కరోనా సాకుతో రైతుల్ని మోసం చేయొద్దు

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు

ఏప్రిల్‌ ఒకటి నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రంలో ఎక్కడా మార్కెట్లు మూతపడవు

అన్ని మార్కెట్‌ యార్డుల్లో రైతులు- ట్రేడర్స్‌తో సమావేశాలు

మే నాటికి 8 వేల రైతు భరోసా కేంద్రాలు  

వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కన్నబాబు

సచివాలయం: కరోనా సాకుతో రైతుల్ని మోసం చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దళారులను హెచ్చరించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏప్రిల్‌ ఒకటి నాటికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే నాటికి రాష్ట్రంలో 8 వేల రైతు భరోసా కేంద్రాలు  ఏర్పాటు చేసేందుకు చురుగ్గా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్కెట్లు మూత వేయడం లేదని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. 
రైతులు దళారుల మాటలు నమ్మొద్దు. కరోనా వైరస్‌ కారణంగా మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని తెలిసింది. మొన్ననే సీఎం వైయస్‌ జగన్‌ ధరల తగ్గుదలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ వారం రోజులు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటాం. అరటికి రూ.800 గిట్టుబాటు ధర కల్పించాం. అనంతపురం జిల్లా విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న పెద్ద మార్కెట్లు మూత పడటంతో ఈ ఇబ్బంది వచ్చిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్కడా కూడా మార్కెట్లు మూత వేయడం లేదు. రైతుల పంటలు, గిట్టుబాటు ధరలు దృష్టిలో పెట్టుకొని వాటిని కొనసాగిస్తున్నాం. మొత్తం శుభ్రం చేసి, బ్లీచింగ్‌ చేయిస్తున్నాం. మాస్కులు, శానిటేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన ఉన్నప్పుడు దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించిన తరువాత రైతుల దృష్టికి కొన్ని విషయాలు రైతులకు తెలియజేస్తున్నాం. కొన్ని ఉత్పత్తులు కోతకు అవకాశం ఉంటే వారం, పది రోజులు ఆలస్యం చేయండి. ప్రధానంగా బయట మార్కెట్‌ ప్రభావితం కాకున్నా..లోకల్‌లో ఇలాంటి ఆందోళనలు సృష్టిస్తున్నారు. అందుకే రైతులకు, ట్రేడర్స్‌కు ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇకపై రైతులు, ట్రేడర్స్‌ మధ్య సత్సంభాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దళారుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ చాలా క్లారిటీతో చెప్పారు. రైతులకు ఇప్పటికే ఎంఎస్‌పీ ప్రకటించాం. గిట్టుబాటు ధరలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పశువులకు పాడర్‌ ప్లాట్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించాం. క్షేత్రస్థాయిలో ఇప్పటికే 4 వేల కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 4 వేల కేంద్రాల ఏ‌ర్పాటుకు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నాం. సాప్ట్‌వేర్‌ కూడా సిద్ధమైంది. రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయాల్లో రైతులకు ఫెసిలిటీ సెంటర్‌గా పని చేస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలు అర్థం చేసుకొని అధికారులు విజయవంతం చేయాలని సూచించాం. కొన్ని ప్రాంతాల్లో విస్తీర్ణం తక్కువ ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. ఈ ఏడాది బ్యాంకర్లు రుణాల విషయంలో టార్గెట్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సూచించాం. ఈ-క్రాప్‌ బుకింగ్‌ను కచ్చితంగా చేయాలి. నిజమైన రైతుకు లబ్ధి చేకూర్చేందుకు ఈ-క్రాప్‌ ఉపయోగపడుతుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

Back to Top