నుంచి కూడా ఉల్లిపాయలు తెప్పించామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రూ.115, 110, 85 చొప్పున కిలో ఉల్లిపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఈ 25 రోజుల్లోనే రూ.25,80,18,000 పెట్టి కొనుగోలు చేశామన్నారు. రైతు బజార్ల ద్వారా ఇవ్వడం వల్ల రూ.17, 21,58,000 ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. సీఎం వైయస్ జగన్ ఒకవైపు రైతులను ఆదుకునేందుకు కేటాయించిన రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారన్నారు. ఇందులో నుంచి ఖర్చు చేస్తున్నామన్నారు. వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా సీఎం వైయస్ జగన్ సబ్సిడీపై ఉల్లిపాయలు అందజేస్తున్నారన్నారు. దేశంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం టర్కీ, ఈజిప్ట్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటుందన్నారు. ముంబాయి ఏయిర్‌పోర్టుకు ఉల్లిపాయలు రానున్నాయట. మన రాష్ట్రానికి 2500 మెట్రిక్‌టన్నులు కేంద్రానికి ఇండెంట్ పెట్టామన్నారు. ఈ దిగుమతులు వస్తే సమస్య కొంత తీరుతుందన్నారు. కేంద్రం ఇంతవరకు ధర నిర్ణయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.25 చొప్పున ఇస్తున్నామన్నారు. ఇక్కడేదో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. తెలంగాణలో రైతు బజార్లలో కీలో రూ.45 చొప్పున ఇస్తున్నారని తెలిపారు. Read Also: ఆడపిల్లపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లో ఉరిశిక్ష