అసెంబ్లీ: టీడీపీ కుట్రపూరితంగా కౌన్సిల్‌లో ఇంగ్లిష్ మీడియం బిల్లును వ్యతిరేకించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కేవలం కొంతమంది, కొన్ని వర్గాలే ఇంగ్లిష్ మీడియంలో చదవాలని, పేద వర్గాలు, నిమ్న జాతులు, దళిత వర్గాలు వెనుబడిపోవాలనే దురాలోచనతో ఇంగ్లిష్‌ను వ్యతిరేకించారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన బిల్లును మంత్రి కురసాల కన్నబాబు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మణుడు, మేక పిల్ల కథలా.. ఇంగ్లిష్‌మీడియం గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. సీఎం వైయస్ జగన్ తెలుగు పట్ల కక్ష పెంచుకున్నట్లుగా అభూత కల్పనలు సొంత ప్రసార మాధ్యమాలు, పత్రికలతో చంద్రబాబు దుష్ప్రచారం చేయించారు. కానీ, ప్రజల నుంచి ఇంగ్లిష్ మీడియం కావాలనే ఆలోచన చంద్రబాబును యూటర్న్ తీసుకునేలా చేసింది. యూటర్న్ తరువాత 2017లో ఇంగ్లిష్ మీడియం తీసుకువచ్చాను.. ఇంగ్లిష్ మీడియానికి ఆధ్యుడిని నేనే అన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. మనసు మార్చుకొని మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాడని అనుకున్నాం.. కానీ కౌన్సిల్‌లో మెజార్టీ ఉందని వ్యతిరేకించారు. ఇంగ్లిష్ బోధన ఆవశ్యకతను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పుడో వివరించారు. . ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా పోటీని తట్టుకునే ధైర్యం ఇంగ్లిష్ కల్పిస్తుంది. కానీ, దురదృష్టం కొంతమందికే ఇంగ్లిష్ ఉండాలన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తించారు. లోకేష్ ఒక్కడికే ఇంగ్లిష్ కంఫర్ట్‌గా ఉండాలా..? కుట్రపూరితంగా వ్యతిరేకించడం కరెక్టు కాదు. నిపుణులు, ప్రముఖులు, విద్యావేత్తలతో మాట్లాడిన తరువాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సీఎం వైయస్ జగన్ ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. టీచర్లకు ట్రైనింగ్, బుక్స్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను నాలెడ్జ్ పాట్నర్స్‌గా చేశారు. అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్‌గా ఒక ఐఏఎస్‌ను కూడా నియమించారు. కౌన్సిల్ సూచించినట్లుగా ఈ బిల్లుకు సవరణలు అవసరం లేదు. శాసనసభ గతంలో ఏ విధంగా ఇంగ్లిష్ మీడియం బిల్లును పాస్ చేసిందో.. అదే విధంగా ఆమోదించాలని సభ్యులను మంత్రి కన్నబాబు కోరారు.