విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ఓర్వలేక కుట్ర రాజకీయ పద్ధతిలో చంద్రబాబు ముందుకెళ్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు గతంలో కులాన్ని, ఇప్పుడు మతాన్ని ఎంచుకొని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో 12 సంవత్సరాల క్రితం సస్పెండ్ అయిన మేజిస్ట్రేట్ రామకృష్ణ సోదరుడు రామచంద్ర మీద దాడి జరిగితే దాన్ని ప్రభుత్వానికి ముడివేసి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవం ఇదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబుకు లేఖ రాశారని, డీజీపీని కూడా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రామచంద్ర మీద దాడి చేసింది టీడీపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డి అని, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. తన హయాంలో దేవాలయాలు కూల్చేసింది చంద్రబాబే. ఆలయాలపై దాడుల ఘటనల్లో టీడీపీ వాళ్లే ఉన్నారు. తుని ఘటనలో సైతం చంద్రబాబే నిప్పు పెట్టించి హడావిడి చేశారని గుర్తుచేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి కన్నబాబు అన్నారు. టీడీపీ పథకాలకు పేర్లు మార్చి వాడుతున్నామని యనమల రామకృష్ణుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, టీడీపీ హయాంలో ఒక్క బోర్ అయినా వేశారా..? అని నిలదీశారు. వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ సహా అనేక జలాశయాలు నిండాయన్నారు. చంద్రబాబు అక్రమ నివాసం ముంచేయడానికి ప్రభుత్వమే వరదలు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నీరు వదలకుండా ఉంచడం కుదరదని చంద్రబాబుకు తెలియదా..? అని ప్రశ్నించారు. వరదపై అప్రమత్తం చేయడానికి నోటీసులు ఇవ్వడం సహజమన్నారు.