చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెప్తారు..?

రాష్ట్రపతి, మోడీ, అమిషాను కలిసి ఆ పదం వాడుతారా..?

టీడీపీ ఆఫీస్‌ దేవాలయమైతే.. పార్టీని స్థాపించిన దేవుడిపై చెప్పుల దాడి బాబుకు గుర్తులేదా..?

చంద్రబాబు దీక్ష ఎందుకు చేశాడో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే తెలియదు

సినిమాలో బ్రహ్మానంద కామెడీలా నిన్న లోకేశ్‌ స్పీచ్‌

టీడీపీ బతికే ఉందని ఢిల్లీ పెద్దలకు భ్రమ కల్పించేందుకే బాబు తాపత్రయం

మా కార్యకర్త మీద ఈగ వాలినా ఒప్పుకోని నాయకుడు వైయస్‌ జగన్‌

ప్రతి మహిళను తల్లిగా చూసే సంస్కారవంతుడు సీఎం వైయస్‌ జగన్‌

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: ప్రతి మహిళను తల్లిగా చూసే సంస్కారవంతుడు సీఎం వైయస్‌ జగన్,  కాబట్టే ఈ రాష్ట్రంలోని ప్రతి పథకం మహిళల పేరిటే అమలవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు కొంగజపాలు చేస్తే జనం అర్థం చేసుకోలేరా..? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు, చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ తల్లిని ఉద్దేశించి ఎవరో కామెంట్‌ చేస్తే.. చంద్రబాబే ఇదంతా చేయిస్తున్నాడని అనుకుంటున్నప్పుడు పాదయాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ స్పందించి.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మను కించపరచడం మంచిది కాదు’ అని చెప్పారని మంత్రి కన్నబాబు గుర్తుచేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే విషప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలనే కుట్రకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగా పూర్తిగా తానే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తూ ఒక స్కిట్‌ నడిపించాడని మండిపడ్డారు. బజారు భాష మాట్లాడే అధికార ప్రతినిధిని పెట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను, వారి తల్లిని కించపరిచే విధంగా బూతులు తిట్టించాడని ధ్వజమెత్తారు. ఆ సంఘటనను రాజకీయ లబ్ధికోసం వాడుకునేందుకు 36 గంటల పాటు చంద్రబాబు దొంగ దీక్ష చేశారన్నారు.  

చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు తెలియక వేరే నాయకుడిని అడిగే పరిస్థితిని చూశామని, బాబు ఎంత క్లారిటీతో  నడుస్తుందో.. రాష్ట్ర అధ్యక్షుడికి ఏ పరిస్థితి ఉందో చూశామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ లేదు బొక్కా లేదని అచ్చెన్నాయుడు స్వయంగా చెప్పాడని, అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉనికి కోసం చంద్రబాబు ఈ డ్రామాను నడిపించాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల జరిగే ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయలేదు..? అది జాతీయ పార్టీనా..? చంద్రబాబు కొత్త బహిష్కరణలు, కొత్త దీక్షలకు మరో డిక్షనరీ రాయాలని ఎద్దేవా చేశారు.  

మంత్రి కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. 
బోసడీకే అనే పదానికి అర్థం బాగున్నారా అని టీడీపీ నేతలు చెప్తున్నారు కదా.. మరి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని చంద్రబాబు ఏమని సంభోధిస్తారు. మోడీ, అమిత్‌షాని కలిస్తే బాగున్నారా పదం బదులు ఈ పదం ఏమైనా వాడుతారా..? లోకేష్‌ ఎదురై నాన్న  బాగున్నారా అడగడానికి.. బోసడీకే నాన్న అని అడుగుతారా..? చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెప్తారు..? ముఖ్యమంత్రిని బోసడీకే అన్నామని చెబితే చెప్పుతీసుకొని కొడతారు. ఈ పదానికి ఢిల్లీలో దారుణంగా రియాక్ట్‌ అవుతారు. 

అమిత్‌షా కాన్వాయ్‌ మీద చంద్రబాబు రాళ్లు వేయించిన కథ ఆయనకు తెలియదా..? ప్రోటోకాల్, ప్రొటెక్షన్‌ ఇవ్వను అని మాట్లాడిన మాటలు గుర్తురావా..? ఏ మొహం పెట్టుకొని అమిత్‌షాని చంద్రబాబు కలుస్తారు..? సీబీఐతో ఎంక్వైరీ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మీరు అధికారంలో ఉండగా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. ఇప్పుడు సీబీఐ అంటున్నాడు. సినిమాలో బ్రహ్మానంద కామెడీలా నిన్న లోకేశ్‌ స్పీచ్‌ ఉంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిని గిఫ్ట్‌గా ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఎవడైనా రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి గిఫ్ట్‌ ఇస్తానంటాడా..? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గిఫ్ట్‌గా ఇస్తామంటాడా..? స్థానిక ఎన్నికలు బహిష్కరించామన్నారు కదా.. దుగ్గిరాలలో ఎంపీటీసీలకు టీడీపీ బీఫాంలు ఎవరు ఇచ్చారు..? సమాధానం చెప్పండి. దమ్ముంటే వచ్చే కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి చూపించండి. 

ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు పుస్తకం పెట్టుకొని ఆ పుస్తకంలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు పేర్లు రాసుకోండి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక 6,7 నెలల పాటు వాళ్ల సంగతి చూద్దాం అని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను హింసించడం, కేసులు పెట్టడం, అణచివేయడం, కక్షసాధింపు, వైయస్‌ఆర్‌ సీపీని అంతమొందించడానికేనా మీకు అధికారంలోకి రావాలనుంటున్నారు కానీ, రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఇలాంటి దరిద్రం చేశారు కాబట్టే 2019లో 23 సీట్లకు పడగొట్టారు. కేవలం 3 ఎంపీపీలు గెలుచుకునే స్థాయికి పంపించారు. అయినా టీడీపీ నేతలకు సిగ్గురాలేదు.  

వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త మీద చెయ్యి వేస్తే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చూస్తూ ఊరుకోరు. కార్యకర్త మీద ఈగ వాలినా ఒప్పుకోని నాయకుడు వైయస్‌ జగన్‌. అభిమాన నాయకుడిని అధికారం లేనప్పుడే 10 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి ప్రజలకు ఇంత మంచిచేస్తున్న నాయకుడి కోసం కార్యకర్తలు ఎంతకైనా పోరాడతారు. కార్యకర్తల వెన్నంటే నాయకుడు ఉంటారు.  

టీడీపీ దేవాలయం అయితే.. పార్టీని స్థాపించిన దేవుడు ఎన్టీఆర్‌ మీద రాళ్ల దాడి, చెప్పుల దాడి చేసింది చంద్రబాబుకు గుర్తులేదా..? దేవాలయంలో మంత్రాలు చదువుతారా.. బూతులు చదువుతారా..? ఆ బూతులను ఇప్పటికీ సమర్థించుకుంటున్న చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకోవడానికి బుద్ధిలేదా..? ముఖ్యమంత్రిపై బురదజల్లి టీడీపీ బతికే ఉందని ఢిల్లీ పెద్దలకు భ్రమ కల్పించేందుకే చంద్రబాబు తాపత్రయం. ప్రభుత్వం మీద ఉగ్రవాదం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. పేదల జీవితాలను బాగుచేద్దామనే ప్రయత్నం మీద ఉగ్రవాదుల్లా విరుచుకుపడుతుంది టీడీపీ. ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యత అని కోర్టుకు వెళ్లారు. ఇంగ్లిష్‌ మీడియంపై కోర్టుకు వెళ్లారు. అమ్మఒడి అంటే ఎందుకిస్తున్నారని అడ్డుకుంటున్నారు.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై ఉగ్రవాదుల్లా దాడి చేసేది తెలుగుదేశం పార్టీ నేతలే..’ అని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top