స్కిల్ స్కామ్‌ను కేబినెట్‌కు రుద్దేందుకు బాబు తంటాలు

నాడు వైయ‌స్ జగన్‌పై నిందలేసినప్పుడు ఏమైంది మీ బుద్ధి..?

చంద్ర‌బాబుకు పరపతి లేదు- టీడీపీ బంద్‌కు స్పందన లేదు

న్యాయవ్యవస్థను తప్పుబడుతూ బంద్ లేంటి..?

లోకేశ్‌ ఎర్రడైరీలో చంద్ర‌బాబు పేరే రాసుకోవాలి

పవన్‌కు 2014లోనే వాటా ముట్టింది కాబట్టే ఓవర్ యాక్షన్

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు:  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక దొంగతనానికి పాల్పడి, ప్రజాధనం దోచుకుని స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు కాబ‌ట్టే అరెస్టు అయ్యాడ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబును దోషిగా నిర్ధారించి సీఐడీ అదుపులోకి తీసుకుందన్నారు. అరెస్టు చూపించి ఏసీబీ కోర్టు ముందుకు తీసుకెళ్లిందని, అక్కడ చంద్రబాబు తరఫున హేమాహేమీ న్యాయవాదులు ఒకవైపు, సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరివాదనలు వారు వినిపించారని, చివరికి న్యాయమూర్తి తీర్పుతో ఆయన్ను రిమాండ్‌కు తరలించారని చెప్పారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. చంద్ర‌బాబు అరెస్టుపై ప్రభుత్వం మీద, సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మీద టీడీపీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఏవేవో నిందలేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఐడీ చేయరాని పని ఏదో చేసినట్లుగా.. వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ఏదో తమ నాయకుడ్ని కావాలని అరెస్టు చేసిందంటూ ఎవరికి వారు ఇష్టారీతిగా మాట్లాడుతున్నార‌న్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక వ్యక్తి దొంగతనం చేసినా.. మోసానికి పాల్పడినా.. ప్రజాధనాన్ని దోచుకుని నేరానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

మంత్రి కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..
అందులో భాగంగానే చంద్రబాబును స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో దోషిగా నిర్ధారించి ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. సాధారణంగా రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించడంలో పెద్దగా ఇబ్బందిలేదు. కానీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక దొంగతనానికి పాల్పడి, ప్రజాధనం దోచుకుని స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు . ఇదే విషయాన్ని ఏపీ సీఐడీ దర్యాప్తులో తేలిన నిజం. దీన్ని కోర్టు కూడా నిర్ధారించి ఆయన్ను రిమాండ్‌ కు తరలిస్తే ప్రభుత్వం ఏదో చేయరాని అపరాధం చేసినట్లు రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అంటే, ఈ బంద్‌కు పిలుపునిచ్చిన పార్టీలు టీడీపీ, జనసేనకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం లేనట్టేగా..? అంటే, ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పునకు నిరసనగా మీరు బంద్‌లు, ఆందోళనలు చేస్తారా..? ఇదేనా మీ పార్టీ వ్యవహారశైలి అని ప్రశ్నిస్తున్నాను.  నిన్నటిదాకా ప్రభుత్వం పట్ల గౌరవం లేనివిధంగా ఎవడుపడితే వాడు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు న్యాయవ్యవస్థ మీద కూడా ఏమాత్రం భయం, భక్తిలేకుండా విమర్శలకు పాల్పడటం శోచనీయ విషయం. 

చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజల్లో సానుభూతి లేదు. ప్రజలు ఆయన్ను నమ్మడంలేదు. ఆయన అబద్ధాలకోరు, మోసగాడు అని అందరూ విశ్వసిస్తున్నారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని తేలిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దానివల్లనే చంద్రబాబు అరెస్టును వారంతా హర్షిస్తున్నారు తప్ప ఎక్కడా నిరసన గళాలు విప్పే పరిస్థితి లేదు. ఆయన తప్పుచేశాడు. యువతను అడ్డంపెట్టుకుని ప్రజాధనం దోపిడీ చేసిన దోషిగా సమాజం కూడా విశ్వసిస్తుందని గుర్తుచేస్తున్నాను. 

టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా ఏ ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా రోడ్డుమీదకొచ్చి మద్ధతు తెలిపే పరిస్థితిలేదు. తమ నాయకుడు చంద్రబాబు పెద్ద మహానాయకుడని మీరు చెప్పుకోవడమే గానీ ప్రజల్లో మాత్రం అలాంటి అభిప్రాయమైతే లేదని తెలిసిపోయింది. అంటే, చంద్రబాబునాయుడుకు ప్రజల్లో పరపతిలేదు. అందుకే, ఎవరూ స్వచ్ఛందంగా బంద్‌కు ముందుకురాలేకపోతున్నారు. పోనీ.. దౌర్జన్యంగానైనా బెదిరించి బంద్‌ చేద్దామని ప్రయత్నించిన టీడీపీ నేతల్ని ప్రజలు, వ్యాపారులు తిరగబడి కొడుతున్న పరిస్థితి ఈరోజు కనిపించింది.

నిన్నటిదాకా చంద్రబాబు సభలకు విపరీతంగా జనాల్ని డబ్బులిచ్చి తోలి.. ప్రజల్లో నాకెంత బలముందో చూశారా..? అంటూ విర్రవీగారు కదా..? మరి, ఈరోజు సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తిగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న పరిస్థితేంటి..? మరోపక్క ఆయన కొడుకు లోకేశ్‌ ఒక ఎర్రపుస్తకాన్ని చూపుతూ ఈ డైరీలో వాళ్ల పేర్లు వీళ్ల పేర్లు రాస్తున్నా.. అందరూ జైలుకు పోతారంటూ బెదిరించాడు. మరి, ఇప్పుడు జైలుపాలైన ఆయన తండ్రి పేరునే లోకేశ్‌ ఎర్రడైరీలో తాటికాయంత అక్షరాలతో రాసుకుంటే మంచిదని చెబుతున్నాను.

నిన్న ఏసీబీకోర్టులో చంద్రబాబు రిమాండ్‌కు సంబంధించి దాదాపు 10 గంటలపాటు ఆయన న్యాయవాదులు వాదనలు చేశారు. వాళ్లు సరిపోరని తానే స్వయంగా వాదిస్తానని చంద్రబాబు సైతం న్యాయమూర్తి ఎదుట మాట్లాడినట్లు మనం చూశాం. అయితే, ఆయన తరఫున న్యాయవాదులు ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు ప్రజల సొమ్ము కాజేయలేదని.. అవినీతికి పాల్పడి తప్పు చేయలేదనే మాటలు మాట్లాడలేదు. ఏవేవో సాంకేతిక కారణాలు చెప్పుకున్నారు. గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని, అరెస్టు చేసి 24 గంటలు దాటిందని ఏవేవో వారి వాదనలు వారు వినిపించారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఈ స్కామ్‌పై మాట్లాడుతూ.. ఇది నాకు సంబంధంలేదు. కేబినెట్‌ తీర్మానించి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పెట్టాం.. కాబట్టి, శాసనసభ్యులంతా దీనికి బాధ్యులని చెప్పుకొచ్చారు. అంటే, తాను చేసిన తప్పును కేబినెట్, శాసనసభ మీదకు చంద్రబాబు రుద్దే ప్రయత్నం చేశాడు. ఆయనెక్కడా కూడా నేను తప్పు చేయలేదు. నేను అవినీతికి పాల్పడలేదని చెప్పలేకపోయాడు. ఎందుకంటే, అప్పటికే ఏపీ సీఐడీ ఫైల్‌ చేసిన సాక్ష్యాధారాల్ని వక్రీకరించి చెప్పడానికి నోటమాట వచ్చే పరిస్థితి అక్కడ లేదు.

చంద్రబాబు నిన్న కోర్టులో చేసిన వాదనలో.. స్కిల్ స్కాం కేబినెట్‌లో చేసిన తీర్మానాలు, శాసనసభలో జరిగిన వాటికి తనకేమీ సంబంధంలేదని అంటున్నాడు. కేబినెట్‌, ముఖ్యమంత్రిగా నీ అధ్యక్షతన జరుగుతుంది. శాసనసభలో సభానాయకుడుగా నువ్వే ఉంటావు. అలాంటిది, నీకు సంబంధంలేకుండా ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నాను. మరి, గతంలో ఇదే కేబినెట్‌ నిర్ణయాలు, శాసనసభ తీర్మానాలను వైయ‌స్ జగన్‌కి అపాదించి అవినీతి చేశారంటూ నువ్వెందుకు నిందలేశావు..? నీకో న్యాయం. ఇంకొకరికి ఇంకో న్యాయమా..? అసలు, కేబినెట్‌లో గానీ, శాసన సభలో గానీ లేని వ్యక్తి వైయ‌స్‌ జగన్‌పై అడ్డగోలుగా ఈ చంద్రబాబు ఆరోపణలు చేశాడు. ఇప్పుడేమో.. అందుకు భిన్నంగా మాట్లాడుతున్నాడు. అంటే, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఆయన నోరుతెరిస్తే విషప్రచారమే తప్ప నిజాలుండవని తెలుసుకోవచ్చు. 

చంద్రబాబు కేవలం రెండు ఎకరాల భూమితో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈరోజు దాదాపు రూ.2 లక్షల కోట్లకు అధిపతిగా ఉన్నాడంటే, ఆయన చేసిన అవినీతిదందా ఏస్థాయిలో జరిగిందో తెలుసుకోవచ్చు. కుంభకోణాలు ఒకటా రెండా.. అమరావతి రాజధాని పేరిట కట్టడాల నిర్మాణల్లోనూ కుంభకోణాలే.. ఇన్నర్‌రింగ్‌రోడ్డు స్కామ్, ఏలూరు భూముల స్కామ్, స్కిల్‌డెవలప్‌మెంట్, ఈఎస్‌ఐ తదితర స్కామ్‌ల పురాణం చెప్పాలంటే అంతాఇంతా కాదు. ఇప్పటికే ఆయనపై ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ అని పుస్తకాలు కూడా మేము గతంలోనే రిలీజ్‌ చేశాం. 

చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్‌ మొన్న రాత్రి రోడ్డుపైన పడుకున్నాడంటే అందులో అర్ధముంది. ఎందుకంటే, 2014 ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి కూర్చొబెట్టిన మూడ్నెల్ల తర్వాతే ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి బీజం పడింది. అప్పటికే, ఆయన దగ్గర ప్యాకేజీ తీసుకున్న భాగస్వామిగా పవన్‌ ఉన్నాడు. కాబట్టి స్కిల్‌ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు కొట్టేసిన రూ.371 కోట్లల్లో ఒక వాటా మొత్తాన్ని పవన్‌కు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా చెల్లించి ఉంటాడు. ఆ ప్యాకేజీలో తనకూ భాగమిచ్చాడు కనుక చంద్రబాబు రుణం తీర్చుకోవాలనే తాపత్రయంలో పవన్‌ రోడ్‌ డ్రామా నడిపాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబు జైలుకుపోతే పవన్‌ రోడ్డుమీద పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజల్లో ఆ చర్చ కూడా జరుగుతుంది. 

Back to Top