నెల్లూరు జిల్లా: అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకం అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లాల్లో 5517 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దున్నే వాడిదే భూమి అన్నట్లు సీఎం వైయస్ జగన్ రైతులకి హక్కులు కల్పించారన్నారు. స్వయం ప్రకటిత మేధావులు అందరూ టీడీపీలోనే ఉన్నారు. వారు మాట్లాడిందే పచ్చ పత్రికలు రాస్తున్నాయి. కరువు మండలాలు ప్రకటనపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎవరు వస్తారో రండి అంటూ మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః* కరువుపై సోమిరెడ్డి అబద్ధపు ప్రచారంః ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి నాందిపలికే ప్రతీ సందర్భంలోనూ టీడీపీ విషప్రచారానికి పూనుకుంటుంది. ఆ పార్టీ కక్కిన విషాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే పచ్చమీడియా తపనను అందరూ చూస్తూనే ఉన్నారు. వారి కుట్రల్ని ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటూనే ఉన్నారు. కరువు మండలాల గురించి టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేయడం.. వాటిని ఈనాడు పత్రిక పతాక శీర్షికలుగా పెట్టి ప్రభుత్వంపై విషపురాతలు రాయడం ఇటీవల మరీ శృతిమించిపోతుంది. నిజానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నివేదికల్లోని కరువు మండలాల ప్రకటనకు సంబంధించి ప్రామాణికాల్ని చదివి అర్ధం చేసుకునే కెపాసిటీ వీరికి లేదు. కరువు పరిస్థితిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నివేదిక ఇదిః డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 679 మండలాల్ని పరిగణలోకి తీసుకుంటే .. స్టెప్–1లో వర్షపాతం ఎంత తక్కువగా నమోదైందో చూడటమే ప్రాథమిక సూచికని చెప్పాలి. దానిప్రకారం చూసినట్లయితే 447 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. ఆ మండలాల్లో స్టెప్–2 కింద నాలుగు అంశాల్ని (1.ఎంత పంట వేశారు..? 2. ఆ ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావంతో వృక్షసంపద ఎంత దెబ్బతింది..? 3. తేమశాతం 4. భూగర్భజలాల పరిస్థితి) పరిశీలిస్తే.. 275 మండలాల్లో పారామీటర్స్ భిన్నంగా ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత స్టెప్–3 ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలనతో పంటలు దెబ్బతిన్న పరిస్థితిని గమనించి 151 మండలాల్ని అధికారులు అంచనా వేశారు. ఈ మండలాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ప్రామాణికాల ప్రకారం కరువు నిర్ధారిత మండలాలు 103గా తేలింది. ఇది వాస్తవ పరిస్థితి కాగా, టీడీపీ నేతలు ఏదేదో మాట్లాడటం.. దాన్ని ఈనాడు పత్రిక అడ్డంగా రాయడాన్ని చూస్తున్నాం. బురదజల్లడమే పనిగా పచ్చమీడియా రాతలుః శాస్త్రీయంగా, సాంకేతికంగా, ప్రభుత్వ వ్యవస్థల విధివిధానాల ప్రకారం కరువు మండలాల ప్రకటన చేస్తున్నామని మేం పదేపదే చెబుతూనే ఉన్నాం. అయినప్పటికీ, పచ్చమీడియా పైత్యం మాత్రం రోజురోజుకు శృతి మించిపోతుంది. సమాజానికి వాళ్లు ఏం చెప్పదలుచుకున్నారు..? ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌జీఆర్‌ఎఫ్ నార్మ్స్ పట్టించుకోం.. మాకు ఉన్నదల్లా ప్రభుత్వంపై బురదజల్లడమే అన్నంతరీతిగా ఈనాడు లాంటి పచ్చమీడియా రాతలున్నాయి. అసలు ఈనాడు రామోజీరావు కైనా బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా..? ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా రాతలు రాయడమే ఈనాడు జర్నలిజమా..? అని ప్రశ్నిస్తున్నాను. ఈనాడు స్టాఫ్‌రిపోర్టర్‌గా సోమిరెడ్డిః నెల్లూరు జిల్లాకు ఈనాడు స్టాఫ్‌రిపోర్టర్‌గా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని రామోజీరావు నియమించాడేమోననే అనుమానం కలుగుతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏ వార్త రావాల్నో.. ఏ ఫొటో పెట్టాల్నో కూడా ఈనాడు డెస్క్ ఇన్‌చార్జికి సోమిరెడ్డి చెబుతున్నాడంట. వ్యవసాయ మంత్రి కాకాణిపై వార్తలు రాసేందుకు ఈనాడు టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని రామోజీని కోరారంట. నామీద కుట్రలు చేసినా.. వార్తలు రాసి విషం చిమ్మినా వెయ్యిమంది రామోజీరావులొచ్చినా.. లక్షమంది సోమిరెడ్డిలాంటోళ్లు వచ్చినా.., ఈనాడు టాస్క్‌ఫోర్సులకూ నేను భయపడే వ్యక్తిని కాదు. మేం తప్పు చేయడంలేదు కనుక మమ్మల్ని మీరు పీకేదేమీలేదు. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం మాదిః రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ప్రభుత్వమిది. రైతుభరోసా కేంద్రాల ద్వారా పంటల సాగుబడికి కావాల్సిన వనరులన్నింటినీ పొంది రాష్ట్రంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. వారికి సీజన్‌కు తగ్గ ఆర్థిక సాయం అందజేతలోనూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాల హృదయం పట్ల రైతుల ఆదరణ మరింత పెరిగింది. మరోవైపు పంట విస్తీర్ణానికి తగ్గట్టు సరిపడా సాగునీటిని అందించడంలోనూ ప్రభుత్వం ముందుంది. రైతుకు అవసరమున్న ప్రతీచోటా ప్రభుత్వం సత్వరమే స్పందించి అవసరమైన చర్యలు చేపడుతోంది. రాబోయే రబీ సీజన్‌లోనూ రైతులకు అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రబీలో వర్షాలు బాగా కురుస్తాయని ఆశిస్తున్నాం. ఒకవేళ పరిస్థితి తారుమారైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధపడుతోందని తెలియజేస్తున్నాం. టీడీపీ, పచ్చమీడియా ఆలోచన శైలి సరికాదుః ఈ ఏడాది కొన్ని చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా పంట సాగువిస్తీర్ణంపై కొంత ఆలోచించాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరం. వర్షభావ పరిస్థితుల్లో టీడీపీ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందంటే.. రైతులు తీవ్రంగా నష్టపోవాలి. ఈ ప్రభుత్వంపై రైతుల్ని రెచ్చగొట్టి ఉసిగొల్పాలి. దానిద్వారా టీడీపీ సంబరాలు చేసుకోవాలన్నట్లుగా ఉంది. మీ ఓట్లకోసం రైతులు తీవ్రంగా నష్టపోవాల్నా..? రైతులకు అండగా నిలిచే జగనన్న ప్రభుత్వాన్ని పట్టుకుని భూతద్దంలో చూపి విషం చిమ్మితే మీ కుట్రల్ని, కుళ్లు రాతల్ని ఎవరూ నమ్మరు గాక నమ్మరు. ఖచ్చితంగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. పురంధేశ్వరి అవగాహనలేని మాటలుః రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని ఊదరగొట్టుకునే చంద్రబాబుకు తోకల్లాగా.. రాజకీయ అవగాహన లేని నేతలు కొందరు ప్రజల్లోకి వస్తున్నారు. వారిలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఉన్నారు. ఆమె నెల్లూరు జిల్లా పర్యటనకొచ్చి తాగునీటి గురించి.. పంట కాలువలకు సాగునీటి విడుదల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారు. వ్యవసాయంపై అవగాహన లేకున్నా.. కాస్త తెలిసిన వాళ్లను అడిగి సమాచారం తెలుసుకుంటే మంచిది. మరిదికి అధికారం కోసం పురంధేశ్వరి తపన పడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే, ఆమె టీడీపీ కార్యాలయం నుంచి అందుతున్న స్క్రిప్టు ప్రసంగాల్నే చెబుతున్నారు తప్ప ఏమాత్రం తన సొంత అభిప్రాయం చెప్పడంలేదని వారి మాటల్ని బట్టి అందరికీ అర్ధమైపోతుంది. తండ్రీకొడుకులకు రాజకీయ సమాధి ఖాయంః నిన్నటిదాకా యువగళం అంటూ రోడ్లమీద తిరిగిన చంద్రబాబు కొడుకు లోకేశ్ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు..? ఢిల్లీ రోడ్లమీద ఆయనకేం పని..? ఆయన గళం మూగబోయే రాగమని నేనెప్పుడో చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు అదే జరిగింది. రాయలసీమ జిల్లాల్లో యువగళం యాత్ర చేసినప్పుడు ఆ అవగాహనలేని పిల్లోడు ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడేమో వ్యవసాయంపైన కూడా తెలిసితెలియక ఏవేవో ట్వీట్లు పెడుతున్నాడు. అది మంచి పద్ధతి కాదని అతను తెలుసుకుంటే మంచిది. వ్యవసాయం, రైతులు, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వ బాధ్యతలు, అమలు చేస్తున్న పథకాలపై ఆయన తన తండ్రి దగ్గర ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి. ఏదిఏమైనా అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకుపోయిన తండ్రీకొడుకులకు రాజకీయ సమాధి ఏర్పడిపోయింది. వారి విధిరాతను.. గతంలో చేసిన పాపాల ఫలితాల్ని ఎవరూ తప్పించలేరనేది వాస్తవం.. అని మంత్రి కాకాణి స్పష్టం చేశారు.