నెల్లూరు: ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "భాష.. భాష" అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పుంజులూరుపాడు గ్రామంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.30 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి ప్రారంభించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లడం, ప్రతి కుటుంబాన్ని పలకరించి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామాల్లోని ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. సీఎం వైయస్ జగన్ పరిపాలన పట్ల ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారం చూపగలిగామన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందడంతో తెలుగుదేశం నాయకులు ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై, మాపై విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకులు చివరకు అధికారులపై కూడా విమర్శలు సంధిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేత సోమిరెడ్డి మాట్లాడే భాష అతనికే మంచిగా ఉందేమో...! ప్రజలు గమనిస్తున్నారు. సోమిరెడ్డి లాంటి పిరికిపంద బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. సోమిరెడ్డి నాపై ఓడిపోయి, మంత్రిగా వెలగబెట్టినప్పుడు గ్రామాల్లో తిరగగలిగాడా..! గ్రామాల్లో సమస్యలపై దృష్టి పెట్టాడా!, వాటిని పరిష్కరించగలిగాడా...! అని ప్రశ్నించారు. వైయస్ జగన్ పరిపాలనలో అనేక సమస్యలను పరిష్కరించాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.